Apr 12 2021 @ 21:31PM

‘వకీల్‌ సాబ్‌’ ఓటీటీలో.. అనే వార్తలు నమ్మవద్దు

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'వకీల్‌సాబ్‌'. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్‌, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్‌ చిత్రం 'పింక్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్‌కళ్యాణ్‌ నటించిన సినిమా, అలాగే మంచి సందేశాత్మక చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి నీరాజనాలు పడుతున్నారు. అయితే థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతోన్న ఈ చిత్రాన్ని రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నారంటూ.. సోమవారం ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఈ వార్తలను నిర్మాతలు ఖండించారు. 

ఏప్రిల్‌ 23న ఈ చిత్రం డిజిటల్‌ మాధ్యమంలో విడుదలవుతుందనే వార్తలను ఎవరూ నమ్మవద్దని తెలుపుతూ.. అధికారికంగా ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఓటీటీ విషయమై ఎటువంటి అగ్రిమెంట్‌ చేసుకోలేదని, దయచేసి వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని, అందరూ బిగ్‌ స్క్రీన్‌పైనే ఈ చిత్రాన్ని చూడండని.. మేకర్స్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఓటీటీలో వస్తుంది కదా.. థియేటర్‌కి ఎందుకులే.. అని ప్రేక్షకుల్ని సైడ్‌ ట్రాక్‌లోకి తీసుకెళ్లాలని కొందరు అత్యుత్సాహం ప్రదర్శించినా.. వెంటనే మేకర్స్‌ రియాక్ట్ అయి.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చేశారు.