రాజకీయాల్లోకి రావొద్దంటూ రజినికాంత్‌పై డీఎంకే ఒత్తిడి..?

ABN , First Publish Date - 2020-10-13T17:43:57+05:30 IST

తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయం మరింత వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు కొత్త పార్టీలు, కొత్తగా వచ్చే పార్టీలతో తమిళనాడు రాజకీయం

రాజకీయాల్లోకి రావొద్దంటూ రజినికాంత్‌పై డీఎంకే ఒత్తిడి..?

చెన్నై: తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయం మరింత వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు కొత్త పార్టీలు, కొత్తగా వచ్చే పార్టీలతో తమిళనాడు రాజకీయం హోరెత్తుతోంది. ముఖ్యంగా తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎప్పుడెప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తారా? రాజకీయ పార్టీని ప్రకటిస్తారా? అని అభిమానులు, ప్రజలతో పాటు పొలిటికల్ పార్టీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో రజనీ రాజకీయ పార్టీ స్థాపనపై తమిళనాడులోని అధికార ప్రతిపక్ష పార్టీలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే తమిళనాట ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. రాజకీయ ప్రవేశం చేయవద్దంటూ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే రజనీకాంత్‌పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం గుప్పుమంటోంది. ఇదే విషయమై డీఎంకే పెద్దలు రజనీకి అత్యంత సన్నిహితుడైన ఓ ప్రముఖుడిని ఆయన వద్దకు దూతగా పంపినట్లు సమాచారం. రజనీ ఆరోగ్య పరిస్థితులు, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న దృష్ట్యా రాజకీయాల్లోకి రావద్దంటూ ఆ దూత ఆయనకు తెలిపినట్లు చెబుతున్నారు.


అదంతా పుకార్లే...

అయితే ఇదంతా వట్టి పుకార్లేనని డీఎంకే అధికార ప్రతినిధి, ఎంపీ టీకేఎస్‌ ఇలంగోవన్‌ ఖండించారు. రజనీ రాజకీయ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులతోపాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ రజనీని రాజకీయాల్లోకి రావద్దంటూ డీఎంకే చెప్పినా ఆయన ఆ మాటను ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా డీఎంకేకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విజయ దశమికి ఇక పదమూడు రోజులే వుంది. ఆ లోగా రజనీ పార్టీ పేరునైనా ప్రకటించి ఆయన అభిమానుల్లో ఉత్సాహం నింపుతారో లేక ఎప్పటివలెనే ఊరించి ఊరుకుంటారో వేచి చూడాల్సిందే!

Updated Date - 2020-10-13T17:43:57+05:30 IST