ఇంటింటి జ్వర సర్వే చేయండి

ABN , First Publish Date - 2022-01-21T05:33:44+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఇంటింటి జ్వర సర్వే చేయండి

 కరోనా సోకిన వారికి వైద్యసేవలందించండి

  వీడి యోకాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు 

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి20: జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం పంచాయతీరాజ్‌ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్రప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో కలిసి కోవిడ్‌ నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్‌ , జిల్లా వైద్యశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కోవిడ్‌ పాజిటివ్‌ రేట్‌, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఫీవర్‌ సర్వే ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని ఆ ప్రక్రియ పట్ల నీతి అయోగ్‌ సైతం ప్రశంసించిందని తెలంగాణ దేవానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇంటింటా ఆరోగ్యం పేరుతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వే చేసి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌,మునిసిపల్‌ శాఖను భాగస్వామ్యం చేసి ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రతి రోజు నివేధికలను అందించాలని సూచించారు. ప్రతి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగిరం చేసి నూరుశాతం పూర్తిచేయాలని కోరారు. 15 నుంచి 18 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని, బూస్టర్‌ డోస్‌ను సైతం వేగిరం చేయాలన్నారు. ఇంటింటి సర్వేలో హెల్త్‌ వర్కర్లతో పాటు పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ సిబ్బందితో టీమ్‌ ఏర్పాటు చేసుకుని ప్రతి ఇంటికీ వెళ్లి అందిరితో మాట్లాడి కరోనా లక్షణాలు ఉంటే వెంటనే హోం ఐసోలేషన్‌ కిట్స్‌ అందించాలని ఆదేశించారు. హోం ఐసోలేషన్‌లో వ్యాధి లక్షణాలు తగ్గని వారిని అవసరం మేరకు సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్‌ పేషెంట్‌గా ఇన్‌పేషంట్‌గా సేవలను అందించడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. పోలీస్‌శాఖ సమన్వయంతో ప్రజలు గుంపులుగా కాకుండా చూడాలని మాస్క్‌ ధరించే విధంగా కోవిడ్‌ నిబంధనలను పాటించేలా చూడాల న్నారు. గర్భిణీ  కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ వార్డులు కేటాయిం చాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్‌ ్సలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, నగరపాలక సంస్థ కమీషణర్‌ ఆదర్శ్‌ సురభి, శిక్షణ కలెక్టర్‌ బి రాహుల్‌, జడ్పీ సీఈవో వింజం వెంకట అప్పారావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి మాలతి, జిల్లా సర్వెలెన్స్‌ అధికారి డాక్టర్‌ రాజేష్‌, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

 సర్వసిద్దంగా ఉన్నాం: కొత్తగూడెం కలెక్టర్‌ అనుదీప్‌ 

కొత్తగూడెం కలెక్టరేట్‌: జిల్లాలో కరోనా మూడో వేవ్‌ను అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ అనుదీప్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిష్‌రావుకు వివరించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి కరోనా నియంత్రణ, జ్వరంసర్వే అంశాలపై  కలెక్టర్‌తో ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో వ్యాధి నిర్థారణ పరీక్షలకు 1.15లక్షల రాపిడ్‌ కిట్స్‌, 58వేల హోంఐసోలేషన్‌ కిట్స్‌ అందుబాటులో ఉంచిన్నట్లు తెలిపారు. మణుగూరు ఆసుపత్రిని ఐసోలేషన్‌ కేంద్రంగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ 105శాతం, రెండో డోస్‌ వ్యాక్సిన్‌ 82శాతం, టీనేజర్లకు 57శాతం పూర్తి చేశామన్నారు. అన్ని వ్యాక్సిన్‌ ప్రక్రియను ఈనెలలో పూర్తి చేస్తామన్నారు. కొవిడ్‌ మృతులకు ఆర్థికసాయం అందించేందుకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను రెండు రోజుల్లో పోర్టర్‌లో అప్‌లోడ్‌ చేస్తామని మంత్రికి వివరించారు. 

 పాజిటివ్‌ కేసులను గుర్తించాలి

 వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

ఖమ్మంకలెక్టరేట్‌, జనవరి20: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి పాజిటివ్‌ ఉన్నవారిని గుర్తించాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, గ్రామస్థాయి మునిసిపల్‌ సిబ్బంది బృందాల్లో ప్రతి ఇంటినీ సందర్శించాలని ఆయన ఆదేశించారు. గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల ప్రత్యేక అధికారులతో మాట్లాడారు.  కొవిడ్‌ 19మూడోదశ అధికంగా కేసులు నమోదువుతున్న నేపథ్యంలో జనసమూహాలు లేకుండా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 18 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికీ రెండు డోసులు టీకా తీసుకునేలా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. ప్రజలకు పూర్తి రక్షణ కల్పించేందుకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే ఆయుధమని జిల్లాలో ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించి వారంలోగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలన్నారు. వ్యాక్సినేషన్‌లో వెనుకబడిన మండలాల్లో ప్రత్యేక అధికారులు వ్యాక్సినేషన్‌ పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హెచ్చరించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌, అడిషనల్‌ డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి మాలతి, జడ్పీ సీఈవో వింజం వెంకట అప్పారావు, జిల్లా సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ రాజేష్‌, ఆర్డీవో రవీంద్రనాధ్‌, కలెక్టరేట్‌ ఏవో మదన్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T05:33:44+05:30 IST