ఉత్తర్వులు.. బేఖాతరు

ABN , First Publish Date - 2021-08-15T05:00:51+05:30 IST

డిప్యూటేషన్లు రద్దు చేసి.. అవినీతిని కొంతైనా తగ్గించాలన్న ప్రభుత్వ ప్రయత్నం గుంటూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో విఫలమైంది.

ఉత్తర్వులు.. బేఖాతరు

శనివారానికీ రద్దు కాని డిప్యూటేషన్లు

డీఎంఏ ఆదేశాలను పట్టించుకోని అధికారులు

డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏళ్లకుఏళ్లు ఉద్యోగుల తిష్ఠ

 

గుంటూరు(సంగడిగుంట), ఆగస్టు 14: డిప్యూటేషన్లు రద్దు చేసి.. అవినీతిని కొంతైనా తగ్గించాలన్న ప్రభుత్వ ప్రయత్నం గుంటూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో విఫలమైంది. వివిధ ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల నుంచి డిప్యూటేషన్ల పేరుతో వచ్చి జిల్లా కేంద్రంలో తిష్ఠ వేసిన వివిధ హోదాల్లోని ఉద్యోగులను ఈ నెల 14 లోపు వారి మాతృస్థానాలకు పంపించాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌(డీఎంఏ) ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసరమైన విధులు ఉంటే 16వ తేదీ  సాయంత్రానికి వారందరినీ పంపించాల్సిందేనని ఉత్తర్వుల్లో డీఎంహెచ్‌వోలను స్పష్టంగా ఆదేశించింది.  ఈ ఉత్తర్వులను అనుసరించి ఇప్పటికే పలు జిల్లాల్లో డిప్యూటేషన్లను రద్దయ్యాయి. కానీ గుంటూరులోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మాత్రం ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. పైగా ఆ ఉత్తర్వులతో తమకు సంబంధమే లేదన్నట్లుగా పలువురు అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు కూడా ఒక్క బదిలీ జరగలేదు. సోమవారం జరుగుతుందన్న వాతావరణం కూడా కార్యాలయంలో కనిపించడంలేదు. ఏడాది క్రితం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి జీవోను ఒకసారి ఇచ్చింది. కానీ ఒక్కర్ని కూడా బదిలీ చేయలేదు. 


పదిపన్నెండేళ్లుగా తిష్ఠ

కార్యాలయంలో ఏదైనా  కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు అందులో అనుభవం ఉన్న ఉద్యోగులను డిప్యూటేషన్‌పై జిల్లాకేంద్రానికి పిలిపించుకుంటారు. ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే లేదా 3 నుంచి 6 నెలల వ్యవధిలోపు తిరిగి వారిని మాతృస్థానానికి పంపాలి. కానీ గుంటూరు డీఎంహెచ్‌వో  కార్యాలయంలో కనీసం 25 మంది ఉద్యోగులు 10 నుంచి 12 ఏళ్లుగా డిప్యూటేషన్లపై కొనసాగుతున్నారు. వారు తమ మాతృస్థానాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. వారిని యథా స్థానాలకు పంపాలన్న స్పృహ అధికారుల్లోనూ లోపించింది. ఏళ్లకు ఏళ్లు తిష్ఠ వేసిన ఆయా విభాగాల్లోని కొందరు ఉద్యోగులు, అధికారుల వల్ల అవినీతి తారాస్థాయికి చేరుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ అవినీతిని కొంతైనా తగ్గించాలంటే డిప్యూటేషన్లపై కొనసాగుతున్న వారిని మాతృ స్థానాలకు పంపాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని గుంటూరులోని అధికారులు పట్టించుకోవడంలేదు.  ప్రభుత్వ ఆదేశాలను కూడా లెక్క చేయనంతగా పలుకుబడి చేరుకుందంటే వారి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యూటేషన్‌పై వచ్చే వారికి ప్రత్యేక నైపుణ్యం కన్నా ఎంత బాగా అధికారుల సొంత పనులు చక్కబెడతారన్నదే అర్హతగా ఉంది. గుట్టుచప్పుడు కాకుండా మామూళ్లు వసూలు చేయడం, ప్రశ్నించిన వారి గొంతు నొక్కడం, అధికారుల వ్యక్తిగత పనులు చేయడం తదితర విషయాలను ఎంత బాగా చేస్తే వారు అంత ఎక్కువ కాలం ఇక్కడ ఉండవచ్చు అనేలా ఉంది. డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు వారి పని చేయకపోగా కింది స్థాయి ఉద్యోగుల మీద కర్రపెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులను మంచి చేసుకుని దానిని ఆసరాగా చూపించి పెత్తనాలు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా జేసీ జోక్యం చేసుకుని ఈ ప్రక్రియను సజావుగా జరిపి ఆయా అధికారులకు స్థానభ్రంశం చేయాలని పలువురు కోరుతున్నారు.  


Updated Date - 2021-08-15T05:00:51+05:30 IST