‘గవర్నర్‌ను చూసి భయపడుతున్నారు’

ABN , First Publish Date - 2020-10-25T12:53:57+05:30 IST

గవర్నర్‌ను చూసి అన్నాడీఎంకే ప్రభుత్వం భయపడుతోందని, తాము అధికారం చేపట్టిన వెంటనే నీట్‌ పరీక్ష రద్దు చేస్తామని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తెలిపారు. వైద్యకోర్సుల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్‌ చట్టసవరణ ఆమోదంపై గవర్నర్‌ జాప్యం చేయడాన్ని నిరసిస్తూ

‘గవర్నర్‌ను చూసి భయపడుతున్నారు’

చెన్నై : గవర్నర్‌ను చూసి అన్నాడీఎంకే ప్రభుత్వం భయపడుతోందని, తాము అధికారం చేపట్టిన వెంటనే నీట్‌ పరీక్ష రద్దు చేస్తామని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తెలిపారు. వైద్యకోర్సుల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్‌ చట్టసవరణ ఆమోదంపై గవర్నర్‌ జాప్యం చేయడాన్ని నిరసిస్తూ శనివారం డీఎంకే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక గిండీలోని రాజ్‌భవన్‌ ఎదుట జరిగిన ఆందోళనలో స్టాలిన్‌ మాట్లాడుతూ... రాష్ట్ర విద్యార్థుల ప్రాణాలు హరించే విధంగా ‘నీట్‌’ తయారైంద న్నారు. ముఖ్యమంత్రిగా కరుణానిధి హయాంలో రాష్ట్రంలో నీట్‌ అమలు కాలేదని, అలాగే జయలలిత  సీఎంగా ఉన్న సమయంలోనూ నీట్‌ ప్రవేశపెట్టలేదన్నారు. కానీ, నేడు ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే ప్రభుత్వం నీట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. నీట్‌ శాశ్వతంగా రద్దు చేయాలన్నదే డీఎంకే డిమాండ్‌ అన్నారు.


పదవులు కాపాడుకొనేందుకే...

ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి భయపడి పదవిని కాపాడుకొనేందుకు మౌనంగా ఉన్నారని, అందుకోసమే గవర్నర్‌ను చూసి భయపడుతున్నారన్నారు. 2017 ఫిబ్రవరిలో నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీలో రెండు బిల్లులు తీర్మానించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన  ఏడు నెలల అనంతరం తిరిగి వచ్చాయని, ఈ విషయం కోర్టు ఆదేశించిన సమయంలోనే వెల్లడైందన్నారు.


అన్నాడీఎంకే కపట నాటకం...

అన్నాడీఎంకే జనరల్‌ కమిటీ తీర్మానంలో కూడా నీట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు, ఈ పరీక్షను రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేశారన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కూడా నీట్‌ రద్దు చేస్తామని అన్నాడీఎంకే మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని అన్నాడీఎంకే కేవలం ప్రకట నలకే పరిమితమైందన్నారు. ఈ విషయంలో అన్నాడీఎంకే ధ్వంధ్వ వైఖరి ప్రదర్శిస్తూ కపట నాటకాలాడి ప్రజలను మోసం చేస్తోందన్నారు.ఈ వ్యవహారంలో గవర్నర్‌ను చూసి అన్నాడీఎంకే భయపడుతోందని, అందువల్లే చట్టసవరణ ఆమోదం పొందేలా గవర్నర్‌పై ఒత్తిడి చేయలేకపోతున్నా రని విమర్శించారు.ఇప్పటికే పేరరివాలన్‌తో పాటు ఏడుగురు విడుదల విషయంలో కూడా గవర్నర్‌ ఇప్పటికి కూడా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ దారిలోనే రిజర్వేషన్‌ బిల్లు కూడా ఉంటుందా అనే అనుమానం కలుగుతోందన్నారు.


అవకాశం ఎందుకు?

రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంపై తాను గవర్నర్‌కు రాసిన లేఖపై బదులు లేఖ పంపారన్నారు. రిజర్వేషన్‌ను పరిశీలించి చట్టపరమైన నిర్ణయం తీసుకొనేందుకు మూడు లేదా నాలుగు వారాలు గడువు అవసరమని గవర్నర్‌ లేఖలో పేర్కొన్నారన్నారు. ఇదివరకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగానే చట్టసవరణ చేసి గవర్నర్‌కు పంపామని, దీన్ని అమోదించడంలో ఆయనకు అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. గవర్నర్‌ జాప్యంతో 300 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వైద్యకోర్సుల్లో చేరలేకపోతున్నారన్నారు. ఈ విషయంలో జాప్యం చేస్తే ప్రభుత్వం మౌనంగా ఉంటుందేయో గానీ ప్రతిపక్షాలు ప్రేక్షక పాత్ర వహించవన్నారు. దీనిపై పోరాటాలు తీవ్రతరం చేస్తామని స్టాలిన్‌ హెచ్చరించారు. ఈ ఆందోళనలో పార్టీ కోశాధికారి టీఆర్‌.బాలు, ప్రధాన కార్యదర్శి కేఎన్‌.నెహ్రూ, వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌.భారతి, ఎంపీ కనిమొళి, ఎమ్మెల్యే పొన్ముడి, యువజన విభాగం అధ్యక్షుడు ఉదయానిధి స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T12:53:57+05:30 IST