బాధ్యత ఉండక్కర్లేదా!

ABN , First Publish Date - 2020-03-31T09:19:08+05:30 IST

చెబితే వినరు... కొడితే ఏడుస్తారు! పైగా... వాట్సాప్‌లో వీడియోలు షేర్‌ చేసి బద్నాం చేయడమొకటి! వద్దంటున్నా వినకుండా, అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్న వారి తీరుపై పోలీసుల ఆక్రోశమిది! కరోనా కట్టడి పోరులో

బాధ్యత ఉండక్కర్లేదా!

  • పదేపదే లాక్‌డౌన్‌ ఉల్లంఘనులు
  • మాటలతో చెబితే వినరు
  • లాఠీలతో కొడితే విమర్శలు
  • అత్యవసర సేవలకు మినహాయింపు
  • వారిని గుర్తించేదెలాగో తెలియదు
  • అనుమతి పత్రాలు ఇవ్వని ప్రభుత్వం
  • కట్టడి ‘ఒత్తిడి’లో పోలీసు యంత్రాంగం
  • సామాజిక శిక్షలతోనే పరిష్కారం


(అమరావతి - ఆంధ్రజ్యోతి): చెబితే వినరు... కొడితే ఏడుస్తారు! పైగా... వాట్సాప్‌లో వీడియోలు షేర్‌ చేసి బద్నాం చేయడమొకటి! వద్దంటున్నా వినకుండా, అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్న వారి తీరుపై పోలీసుల ఆక్రోశమిది! కరోనా కట్టడి పోరులో ప్రధానంగా కనిపిస్తున్నది ఇద్దరే! ఒకటి... వైద్య సిబ్బంది! రెండు... పోలీసులు! క్లిష్టమైన ఈ సమయంలో, జనం రోడ్లెక్కకుండా కట్టడి చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఎలాంటి అవసరం లేకున్నా రోడ్లెక్కడం, ఎందుకొచ్చారని ప్రశ్నిస్తే అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పడం, కొన్నిచోట్ల ‘ఆపడానికి మీరెవరు? ఏ సెక్షన్‌ కింద ఆపుతున్నారు?’ అని పిచ్చి ప్రశ్నలు సంధించడం వంటివీ జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించక తప్పడంలేదు. ముందు జరిగిన తంతు ఎలాగున్నా, సరిగ్గా పోలీసులు కొడుతున్న దృశ్యాలు మాత్రమే వాట్సా్‌పలో షేర్‌ అవుతున్నాయి! అలాగని... ఏమిటి, ఎవరు అని అడక్కుండా ఎడాపెడా కొట్టేస్తున్న సంఘటనలు లేవా, అంటే అవీ ఉన్నాయి. అక్కడక్కడ కొందరు పోలీసులు దూకుడుగా, నేరుగా లాఠీలకు పని చెబుతున్నారు.


‘విచక్షణ’ ఎలా?

పోలీసులు ప్రస్తుతం తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్నారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. ఒకవైపు జనం కోసం తాము ఇంతగా శ్రమిస్తుండగా... మరోవైపు కొందరు బాధ్యతలేకుండా రోడ్లపైకెక్కడమేమిటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడక్కడా లాఠీలు పైకి లేస్తున్నాయి. రైతులు, రైతు కూలీలు, నిత్యావసరాల రవాణా, ఇతర అత్యవసర విభాగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే సంబంధిత రంగాలకు చెందిన వారు విధి నిర్వహణ కోసం బయటికి రావొచ్చు. కానీ వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు/అనుమతి పత్రాలు ఇవ్వలేదు. పై స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ... దీనిపై పోలీసులకు సమాచారం అందడంలేదు. మరి ఎవరు, ఎందుకు బయటికి పోలీసులు గుర్తించేదెలా? సరిగ్గా ఇక్కడే సమస్య వస్తోంది. అనుమతిపత్రాలను జారీ చేసినట్లయితే తమకు  సమస్య ఉండదని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.


ప్రత్యామ్నాయం ఏమిటి?

పొలానికి వెళ్తున్న రైతును కొట్టడం, పిల్లల ముందే తండ్రిని కొట్టడం వంటి ఘటనలు పోలీసులపై విమర్శలకు కారణమయ్యాయి. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిని దండించకుండా... ‘సామాజిక’ శిక్షలు వేయాలనే సూచనలు వస్తున్నాయి. అనవసరంగా బయటికి వచ్చిన వారి వాహనాలను సీజ్‌ చేయాలి. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై ప్లకార్డులు పట్టించి, ప్రధాన రహదారుల్లో మూడు నాలుగు గంటలు నిలబెట్టాలి.పారిశుధ్య సిబ్బందికి సహాయకారులుగా నియమించాలి. పదేపదే అకారణంగా బయటికి వచ్చే వారిపై కేసు పెట్టి... మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలి.

Updated Date - 2020-03-31T09:19:08+05:30 IST