YS Jagan సర్కార్‌పై డీఎల్ సంచలన కామెంట్స్.. సజ్జల ఎవరు..!?

ABN , First Publish Date - 2021-10-16T17:05:38+05:30 IST

వైఎస్ జగన్ పాలనపై సొంత జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....

YS Jagan సర్కార్‌పై డీఎల్ సంచలన కామెంట్స్.. సజ్జల ఎవరు..!?

కడప : వైఎస్ జగన్ పాలనపై సొంత జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య మీడియా ముందుకొచ్చిన ప్రతిసారీ డీఎల్ కీలక వ్యాఖ్యలే చేస్తున్నారు. శనివారం నాడు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన..  జగన్ పాలన పూర్తిగా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన చూడనేలేదని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను లాక్కుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ, పోలీస్‌ శాఖలు వారిచేతుల్లో కీలుబొమ్మలుగా మారాయన్నారు.


సజ్జల ఎవరు..!?

ఆయా శాఖల సమస్యల పరిష్కార వివరాలు ఆయా మంత్రులు చెప్పాలి అంతేకానీ.. ప్రతి విషయంలో పెత్తనం చేయడానికి అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? అని డీఎల్ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఈ సజ్జలే నడిపిస్తే ఇక మంత్రులు ఎందుకు? అని జగన్ సర్కార్‌కు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..? కింది స్థాయిలో ఏం జరుగుతోంది..? అనే విషయాలు సీఎం జగన్ తెలుసుకోవాలని డీఎల్ సూచించారు. వైసీపీలోకి రావాలంటూ వచ్చిన ఆహ్వానంపై డీఎల్‌ను ఏబీఎన్ ప్రతినిధి అడగ్గా.. ముక్కుసూటిగా మాట్లాడే తనను వైసీపీలోకి ఆహ్వానించే ధైర్యం ఎవరూ చేయరని వ్యాఖ్యానించారు. కాగా సజ్జల విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం విదితమే.


ఇండిపెండెంట్‌‌గా గెలుస్తా..!

ఏ పార్టీ అవసరం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా మైదుకూరులో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసి గెలుస్తానని ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి సవాల్ విసిరారు. జగన్ అప్పుల పాలనతో 25 ఏళ్లపాటు రాష్ట్రం సంక్షోభంలో పడినట్లేనని.. ఈయన పాలనలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత సంక్షేమ పథకాల ఆశచూపి ఓట్లను కొల్లగొట్టవచ్చనే ఆలోచన అవివేకమన్నారు. మహోన్నతమైన పథకాలు అమలు చేసిన ఎన్టీఆర్ ఓడిన విషయం జగన్ గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా డీఎల్ హితవు పలికారు. 


డీఎల్ చరిత్ర ఇదీ..!

1978లో మైదుకూరు నియోజకవర్గం నుంచి డీఎల్ ఇండిపెండెంట్‌గా గెలిచిన విషయం విదితమే. ఆ తర్వాత 1983, 1989, 1994, 2004, 2009లో ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. మంత్రిగా కూడా డీఎల్ పనిచేశారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న డీఎల్.. ఆ మధ్య జగన్ పాదయాత్రలో కలవగా వైసీపీ కండువా కప్పుకుంటారని టాక్ నడిచింది. అయితే అదేమీ జరగలేదు. రెండు మూడ్రోజులుగా మీడియా ముందుకొస్తున్న డీఎల్.. జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలోనే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. డీఎల్ వ్యాఖ్యలపై కడప జిల్లా వైసీపీ నేతలు, ముఖ్యంగా సజ్జల ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Updated Date - 2021-10-16T17:05:38+05:30 IST