‘ఉచితాలు’ కాదు.. ఉద్ధరించేవి

ABN , First Publish Date - 2022-08-17T06:43:39+05:30 IST

ఉచిత పథకాల అమలుపై మరో పార్టీ సుప్రీంకోర్టులో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇంతవరకు కాంగ్రెస్‌, ఆప్‌లు వీటిపై అప్లికేషన్లు సమర్పించగా, తాజాగా డీఎంకే ఆ బాటలో నడిచింది. వీటిని ఎంతమాత్రం ఉచిత..

‘ఉచితాలు’ కాదు.. ఉద్ధరించేవి

పేదల కోసం ఆ పథకాలు ఉండాల్సిందే 

సుప్రీంకోర్టుకు తెలిపిన డీఎంకే


న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఉచిత పథకాల అమలుపై మరో పార్టీ సుప్రీంకోర్టులో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇంతవరకు కాంగ్రెస్‌, ఆప్‌లు వీటిపై అప్లికేషన్లు సమర్పించగా, తాజాగా డీఎంకే ఆ బాటలో నడిచింది. వీటిని ఎంతమాత్రం ఉచిత పథకాలని అనకూడదని, పేదలకు సామాజిక, ఆర్థిక న్యాయం అందించడం కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలుగా భావించాలని కోరింది. రాజ్యాంగంలోని 38 అధికరణం ప్రకారం ఆర్థిక న్యాయాన్ని కలిగించి, అంతరాలు తొలగించాల్సి ఉందని తెలిపింది. అందుకోసం నిరుపేదలకు కనీస అవసరాలనే అందిస్తున్నామని పేర్కొంది. తమిళనాడులో పేదలకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని పేర్కొంది.


దీని వల్ల పేదల జీవన ప్రమాణాలు పెరగడంతోపాటు, వారి పిల్లల విద్యాబుద్ధులు కూడా మెరుగయ్యాయని వివరించింది. అందువల్ల ఇలాంటి బహుళ ప్రయోజనకర విధానాలను ఉచిత పథకాలుగా పరిగణించకూడదని పేర్కొంది. ఈ వ్యాజ్యంలో పిటిషనర్‌ ప్రతివాదిగా కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చకపోవడాన్ని తప్పుపట్టింది. రాష్ట్రాల్లోని పార్టీలపైనే ఆయన దృష్టి పెట్టారని విమర్శించింది. కేంద్రం విదేశీ కంపెనీలకు ఇచ్చే ట్యాక్స్‌ హాలిడేస్‌, పెద్ద సంస్థల రుణాల రద్దును కూడా ఉచితాలుగా పరిగణించాలనిపేర్కొంది. 


వృథా ప్రయాసే: ఆప్‌

ద్రవ్యలోటును అదుపులోకి తీసుకురావడానికి ఎన్నికల హామీలు, పథకాలపై ఆంక్షలు విధించాలనుకోవడం వృథా ప్రయాసే అవుతుందని సుప్రీంకోర్టుకు ఆప్‌ తెలిపింది. తగిన చట్టాలు చేయకుండా ఎన్నికల హామీలపై పరిమితులు పెట్టాలనుకుంటే అది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొంది. 

Updated Date - 2022-08-17T06:43:39+05:30 IST