నిరుద్యోగులకు మోసం చేయొద్దు

ABN , First Publish Date - 2021-06-24T04:58:42+05:30 IST

జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో నిరుద్యోగులను మోసం చేయొద్దని , ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగులకు మోసం చేయొద్దు
విజయనగరంలో కరపత్రాలు విడుదల చేస్తున్న సీపీఎం ప్రతినిధులు

  జాబ్‌ క్యాలెండర్‌పై సీపీఎం,  ఏఐవైఎఫ్‌  నేతల మండిపాటు 

  పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్‌

 విజయనగరం దాసన్నపేట, జూన్‌ 23:   జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో నిరుద్యోగులను మోసం చేయొద్దని , ఖాళీగా ఉన్న  పోస్టులన్నీ భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. బుధవారం ఎల్‌బీజీ భవనంలో  ఆయన మాట్లాడుతూ...  ప్రభుత్వ కార్యాలయాల్లో  లక్షా 80 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం 10 వేల ఉద్యోగాలనే జాబ్‌   క్యాలెండర్‌లో ప్రకటించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని ఆరోపించారు. ఇందు లో భాగంగానే 3, 4, 5 తరగతులను హైస్కూల్‌కి మార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు.  ప్రాథమిక విద్యా విధానంలో మార్పులకు వ్యతిరేకంగా ఈనెల 28న నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం ప్రతినిధులు టి.సూర్యనారాయణ, రెడ్డి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. 

ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో..

పార్వతీపురం:  జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కోట అప్పన్న, పార్వతీపురం నియోజకవర్గం కార్యదర్శి బీటీ నాయుడు   డిమాండ్‌ చేశారు. ఈ  మేరకు బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్ర మం చేపట్టారు.  వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాదిగా పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 10,143 పోస్టులు భర్తీ చేసేందుకు  సర్కార్‌ నోటిఫకేషన్‌ విడు దల చేయడం సిగ్గుచేటన్నారు. మిగిలిన ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఇన్‌చార్జి ఆర్డీవో ఎస్‌.వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశామన్నారు. నిరసన కార్యక్రమానికి సీపీఐ జిల్లా సమితి సభ్యులు మద్దతు తెలిపారు.

  

 

Updated Date - 2021-06-24T04:58:42+05:30 IST