ఆ బిల్లులను ఆమోదించకండి.. ప్లీజ్‌!

ABN , First Publish Date - 2020-07-14T08:31:20+05:30 IST

పరిపాలన వికేంద్రీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల

ఆ బిల్లులను ఆమోదించకండి.. ప్లీజ్‌!

  • ఆమోదిస్తే మాతోపాటు అందరికీ చేటే
  • రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్‌ చేయండి
  • వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై
  • గవర్నర్‌కు అమరావతి రైతుల అభ్యర్థన
  • వేలకొద్దీ వినతులు పంపేందుకు సమాయత్తం

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): పరిపాలన వికేంద్రీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లుతోపాటు ఏపీసీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును ఆమోదించరాదని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను అభ్యర్థించేందుకు అమరావతి రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ రెండు బిల్లులు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించడమే కాకుండా ప్రజల ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తాయని పేర్కొంటున్నారు. అంతేకాదు, సహజ న్యాయసూత్రాలకు సైతం ఈ బిల్లులు విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల వాటిని రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్‌ చేయాలని రైతులు కోరుతున్నారు.


ఈ నేపథ్యంలో గవర్నర్‌కు వేలాది వినతిపత్రాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ బిల్లులకు సంబంధించిన పూర్వాపరాలను, ఏయే కారణాల వల్ల అవి నిర్హేతుకమైనవో, దురుద్దేశ పూరితమైనవో వివరిస్తూ రూపొందించుకున్న వీటిని వచ్చే కొద్ది రోజుల్లో గవర్నర్‌కు పంపాలని నిర్ణయించారు. తద్వారా ఆయన సానుకూలంగా స్పందించి బిల్లులను ఆమోదించకుండా రిజర్వ్‌లో ఉంచుతారని రైతులు భావిస్తున్నారు. 

Updated Date - 2020-07-14T08:31:20+05:30 IST