ఇంటికెళ్లాలి.. కొవిడ్‌ పరీక్షలు చేయండి

ABN , First Publish Date - 2020-05-27T07:48:41+05:30 IST

విదేశాల నుంచి వచ్చి 14 రోజుల హోటల్‌ క్వారంటైన్‌ ముగించుకున్నవారు.. తమలో కరోనా లక్షణాలు లేవనే భరోసా కోరుతున్నారు. ఇళ్లలో చిన్న పిల్లలు, వయో వృద్ధులు...

ఇంటికెళ్లాలి.. కొవిడ్‌ పరీక్షలు చేయండి

  • ఇంట్లో వృద్ధులు, చిన్నారులున్నారు
  • టెస్టులు చేయించుకుంటే భయం పోతుంది..
  • క్వారంటైన్‌ ముగిసిన మహిళ విన్నపం
  • లక్షణాలున్నవారికే పరీక్షలంటున్న అధికారులు
  • నిబంధనల తీరుతో ఆందోళన

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి వచ్చి 14 రోజుల హోటల్‌ క్వారంటైన్‌ ముగించుకున్నవారు.. తమలో కరోనా లక్షణాలు లేవనే భరోసా కోరుతున్నారు. ఇళ్లలో చిన్న పిల్లలు, వయో వృద్ధులు ఉన్నారని.. వారి మధ్యకు పరీక్షల నిర్ధారణ జరగకుండా ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. తమను పంపేముందు కొవిడ్‌ పరీక్షలు చేయమంటున్నారు. లక్షణాలు లేనందున పరీక్షలు అవసరం లేదని అధికారులు చెప్పడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రజలు, విద్యార్థులు కొందరు ప్రత్యేక విమానాల ద్వారా ఇటీవల రాష్ట్రానికి వచ్చారు. వీరిని క్వారంటైన్‌కు తరలించారు. గడువులోగా వైరస్‌ లక్షణాలు లేకుంటే ఇళ్లకు పంపిస్తామని ప్రభుత్వం చెప్పింది.  ఆ గడువు ముగిసిన దృష్ట్యా తమ శాంపిళ్లను కూడా సేకరించి పరీక్షలకు పంపితే ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని వీరిలో కొందరు కోరుతున్నారు. కనీసం ప్రైవేటు ల్యాబ్‌లలోనైనా పరీక్షలకు అనుమతించాలని ఖర్చును భరిస్తామని చెబుతున్నా.. పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌ నుంచి ఈ నెల 14న హైదరాబాద్‌ వచ్చిన మహిళకు బుధవారంతో క్వారంటైన్‌ ముగియనుంది.


అధికారులు ఆమెను మంగళవారమే ఇంటికి వెళ్లవచ్చని చెప్పారు. కరోనా పరీక్ష చేయించమని ఆమె కోరారు. తన ఇంట్లో 70 ఏళ్లకు పైబడిన వృద్ధురాలు, పదేళ్ల పాప, పక్క ఫ్లాట్‌లో నవజాత శిశువు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇదే సంగతి వివరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమవారం మెయిల్‌ పంపించారు. రాష్ట్ర కొవిడ్‌-19 హెల్ప్‌ డెస్క్‌, కంట్రోల్‌ రూమ్‌, రెవెన్యూ, పర్యాటక శాఖల అధికారులకు కూడా మెయిల్‌ చేశారు. కానీ, అధికారుల నుంచి స్పందన రాలేదు. మహారాష్ట్రలో లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేసి పంపిస్తున్నారని తెలిపారు. కోరితే పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలంటున్నారు.


Updated Date - 2020-05-27T07:48:41+05:30 IST