రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

ABN , First Publish Date - 2021-10-21T04:52:17+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ ఆదేశించారు.

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
సమావేశంలో కలెక్టర్‌ హరీశ్‌, ఎమ్మెల్యే పద్మారెడ్డి, అధికారులు

 జిల్లాలో 311 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

 ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా: మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌


మెదక్‌, అక్టోబరు 20: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులను మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డితో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వానాకాలంలో పండిన  ధాన్యం కొనుగోలుకు గురువారం నుంచి జిల్లాలో 311 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. దీనికనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ర్టానిక్‌ తూకం యంత్రాలు, గన్ని బ్యాగులు, టార్ఫాలిన్లు, తేమశాతం కొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 147 రారైస్‌, బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు ధాన్యం తరలించే విధంగా ట్రాన్స్‌పోర్టు లారీలకు జియో ట్యాగింగ్‌ చేయాలని సూచించారు.

 

మూడురోజులకు ఓసారి సమీక్ష


రైతులు, కేంద్రం వారిగా పంట వివరాలను కేంద్రం ఇన్‌చార్జి వ్యవసాయ విస్తర్ణాధికారులకు అందజేసి, ప్రతీ మూడు రోజులకు ఒకసారి సమీక్షించాలని కలెక్టర్‌ హరీష్‌ సూచించారు. ధాన్యం రవాణా కోసం ఇద్దరు కాంట్రాక్టర్ల నుంచి 800 లారీలను ఏర్పాటు చేయాలని, మిల్లుల వారిగా లేబర్స్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. రైతులు తమ సొంత ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించుకునేందుకు అనుమతించాలని పేర్కొన్నారు. మిల్లుల వద్ద లారీలు, ట్రాక్టర్ల వరుస విడివిడిగా ఉండేలా చూడాలన్నారు. మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే ఖాళీ చేసేలా చూడాలని, ఇందుకోసం మిల్లుల వారిగా అధికారులను నియమించాలని సూచించారు. ప్రతీ మండలానికి ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులతో పర్యవేక్షిస్తూ ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. తహసీల్దార్లు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వీఆర్వోలు కొనుగోలు కేంద్రాల్లో టోకెన్‌ ప్రకారం ధాన్యం సేకరించి, మిల్లులకు తరలించాలన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఆర్థికాభిద్ధి చెందాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, రమేష్‌, అడిషనల్‌ ఎస్పీ కృష్ణమూర్తి, డీఆర్డీవో శ్రీనివాస్‌, డీఎ్‌సవో శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం పాల్గొన్నారు.


 

Updated Date - 2021-10-21T04:52:17+05:30 IST