యూపీ, బీహార్ సోదరుల్ని పంజాబ్‌ రానివ్వకండి : సీఎం చన్నీ

ABN , First Publish Date - 2022-02-16T18:38:50+05:30 IST

ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటపుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అక్కడే ఉన్నారు. ఆమె చిరునవ్వులు చిందించారు. యూపీ, బిహార్...

యూపీ, బీహార్ సోదరుల్ని పంజాబ్‌ రానివ్వకండి : సీఎం చన్నీ

చండీగఢ్ : ఉత్తర ప్రదేశ్, బిహార్ సోదరులను పంజాబ్‌లో ప్రవేశించనివ్వొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత చరణ్ జిత్ సింగ్ చన్నీ పిలుపునిచ్చారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటపుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అక్కడే ఉన్నారు. ఆమె చిరునవ్వులు చిందించారు.  యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందిన బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ వెళ్తున్న నేపథ్యంలో  చన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.


పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్ జిత్ సింగ్ చన్నీ. టెలీ ఓటింగ్‌ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చన్నీ పేరును ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చన్నీలలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలో తెలియజేయాలని కోరినపుడు, అత్యధికులు చన్నీనే సమర్థించారు.


చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో దళిత ఓటర్ల మనసు గెలుచుకోవచ్చునని కాంగ్రెస్ భావిస్తోంది. పంజాబ్ జనాబాలో దాదాపు 32 శాతం మంది దళితులు ఉన్నారు. జాట్ సిక్కులు పంజాబ్ రాజకీయాల్లో ప్రముఖ స్థానంలో ఉన్నారు. దళిత నేత ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి. 


117 స్థానాలున్న పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 

 

Updated Date - 2022-02-16T18:38:50+05:30 IST