ఇసుక దోపిడీ తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవా?

ABN , First Publish Date - 2021-04-16T07:38:49+05:30 IST

వైసీపీ ప్రభుత్వానికి ఇసుక దోపిడీ తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇసుక దోపిడీ తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవా?
ఇసుక అక్రమ తవ్వకాల గురించి చంద్రబాబుకు వివరిస్తున్న రైతులు

 చంద్రబాబు ఆగ్రహం 


సత్యవేడు, ఏప్రిల్‌ 15: వైసీపీ ప్రభుత్వానికి ఇసుక దోపిడీ తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం సత్యవేడుకు విచ్చేసిన చంద్రబాబుకు  అరుణానది పరీవాహక ప్రాంతంలోని రైతులు కొందరు నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక  తవ్వకాలను, అడుగంటుతున్న భూగర్భ జలాలు పరిస్థితిని వివరించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం తిరుపతికి బయల్దేరిన చంద్రబాబు మార్గమధ్యంలోని సురుటుపల్లె, నందనం, సుబ్బానాయుడుకండ్రిగ,కారణి,నందనం ఇసుక రీచ్‌లను సందర్శించారు.సురుటుపల్లె రీచ్‌లో ఆనకట్ట సమీపంలో నిబంధనలకు విరుద్దంగా 32 అడుగుల మేర ఇసుక తోడిన తీరును పరిశీలించి మరీ ఇంత యథేచ్ఛగా ఎలా తవ్వకాలు జరుపుతారని ప్రశ్నించారు. సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే ఈ ఇసుక దోపిడీ జరుగుతోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, ఆదిమూలం ఇసుకను కొల్లగొట్టి కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. వీళ్ల ఇసుక దందాలతో రైతులు వ్యవసాయం మానేసి కూలీ పనులకు చెన్నై వెళ్ళాల్సిన పరిస్థితులు తలెత్తుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నది మధ్యలో రోడ్డు వేసుకుని మరీ ఇసుక తరలిస్తున్నారని, అడిగితే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని రైతులు చంద్రబాబుకు వివరించగా ఈ సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. 

Updated Date - 2021-04-16T07:38:49+05:30 IST