కంటిచూపుపై ఆ ఆలోచన సరికాదు..!

ABN , First Publish Date - 2022-08-30T17:26:02+05:30 IST

కంటి చూపు తగ్గితే, కళ్లజోడుతో సరిచేయొచ్చు అనుకుంటాం! అలా మన ఆలోచన కళ్లజోడు దగ్గరే

కంటిచూపుపై ఆ ఆలోచన సరికాదు..!

కంటి చూపు తగ్గితే, కళ్లజోడుతో సరిచేయొచ్చు అనుకుంటాం! అలా మన ఆలోచన కళ్లజోడు దగ్గరే ఆగిపోతుంది. కానీ అంతకు మించిన కొన్ని కంటి సమస్యలు, కంటి చూపు కోల్పోయే పరిస్థితికి దారి తీస్తాయి. కాబట్టి గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకోకుండా ఉండాలంటే, కంటి సమస్యలను వీలైనంత వెంటనే తగిన చికిత్సతో సరిదిద్దుకోవాలి.


ఒక కంటి చూపు తగ్గితే... ‘లేజీ ఐ’

రెండు కళ్లలో ఒక కంటి చూపు తగ్గచ్చు. లేదా రెండు కంటి చూపుల్లో తేడాలూ ఉండొచ్చు. ఈ సమస్య మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లో మొదలవుతుంది. ఒక కంటి చూపు బాగున్నప్పుడు, రెండో కంటి చూపు తగ్గినా, పిల్లలు గ్రహించలేరు. పొరపాటున మెరుగ్గా కనిపించే కన్ను మూసి, రెండో కంటితో చూస్తున్నప్పుడు తేడా తెలుస్తుంది. ఇందుకు కారణం కంటి నుంచి మెదడుకు వెళ్లే నాడి బలహీనపడడమే! ఈ సమస్యను ఎనిమిదేళ్ల లోపు పిల్లల్లో సరిదిద్దే వీలుంటుంది. అంతకంటే వయసు మీరితే, నాడి పూర్తిగా దెబ్బతిని సరిదిద్దలేని పరిస్థితి నెలకొంటుంది. 

చికిత్స ఇలా: బలహీనపడిన కంటిని స్టిమ్యులేట్‌ చేయడం ప్రధానంగా చికిత్స సాగుతుంది. మెరుగ్గా కనిపిస్తున్న కంటికి ప్యాచ్‌ పెట్టి, బలహీనపడిన కంటితో చూడడం సాధన చేయడం వల్ల, నాడి స్టిమ్యులేట్‌ అయి, చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్య తీవ్రతను బట్టి, రోజులో ఎన్ని గంటల పాటు, ఎంత కాలం పాటు ప్యాచింగ్‌ చేయాలనేది వైద్యులు నిర్ణయిస్తారు.

ఎప్పుడు అప్రమత్తమవ్వాలంటే: లేజీ ఐ వంశపారంపర్య సమస్య. తల్లితండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరూ కళ్లజోళ్లు వాడేవాళ్లైతే, పుట్టిన పిల్లల దృష్టి మీద ఓ కన్నేసి ఉంచాలి. రెండేళ్ల వయసు నుంచే కంటి వైద్యుల చేత పరీక్షలు చేయిస్తూ ఉండాలి. సమస్య ఉన్నట్టు తేలితే, కళ్లజోడు వాడుతూ చూపును మెరుగు చేసుకోవాలి. 

ఈ లక్షణాలు కీలకం: పిల్లలు టివి దగ్గరకు వెళ్లి చూడడం, లేదా కళ్లను చికిలించి చూడడం చేస్తుంటే కంటి సమస్య ఉందని అనుమానించాలి. స్కూల్లో టీచర్లు కూడా గుర్తు పట్టేస్తారు. 


కంట్లో నీటి కాసులు... ‘గ్లకోమా’

కంటి చూపు తగ్గితే, ఆప్టికల్‌ ఔట్‌లెట్‌లో క్షణాల్లో కంటి పరీక్ష చేయించుకుని కళ్లజోడు తీసుకునేవాళ్లే ఎక్కువ. అంతే తప్ప, చూపు తగ్గడానికి గ్లకోమా కారణమనీ, దానికి సమయ వెచ్చించి అయినా ప్రత్యేక పరీక్ష చేయించుకోవడం అవసరమనీ ఏ ఒక్కరూ గ్రహించరు. 

చికిత్స ఇలా: నాడి దెబ్బతినడం మూలంగా తలెత్తే ఈ కంటి సమస్యలో జరిగిన నష్టాన్ని సరిదిద్దే వీలుండకపోయినా, ఉన్న కంటి చూపు నష్టపోకుండా కాపాడుకోవచ్చు. మందులు, కొన్ని సందర్భాల్లో సర్జరీతో నష్టాన్ని అక్కడితో ఆపేయవచ్చు. అయితే గ్లకోమాను ముందుగానే కనిపెట్టాలంటే 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి కంటి వైద్యుల చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 

వీళ్లు అప్రమత్తం: అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్లలో, అత్యధిక మైనస్‌ పవర్‌ ఉన్నవాళ్లలో గ్లకోమా సమస్య తలెత్తే వీలుంటుంది. అలాగే రక్తసంబంధీకుల్లో (తల్లితండ్రులతో పాటు, ఇరువైపుల రక్తసంబంధీకులు) ఈ సమస్య ఉన్నవాళ్లకు కూడా గ్లకోమా వచ్చే వీలుంటుంది. ఈ కోవకు చెందినవాళ్లు ఏడాదికోసారి కళ్లలో డ్రాప్స్‌ వేయించుకుని, సంపూర్ణమైన పరీక్ష చేయించుకోవాలి. మైనస్‌ పవర్‌ ఉన్నవాళ్లు రెటీనా బలహీనపడి, రంధ్రాలు ఏర్పడి, లేదా చిరిగిపోయి రెటీనా డిటాచ్‌ అవుతుంది. ఇలా జరిగితే హఠాత్తుగా కంటి చూపు పోతుంది. దీన్ని రీసర్జరీతో సరిచేసే వీలున్నా, ఫలితం ఎంత త్వరగా వైద్యులను కలిశారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.

ఈ లక్షణాలు కీలకం: ఒక రకం గ్లాకోమాలో 70 నుంచి 80 శాతం కంటి డ్యామేజీ జరిగేవరకూ సమస్య అర్థం కాదు. పక్క చూపులు కుదించుకుపోతూ, ట్యూబ్యులర్‌ విజన్‌ ఏర్పడుతుంది. రెండో రకం క్లోజ్‌డ్‌ యాంగిల్‌ గ్లాకోమాలో కంట్లోని ఇరుకైన ప్రదేశాల్లో ఒత్తిడి పెరిగిపోయి, కంటి నాడి దెబ్బతింటుంది. ప్లస్‌ సైట్‌ ఎక్కువగా ఉన్నవాళ్లలో ఈ సమస్య ఎక్కువ. వీళ్లలో తలనొప్పి, కంటినొప్పి, చూపు మసకబారడం లాంటి లక్షణాలుంటాయి.




బిపి, షుగర్‌లతో...

ఈ రెండు సమస్యలూ కళ్ల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని అదుపులో ఉంచుకోకపోతే, ఆ ప్రభావం కళ్లను దెబ్బతీయడమే కాకుండా, ఏకంగా చూపునే పోగొడుతుంది. మధుమేహంతో తలెత్తే డయాబెటిక్‌ రెటినోపతీలో మైల్డ్‌, మోడరేట్‌ దశల వరకూ చేరుకుని దెబ్బతిన్న కంటి చూపును, చికిత్సతో కాపాడుకోవచ్చు. కానీ చివరి దశలో కంట్లో రక్తస్రావం జరిగిన తర్వాత, సర్జరీ చేసినప్పటికీ ఆశించినంత ఫలితం ఉండకపోవచ్చు. 

చికిత్స ఇలా: సాధ్యమైనంత వరకూ మధుమేహం, అధిక రక్తపోటు అదుపు తప్పకుండా చూసుకోవాలి. వీలైనంత త్వరగా కంటికి జరిగే నష్టాన్ని గ్రహించాలి. అవసరాన్ని బట్టి రెటీనా స్పెషలి‌స్ట్‌కు చూపించుకుంటూ ఉండాలి. చివరి దశకు చేరుకుని, సర్జరీ చేయించుకున్న తర్వాత ఆశించినంత చూపు తిరిగి రానప్పుడు, అందుకు వైద్యులను బాధ్యులను చేయడం సరికాదు. నిజానికి పూర్తిగా కంటి చూపు కోల్పోయిన వారికి సర్జరీతో రెండు నుంచి మూడు మీటర్ల దూరం చూడగలిగేలా చూపును తిరిగి తెప్పించడమనేది ఎంతో పెద్ద సవాలు. కానీ చివరి దశలో సర్జరీ కేవలం కంటికి మరమ్మత్తు లాంటిదే తప్ప, పూర్తి పరిష్కారం కాదు. 

కంట్లో పోటు: అధిక రక్తపోటుతో గుండెపోటు ఎలా వస్తుందో కంట్లో కూడా పోటు వస్తుంది. రెటీనాలో ఉండే ధమనులు, శిరల్లో దేన్లోనైనా స్ట్రోక్‌ రావచ్చు. మధుమేహంతో కంటికి ఆలస్యంగా నష్టం జరిగితే, అధిక రక్తపోటుతో హఠాత్తుగా నష్టం జరిగిపోతుంది. శిరలతో పోలిస్తే, ధమని స్ట్రోక్‌ మరింత ప్రమాదకరం. ధమని స్ట్రోక్‌కు గురైనప్పుడు ఆరు గంటల్లోగా సర్జరీ చేయకపోతే, కంటి చూపు శాశ్వతంగా పోతుంది. శిరల స్ట్రోక్‌కు లేజర్‌ ఇంజెక్షన్‌ లాంటి చికిత్సలుంటాయి.

ఈ లక్షణాలు గమనించాలి: స్ట్రోక్‌కు గురైనప్పుడు చూపు నెమ్మదిగా తగ్గిపోయి, పూర్తిగా పోతుంది. అప్పుడు ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా వైద్యులను సంప్రతించాలి.




కొన్ని వ్యాధుల మూలంగా...

ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ మూలంగా కంటి నాడుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తి ‘వ్యాస్క్యులైటిస్‌’ వస్తుంది. ఈ సమస్య చివరి దశలో రెటీనా డిటాచ్‌మెంట్‌కు దారి తీస్తుంది. అలాగే కొన్ని కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్లు కూడా కంటి సమస్యలను తెచ్చి పెడతాయి. అలాగే రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, కంటి క్షయ వల్ల కూడా కంటి వెనక నాడుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతుంది. 

చికిత్స ఇలా: సమస్య మూల కారణాన్ని గుర్తించి, చికిత్సతో సరిదిద్దడం ద్వారా కంటి సమస్యను సరిచేయవచ్చు. ఈ లక్షణాలు గమనించాలి: చూపు మసక బారి, రిపీటెడ్‌ ఎటాక్స్‌ తలెత్తుతాయి. 


కళ్లు నులుముతుంటే... ‘కెరటోకోనస్‌’

విపరీతంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వాడడం వల్ల, ఇతర కారణాలతో కళ్లను నులుముకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యలో కార్నియా పైన ఉండే పొర ఉబ్బుతుంది. దాంతో కళ్లజోడుతో కూడా కంటి చూపు మెరుగుపడదు. 

చికిత్స ఇలా: ఇది ప్రమాదకరమైన సమస్య కాకపోయినప్పటికీ, సమస్యను సకాలంలో సరిదిద్దకపోతే, క్రమేపీ కంటి చూపు తగ్గుతుంది. ఈ సమస్యను కార్నియల్‌ స్ర్కీనింగ్‌తో సకాలంలో గుర్తించి, దశను బట్టి ‘క్రాస్‌ లింకింగ్‌’ అనే చికిత్సను అందిస్తే, కార్నియా మార్పిడి వరకూ సమస్య ముదిరిపోకుండా ఆపవచ్చు. ఈ సమస్య చివరి దశ కార్నియా మార్పిడికి దారి తీస్తుంది. కళ్లజోడుకు బదులుగా ప్రత్యేకమైన కాంటాక్ట్‌ లెన్స్‌తో సైతం చూపు మెరుగుపడని పరిస్థితిలో, అంతిమంగా కార్నియా మార్పిడి చేయవలసి వస్తుంది. 

ఐ రబ్బింగ్‌ ఇలా: కళ్లు దురద పెట్టకుండా ఉండవు. అయితే అర చేతులతో కళ్లను నులుముకోకుండా, కంటి కొనల్లో వేలితో వృత్తాకారంలో సున్నితంగా రుద్దుకోవాలి. 

ఎప్పుడు అనుమానించాలి: కళ్లజోడుతో కంటిచూపు మెరుగుపడనప్పుడు కార్నియా స్ర్కీనింగ్‌ చేయించుకోవాలి. ఈ పరీక్షలో కెరటోకోనస్‌ ఉందని తేలితే అప్రమత్తం కావాలి.




-డాక్టర్‌ శ్రీ లక్ష్మి నిమ్మగడ్డ,

కాటరాక్ట్‌ అండ్‌ లాసిక్‌ సర్జన్‌,

విన్‌ విజన్‌ హాస్పిటల్స్‌,బేగంపేట, హైదరాబాద్‌



Updated Date - 2022-08-30T17:26:02+05:30 IST