తాటాకు చప్పుళ్లకు బెదరను

ABN , First Publish Date - 2022-05-14T08:29:16+05:30 IST

తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు.

తాటాకు చప్పుళ్లకు బెదరను

  • కేటీఆర్‌కు దమ్ముంటే ఇంటర్‌ విద్యార్థుల..
  • ఆత్మహత్యలపై సీబీఐ విచారణ కోరాలి
  • హామీలిచ్చి మోసం చేస్తున్న కల్వకుంట్ల
  • కుటుంబంపై 420 కేసులు పెట్టాలి
  • లీగల్‌ నోటీసులపై బండి సంజయ్‌ ధ్వజం
  • మాకు అధికారమిస్తే ఉచిత విద్య, వైద్యం
  • మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం
  • ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌


రంగారెడ్డి అర్బన్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానంటూ మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా  ధ్వజమెత్తారు. తాటాకు చప్పుళ్లకు భయపడనని తెగేసి చెప్పారు. ప్రజల తరఫున పోరాడుతున్నానని, వాస్తవాలే  మాట్లాడుతున్నానని అన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే, ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకపోతే, ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని భావిస్తే.. సీబీఐ విచారణ జరపాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయాలని సవాల్‌ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం గేటు సమీపంలో శుక్రవారం రాత్రి మీడియాతో,  అంతకుముందు పాదయాత్రలో సంజయ్‌ మాట్లాడారు. ‘‘మీ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్‌ విద్యార్థులు చనిపోయారు. పేద బిడ్డలు చనిపోతే నీ తండ్రి కనీసం స్పందించలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు గోడు వినిపించుకోవడానికి వెళ్తే  పోలీసులతో లాఠీచార్జి చేయించిన కుటుంబం మీది. అంతేకాక, నిరుద్యోగుల మరణాలకు మీరే కారణం. ఆర్‌టీసీ కార్మికులు, రైతులు, ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణం’’ అని సంజయ్‌ ఆరోపించారు. దళితుణ్ని సీఎం  చేస్తానని మాట మార్చినందుకు, మూడు ఎకరాలు ఇస్తానని మోసం చేసినందుకు కల్వకుంట్ల కుటుంబంపై 420 కేసు నమోదు చేయాలని అన్నారు. 


హిందూ కులవృత్తులు నిర్వీర్యం..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్‌ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాగులదోని (ఎన్డీ) తండా, దయ్యాల గుండు తండా, మహేశ్వరం గ్రామంలో ప్రజా సంగ్రామయాత్రలో ఆయన మాట్లాడారు. హిందూ కులవృత్తులను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, తండాలకు నిధులు కేటాయించడంలేదని ధ్వజమెత్తారు. ఎన్డీ తండాలో రూ.350 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, భాగ్యనగరంలోని హిందూ సమాజాన్ని ఏకం చేసి ఎంఐఎంకు బుద్ధి చెబుతామని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరాక మహేశ్వరం  ఎంత అభివృద్ధి చెందిందో సమాధానం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more