కశ్మీర్ విషాదం ముగిసేనా?

ABN , First Publish Date - 2020-08-01T05:38:42+05:30 IST

జమ్మూ-కశ్మీర్, భారత దేశంలో అంతర్భాగమని విశాల భారతదేశ ప్రజలు నిండుగా విశ్వసిస్తున్నారు. అయితే జమ్ము, కశ్మీర్ లోయ, లద్దాఖ్ ప్రజలు ఎదుర్కొంటున్న దురవస్థల గురించి తోటి భారతీయులలో....

కశ్మీర్ విషాదం ముగిసేనా?

జమ్మూ-కశ్మీర్, భారత దేశంలో అంతర్భాగమని విశాల భారతదేశ ప్రజలు నిండుగా విశ్వసిస్తున్నారు. అయితే జమ్ము, కశ్మీర్ లోయ, లద్దాఖ్ ప్రజలు ఎదుర్కొంటున్న దురవస్థల గురించి తోటి భారతీయులలో కించిత్ కలవరం లేకపోవడం దిగ్భ్రాంతికరమైన విషయం కాదా? జమ్మూ-కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని కోల్పోయి 2020 ఆగస్టు 5కు సరిగ్గా ఒక ఏడాది పూర్తవుతుంది. 2019 ఆగస్టు 5న సృష్టించిన కొత్త కశ్మీర్ సమస్యకు మరి మన రాజ్యాంగ సంస్థ- పార్లమెంటు, న్యాయ స్థానాలు, బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ- లేవీ పరిష్కారాన్ని కనుగొనలేక పోయాయి. ఇదొక దుఃఖదాయక వైఫల్యం.


‘జమ్మూ-కశ్మీర్ ఒక పెద్ద జైలు’ అని ఒక రాజకీయ నాయకుడు వాపోయాడు. 2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసిన దరిమిలా లిఖితపూర్వక ఆదేశాలు లేకుండానే ‘గృహ నిర్బంధం’లో ఉన్న అనేక మంది రాజకీయ నేతలలో ఆయన ఒకరు.

అధికరణ 370ని ఎందుకు రద్దు చేశారు? జమ్మూ-కశ్మీర్‌ను మూడు ముక్కలు చేసి, దాని రాష్ట్ర హోదాను కేంద్ర పాలిత ప్రాంతాలుగా కుదించడం; మూడు ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కిందకు తీసుకురావడం; రాజకీయ కార్యకలాపాలను అణచివేయడం; లోబడి వుండేలా కశ్మీర్ లోయలోని 75 లక్షల మంది ప్రజలపై తీవ్ర ఒత్తిడి చేయడం; వేర్పాటు వాదాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలను సంపూర్ణంగా నిర్మూలించడం ... ఇవీ, అధికరణ 370 రద్దు వెనుక ఉన్న లక్ష్యాలు. మరి లక్ష్య పరిపూర్తి సాధించారా? ఏ లక్ష్యమూ నెరవేరనేలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆ లక్ష్యాల సాధన ఎప్పటికీ జరగబోదని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను.


కొన్ని కఠోర వాస్తవాలను చూద్దాం (వీటికి ప్రధాన ఆధారం 2020 జూలైలో విడుదలైన ‘ది ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ జమ్మూ-కశ్మీర్’ నివేదిక). 2001–-2013 సంవత్సరాల మధ్య ఉగ్రవాద సంఘటనలు 4522 నుంచి 170కి తగ్గిపోయాయి. ఉగ్రవాద దాడుల్లో మృతుల (పౌరులు, భద్రతా సిబ్బంది, మిలిటెంట్లు) సంఖ్య 3552 నుంచి 135కి తగ్గిపోయింది. 2014 నుంచి, మరీ ముఖ్యంగా 2017 అనంతరం ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన విధానాల వల్ల హింసాకాండ బాగా పెచ్చరిల్లిపోయింది. ఈ హింసాకాండ ఉధృత స్థాయిలో ఉన్న తరుణంలో 144 మంది మైనర్ బాలలతో సహా 6605 మంది రాజకీయ క్రియాశీలురను పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. మెహబూబా ముఫ్తీ సహా వారిలో పలువురు ఇప్పటికీ పోలీసు నిర్బంధంలోనే వున్నారు. ప్రజా భద్రత చట్టాన్ని విచక్షణరహితంగా ప్రయోగించారు. ఈ చట్టం కింద మొత్తం 444 కేసులు నమోదయ్యాయి. రాజకీయ నాయకులకు భద్రతను తగ్గించివేశారు. వారి గృహాల వద్ద పోలీసురక్షణ ఏర్పాట్లను ఉపసంహరించుకున్నారు. రాజకీయ నాయకుల కార్యకలాపాలు, కదలికలను పూర్తిగా కట్టడి చేశారు.


కశ్మీర్ లోయలో సర్వత్రా సైన్యాన్ని, కేంద్ర పారా మిలిటరీ దళాలను పెద్ద ఎత్తున మొహరించారు. అధికరణ 370 రద్దు అనంతరం 39,000 మంది అదనపు భద్రతా సిబ్బందిని కశ్మీర్ లోయకు తరలించారు. ఏడాది పొడుగునా లోయ అంతటా 144 సెక్షన్‌ను అమలుపరిచారు. 2020 మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలులోకి రావడంతో రాష్ట్ర పాలనా యంత్రాంగం ప్రతి సంస్థను షట్ డౌన్ చేశారు. కశ్మీర్ లోయలో ‘శాంతి’ కన్పిస్తున్నదంటే అది జాన్ ఎఫ్ కెన్నడీ చెప్పిన ‘శ్మశాన శాంతి’ మాత్రమే. ప్రాథమిక హక్కులు అన్నిటినీ తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రజా భద్రతా చట్టాన్ని, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని విచక్షణారహితంగా అమలుపరిచారు. సర్వత్రా ప్రజల కదలికలను కట్టడి చేసేందుకు ప్రతిరోజూ ఎల్లెడలా కార్డొన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. హక్కుల పరిరక్షణకు ఏర్పాటుచేసిన చట్టబద్ధ కమిషన్లనన్నిటినీ రద్దు చేశారు. జమ్మూ-కశ్మీర్‌లో స్వేచ్ఛాయుత మీడియాకు తావులేదని కొత్త మీడియా విధానం స్పష్టం చేసింది. కఠినమైన సెన్సార్ షిప్ నిబంధనలను విధించారు.


చట్టాల దుర్వినియోగానికి, న్యాయాన్ని పొందడంలో ప్రజలకు ఎదురవుతున్న కష్టనష్టాలకు ముబన్ షా, మియన్ అబ్దుల్ ఖయూమ్, గోహర్ జీలానీ, మస్రాత్ జహ్రా, సఫూరా జఫ్గర్ కేసులు దృష్టాంతాలుగా ఉన్నాయి. 2019 ఆగస్టు నుంచి ఒక్క కశ్మీర్ లోయలోనే రూ.40,000 కోట్ల విలువైన ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయని, 4,97,000 ఉద్యోగాలను నష్టపోవడం జరిగిందని కశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంచనా వేసింది. పర్యాటకుల రాక 2017లో 6,11,534 నుంచి 2018లో 3,16,424కి, 2019లో 43,000కి తగ్గిపోయింది. పండ్ల వ్యాపారం, వస్త్రాల, తివాచీలు, ఐటి, కమ్యూనికేషన్స్, రవాణా రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాజ్యాంగబద్ధత, 4 జి సర్వీసెస్ పునరుద్ధరణ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టానికి సవరణలకు సంబంధించిన కేసులతో పాటు మానవ హక్కుల నిరాకరణను సవాల్ చేస్తూ దాఖలైన అనేక ప్రజాహిత వ్యాజ్యాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణలో వున్నాయి.


1947లో జమ్మూ కశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా ఆక్షేపించింది. తదాది భారత్, పాకిస్థాన్‌ల మధ్య కశ్మీర్ సమస్య ఎడతెగకుండా నలుగుతూనే వున్నది. భారత్‌తో యుద్ధం చేసి, విజయం సాధించి, కశ్మీర్ లోయను స్వాయత్తం చేసుకోగలగడం అసాధ్యమనే సత్యాన్ని పాకిస్థాన్ గ్రహించింది. అయితే 2019 ఆగస్టు నుంచి ఒక కొత్త కశ్మీర్ సమస్య ముందుకొచ్చింది. ఈ కొత్త కశ్మీర్ సమస్యకు అనేక అంశాలున్నాయి. అవి: అధికరణ 370 రద్దు రాజ్యాంగ బద్ధత, రాష్ట్ర హోదాను కేంద్ర పాలిత ప్రాంతాలుగా కుదించడం, రాజకీయ, మానవ హక్కులను నిరాకరించడం ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, మిలిటెంట్ కార్యకలాపాలు మరింతగా పెచ్చరిల్లిపోవడం, కొత్త నివాస స్థలాల విధానం, భారత్ పట్ల కశ్మీర్ లోయ ప్రజల్లో వైమనస్యత, జమ్మూలో కొత్త నివాస స్థలాల విధానంపై ఉదాసీనత, లద్దాఖ్‌లో ఎలాంటి పాలన లేకపోవడమూ మొదలైనవి. 


జమ్మూ-కశ్మీర్, భారతదేశంలో అంతర్భాగమని విశాల భారతదేశ ప్రజలు నిండుగా విశ్వసిస్తున్నారు. అయితే జమ్ము, కశ్మీర్ లోయ, లద్దాఖ్ ప్రజలు ఎదుర్కొంటున్న దురవస్థల గురించి తోటి భారతీయులలో కించిత్ కలవరం కూడా లేకపోవడం దిగ్భ్రాంతికరమైన విషయం కాదా? లద్దాఖ్‌లో చైనా చొరబాట్లు, భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాకిస్థాన్‌ల సంయుక్త కుతంత్రాలు భారత ప్రజలను నిద్రమత్తు నుంచి మేల్కొలిపాయి. ఇది మాత్రమే సరిపోదు.


ఒక సంపూర్ణ లాక్‌డౌన్- ప్రతి ఒక్కరూ తమ ఇంటికే పరిమితవ్వడంను కశ్మీరేతర భారతదేశం అర్థం చేసుకొంటుంది. సంపూర్ణ లాక్‌డౌన్‌లో కూడా కశ్మీరేతర భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది; భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది; వార్తాపత్రికలు, టెలివిజన్ ప్రసారాలు, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటాయి; ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు పని చేస్తుంటాయి; ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉంటారు. కశ్మీర్ లోయలో ఒక సంపూర్ణ లాక్‌డౌన్ సమయంలో హక్కులను నిరాకరించే లాక్‌డౌన్ అమలవుతుంది. వాక్ స్వాతంత్ర్యం లేని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేని; వార్తా పత్రికలు, టెలివిజన్ ప్రసారాలు, మొబైల్ టెలిఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులో లేని; ఆస్పత్రుల, పోలీసు ఠాణాల, న్యాయస్థానాల సేవలు లభ్యం కాని, ప్రజా ప్రతినిధులులేని లాక్‌డౌన్ ఎలా వుంటుందో ఊహించడానికి కశ్మీరేతర భారతదేశం ఒకసారి ప్రయత్నించాలి. ఇదీ, కశ్మీర్ లోయలో నేటి పరిస్థితి, కాదు దుస్థితి.


జమ్మూ-కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని కోల్పోయి 2020 ఆగస్టు 5కు సరిగ్గా ఒక ఏడాది పూర్తవుతుంది. 2019 ఆగస్టు 5న సృష్టించిన కొత్త కశ్మీర్ సమస్యకు మరి మన రాజ్యాంగ సంస్థ- పార్లమెంటు, న్యాయస్థానాలు, బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థ-లేవీ పరిష్కారాన్ని కనుగొనలేకపోయాయి. ఇదొక దుఃఖదాయక వైఫల్యం. మన రాజకీయ దిగ్మండలంలో అబ్రహం లింకన్ లేడనే వాస్తవం ఆ దుఃఖాన్ని మరింతగా పెంచుతోంది. దేశ ప్రజల మనస్సులను మంత్రించే, హృదయాలను కదిలించే స్ఫూర్తిదాయక మాటలేవీ విన్పించడం లేదు. లింకన్ స్ఫూర్తితో ‘ఈ దేశానికి కొత్త స్వాతంత్ర్యోదయం సిద్ధించాలి; ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పాలించే ప్రభుత్వం ఈ ధరిత్రి నుంచి నశించదు’ అని మనలను ఉత్తేజపరిచే మహోదాత్తుడు ఏడీ?




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-08-01T05:38:42+05:30 IST