సీమ మేధావులు ప్రశ్నించరా?

ABN , First Publish Date - 2021-12-17T06:46:55+05:30 IST

రాయలసీమ అభివృద్ధిని నిజంగా కోరుకునేవారు మొదట సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలి. కృష్ణా జలాల్లో బచావత్ కమిషన్ కల్పించిన హక్కుల్ని కాపాడాలి....

సీమ మేధావులు ప్రశ్నించరా?

రాయలసీమ అభివృద్ధిని నిజంగా కోరుకునేవారు మొదట సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలి. కృష్ణా జలాల్లో బచావత్ కమిషన్ కల్పించిన హక్కుల్ని కాపాడాలి. శ్రీశైలం రిజర్వాయర్‌లో 798 అడుగుల నుంచి నీరు తోడుకునే అవకాశం ఉన్న ముచ్చుమర్రి పెండింగ్ పనులను ఈ పాటికే పూర్తి చేసి ఉండాలి. కానీ ఈ పనులు ఏమీ చేయలేదు. హంద్రీనీవాకు 2019 నుంచి 2021 ఆగస్టు వరకు వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.504కోట్లు మాత్రమే. ఇదే హంద్రీనీవాకు టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.4,182కోట్లు (ఆర్‌టిఐ నం: 2005/202/190). గాలేరు–నగరికి జగన్ రెడ్డి రూ.795కోట్లు ఖర్చు చేయగా, చంద్రబాబు నాయుడు రూ.2,323 కోట్లు ఖర్చు చేశారు.


ఇతర రాయలసీమ ప్రాజెక్టులపై కూడా జగన్ రెడ్డి నామమాత్రంగానే ఖర్చు చేశారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రాయలసీమ లిఫ్టు పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి చలికాచుకునే ఎత్తుగడ పన్నారు. కేంద్రం దీన్ని ఉపయోగించుకుని కృష్ణా మిగులు జలాల్లో రాయలసీమకు బచావత్ కమిషన్ కల్పించిన హక్కుల్ని లాగేసుకుంది. అయినా కేంద్రాన్ని ప్రశ్నించలేని హీనస్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి. ఇది రాయలసీమకు తీవ్రమైన హాని చేస్తోంది. రాయలసీమకు నిజంగా మేలుకోరేవారైతే రాయలసీమ మేధావుల ఫోరమ్‌ దీనిపై జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఆ పని చేయకుండా హైకోర్టు పేరుతో ప్రాంతీయతత్వం, కులతత్వం రెచ్చగొట్టే కపట నాటకం ఆడుతున్నారు. అన్ని పార్టీలు అంగీకరించిన, చట్టపర సమస్యలు లేని హైకోర్ట్ బెంచ్ కోసం ముందుగా ప్రయత్నిస్తే వెంటనే సాకారమవుతుంది. ఆ తరువాత హైకోర్టు గురించి ప్రయత్నించవచ్చు. చేతికందే ఫలాన్ని వదిలేసి చిటారు కొమ్మన ఉన్న దానికోసం ప్రాంతీయతత్వం, కులతత్వం రెచ్చగొట్టడం రాయలసీమ కోసమా, రాజకీయం కోసమా?ముచ్చుమర్రి, ఆర్.డి.ఎస్, గుండ్రేవుల, వేదవతి, హంద్రీనీవా కాలువ సామర్థ్యం 10వేల క్యూసెక్కులకు పెంచి పనులు పూర్తి చేయడానికి తగు స్థాయిలో నిధులు కేటాయించలేదు. రాయలసీమకు చట్టబద్ధమైన నీటి కేటాయింపులు 144 టీఎంసీలలో 60శాతం మాత్రమే రిజర్వాయర్లలో  నింపగలుగుతున్నారు. రిజర్వాయర్ల రైతుల భూములకు పరిహారం ఇవ్వనందున సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేయలేకపోతున్నారు. రైతు భూముల పరిహారానికి తగుస్థాయిలో నిధులు మంజూరు చేయలేదు. గండికోటలో రైతుల్ని ముంచారు. అవినీతికి పాల్పడ్డారు. ప్రశ్నించిన వారిని హత్య చేశారు. గాలేరు-నగరి రెండవదశ ప్రాజెక్టు నిర్మాణాలకు నిధులు మంజూరు లేదు.


శ్రీశైలం రిజర్వాయర్ జలాలను 798 అడుగుల నుంచి నీరు తీసుకొనే విధంగా ఏర్పాటు చేయబడింది. ఇందులో హంద్రీనీవా కెనాల్‌కు 12 పంపుల ద్వారా 3850 క్యూసెక్కులు సరఫరా చేసే విధంగా చంద్రన్న ప్రభుత్వం పంప్ హౌస్‌ను నిర్మించింది. అలాగే మరో నాలుగు పంపుల ద్వారా 1000 క్యూసెక్కులు కె.సీ. కెనాల్, ఎస్.ఆర్.బీ.సీ అవసరాల కోసం ఏర్పాటు చేసి సెప్టెంబరు 8, 2017న చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. హంద్రీనీవా కోసం ఉద్దేశింపబడిన 12 పంపుల పెండింగ్ పనులను జగన్ రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా పూర్తి చేయలేదు. నిజంగా సీమ సాగు తాగు నీటి ప్రయోజనాలను కాంక్షించే ప్రభుత్వమైతే ముందుగా ముచ్చుమర్రి పూర్తి చేసి ఉండాలి. ముచ్చుమర్రిపై చంద్రబాబు పాలనా కాలంలో లేని కోర్టు వివాదాలు జగన్ రెడ్డి పాలనలో ఎందుకు వచ్చాయి? రాయలసీమ లిఫ్ట్ పేరుతో ప్రాంతీయ చిచ్చు పెట్టకుండా ముందుగా ముచ్చుమర్రి చేపట్టి ఉంటే ఈ పాటికే పూర్తి అయ్యి ఉండేది కాదా? 


అలాగే మాల్యాల వద్ద హంద్రీనీవా మెయిన్ కెనాల్‌కు పంప్ చేయడానికి 12 పంప్‌లను టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఆరు లేదా ఏడు పంప్‌లనే వాడుతున్నారు. ఐదు పంప్‌లను నిరర్థకంగా పెట్టారు. మెయిన్ కెనాల్ బెడ్ వెడల్పు 11 మీటర్లే ఉన్నది. దీన్ని 19 మీటర్లకు పెంచి తద్వారా 12 పంపులు పని చేయించి 10వేల క్యూసెక్కుల నీరు తీసుకొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ హంద్రీనీవా మెయిన్ కాలువ పెండింగు పనులకు జగన్ రెడ్డి ప్రభుత్వం తగుస్థాయిలో నిధులు కేటాయించలేదు. 


హంద్రీనీవాలో భాగంగా నిర్మించిన గొల్లపల్లి రిజర్వాయరు జలాలను అందుబాటులోకి తెచ్చినందున చంద్రబాబు ప్రభుత్వం కియా కార్ల పరిశ్రమను అనంతపురం జిల్లాకు తేగలిగింది. దీని వల్ల  ఎకరం రూ.5లక్షలు ఉన్న రైతుల భూముల విలువ 50లక్షల నుంచి కోటి రూపాయల దాకా వెళ్లింది. అనేక అనుబంధ పరిశ్రమలు వచ్చి వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి వచ్చే అవకాశం ఏర్పడింది. అయితే వైసీపీ ఎంపీ ఆ ఫ్యాక్టరీపై చేసిన దౌర్జన్యం వల్ల అనుబంధ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాయి. టీడీపీ తమ పాలనలో రాయలసీమలో 7వేల మె.వా. సోలార్, విండ్ ప్రాజెక్టులు నిర్మించి 13వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి కలిగేలా చేసింది. కాని జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క సోలార్ పరిశ్రమను కూడా రాయలసీమలో స్థాపించకుండా రాజస్థాన్ సోలార్ ప్రాజెక్టుల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నది. దీనిపై ఉద్యమించని రాయలసీమ మేధావులను వైసీపీ రాజకీయ ఏజంట్లనే అనుకోవాలి. రాయలసీమలో వ్యవసాయ బోరు బావులు ఎక్కువ. విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టడమంటే రైతు మెడకు ఉరి బిగించడమే. దీనిపైనా మేధావుల నుంచి ఏ వ్యతిరేకతా వ్యక్తం కావటం లేదు.


రాయలసీమ అభివృద్ధి సింహాభాగం టీడీపీ హయాంలోనే జరిగింది. కర్నూలు జిల్లాలో రూ.6వేల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద సోలార్ పార్క్, రూ.20,610 కోట్లతో పాణ్యం మండలంలో 2 గిగావాట్ల రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టు, రూ.88.5 కోట్లతో ఓర్వకల్లు విమానాశ్రయం, పది వేల ఎకరాల్లో పారిశ్రామిక వాడ, రూ.2,960 కోట్ల పెట్టుబడితో జైరాత్ ఇస్పాత్, జైన్ ఇరిగేషన్ సిస్టం, రూ.365 కోట్ల పెట్టుబడితో ఆహార శుద్ధి పరిశ్రమ, నందికొట్కూరులో రూ.650 కోట్ల పెట్టుబడితో మెగా సీడ్ పార్క్... ఇలా ఇంకెన్నో పెట్టుబడులు తరలి వచ్చాయి. అనంతపురం జిల్లాలో- కియా, హ్యూండాయ్ డైమోస్ ఇండియా, మోబిస్ ఇండియా, హ్యూండాయ్ స్టీల్, గ్లోవిస్ ఇండియా, మరో 20 పరిశ్రమలు వచ్చాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగింది. కడప జిల్లాలో- శిథిలావస్థలో ఉన్న ఒంటిమిట్ట రాముడికి వైభోగం తీసుకొచ్చారు. గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. కడప దర్గాను అజ్మీర్ దర్గాకు తీసిపోకుండా అభివృద్ధి చేశారు. ఇప్పుడు దేశంలో తయారవుతున్న ప్రతి పది ఫోన్లలో రెండు చిత్తూరు జిల్లా నుంచే తయారవుతున్నాయి. వరల్డ్ జెయింట్ ‘ఫాక్స్ కాన్’ వచ్చింది. సెల్ కాన్, కార్బన్, డిక్సస్ వచ్చాయి. తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రారంభమైంది. ఇక్కడ ఉన్న విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారింది. ఎయిర్ పోర్టులు ఉంటే పరిశ్రమలు వస్తాయి. టీసీఎల్‌, హీరో మోటార్స్‌, అపోలో, అరవింద్‌ మిల్స్‌, జియో, కర్లాన్‌, కజరియ సెరామిక్స్‌, గోల్కొండ ఎక్స్‌పోర్ట్స్‌, రాక్‌మాన్‌ ఇండస్ట్రీస్‌, అక్సోరా, రిసోర్సెస్‌, ఫార్మ్‌గేట్‌ అగ్రో, కాంటినెంటల్‌ కాఫీ, ఎస్‌ఆర్‌కె ఫుడ్‌ పార్క్‌, మునోత్‌ ఇండస్ట్రీస్‌, విశ్వ అప్పారెల్స్‌ వంటి పరిశ్రమలు నెలకొల్పాం. ఐఐటి, ఐఐఎస్‌ఇఆర్‌ వంటి జాతీయస్థాయి విద్యా సంస్థలు వచ్చాయి.


అమరావతి వల్ల రాయలసీమకు, ఉత్తరాంధ్రకు లబ్ధి జరుగుతుంది.- రైతులిచ్చిన భూముల వల్ల ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్ల సంపద అమరావతిలో ఏర్పడింది. ఇందులో రాజధాని నిర్మాణానికి పోను లక్షకోట్లు పైగా ప్రభుత్వానికి మిగులుతుంది. ఈ నిధుల్ని 13 జిల్లాలకు ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఖర్చు చేయవచ్చు. రాజధాని మూడుముక్కలైతే అక్కడ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం వల్ల 13 జిల్లాల అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడుతుంది. అప్పులు పెరిగి వడ్డీల చెల్లింపులకోసం ప్రజలపై పన్నుల భారం మోపుతారు. ఈ అప్పుల విపత్తు నుండి, పన్నుల భారాల నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగేది అమరావతి. అమరావతిపై గుడ్డి ద్వేషాన్ని విడనాడాలి. లేకుంటే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదు.

గురజాల మాల్యాద్రి

చైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్, తిరుపతి

Updated Date - 2021-12-17T06:46:55+05:30 IST