తమిళనాడు గవర్నర్ ‘ఎట్ హోం’ విందుకు డీఎంకే డుమ్మా!

ABN , First Publish Date - 2022-04-14T22:08:21+05:30 IST

నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) నుంచి రాష్ట్రానికి

తమిళనాడు గవర్నర్ ‘ఎట్ హోం’ విందుకు డీఎంకే డుమ్మా!

చెన్నై : నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలనే అంశంపై తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం నిర్వహిస్తున్న ‘ఎట్ హోం’ విందుకు దూరంగా ఉండాలని డీఎంకే నిర్ణయించింది. గ్రామీణ విద్యార్థుల ప్రయోజనాలకు నీట్ వ్యతిరేకమని డీఎంకే ఆరోపిస్తోంది. 


నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ శాసన సభ ఆమోదించిన మొదటి తీర్మానాన్ని గవర్నర్ రవి తిప్పి పంపించారు. దీంతో రెండో తీర్మానాన్ని శాసన సభ ఆమోదించి, మళ్ళీ గవర్నర్‌కు పంపించింది. దీనిపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 


తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు, ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తాము పంపిన రెండో తీర్మానాన్ని ఆమోదించడం గురించి అడిగారు. అనంతరం తెన్నరసు విలేకర్లతో మాట్లాడుతూ, రెండో తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించవలసి ఉందని, అయితే తాను ఇంకా పరిశీలిస్తున్నానని ఆయన చెప్పారని తెలిపారు. ప్రజాస్వామిక విలువలకు అనుగుణంగా శాసన సభ కార్యకలాపాలు జరుగుతాయన్నారు. శాసన సభ ఏకగ్రీవంగా రెండోసారి తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. ఇది ఇప్పటికీ రాజ్‌భవన్‌లోనే ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఎట్ హోం విందుకు హాజరుకాకూడదని నిర్ణయించామని చెప్పారు. తమ నిర్ణయాన్ని రాజ్ భవన్‌కు తెలియజేశామన్నారు. నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారని చెప్పారు. అయినప్పటికీ ఫలితం కనిపించడం లేదన్నారు. 


Updated Date - 2022-04-14T22:08:21+05:30 IST