డీఎంకే కౌన్సిలర్‌ దారుణహత్య

ABN , First Publish Date - 2022-09-21T15:40:42+05:30 IST

కాంచీపురం జిల్లా పడప్పై సమీపం నడువీరప్పట్టు ఎట్టయపురంలో డీఎంకే కౌన్సిలర్‌ను పథకం ప్రకారం హత్య చేసి పరారైన అదే పార్టీకి చెం

డీఎంకే కౌన్సిలర్‌ దారుణహత్య

                                  - హంతకుల కోసం గాలింపు


చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాంచీపురం జిల్లా పడప్పై సమీపం నడువీరప్పట్టు ఎట్టయపురంలో డీఎంకే కౌన్సిలర్‌ను పథకం ప్రకారం హత్య చేసి పరారైన అదే పార్టీకి చెందిన మహిళా దాదా సహా హంతకుల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నడువీరప్పట్టు ఎట్టయపురం ప్రాంతానికి చెందిన సతీష్‌ ఏడో వార్డు కౌన్సిలర్‌గా, డీఎంకే(DMK) స్థానిక శాఖ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అదే ప్రాంతంలో ఎస్తర్‌ అలియాస్‌ లోకేశ్వరి అనే మహిళ కూడా నివసిస్తోంది. వీరిద్దరి మధ్య రాజకీయపరంగా పాతకక్షలున్నాయి. ఎస్తర్‌ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న సతీష్‌ ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్తర్‌ ఆగ్రహంతో సతీష్‏ను హతమార్చాలని నిర్ణయించింది. 

ఆ మేరకు సోమవారం మధ్యాహ్నం సతీష్‏ను రాజీకి రమ్మని ఆహ్వానించింది. ఎస్తర్‌ మాటలను నమ్మి సతీష్‌ ఆమె ఇంటికి వెళ్ళాడు. అప్పటికే ఆ ఇంటిలో కిరాయి గూండాలు వేటకొడవళ్లతో ఉండటం చూసి సతీష్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ ఆలోగా ఎస్తర్‌ వేటకొడవలితో అతడిపై దాడి చేసింది. ఆమె అనుచరులు చుట్టుముట్టి కత్తులతో నరికారు. ఈ సంఘటనలో సతీష్‌ మరణించాడు. ఆ తర్వాత ఎస్తర్‌ ఆమె అనుచరులు సతీష్‌ శవాన్ని ఆమె ఇంటి ముందు వీధిలో విసిరేసి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న సోమంగళం పోలీసులు సతీష్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎస్తర్‌, ఆమె అనుచరుల కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్తర్‌ వేటకొడవలి పట్టుకుని ఫోజిస్తున్న ఫొటో ఒకటి మంగళవారం సామాజిక ప్రసారమాధ్యమాల్లో వెలువడి తీవ్ర కలకలం సృష్టించింది.

Updated Date - 2022-09-21T15:40:42+05:30 IST