వివాదంలో డీకేటీ భూములు

ABN , First Publish Date - 2022-05-13T05:12:50+05:30 IST

మండలంలోని కలికిరి పట్టణ శివారులో పేదలకిచ్చిన డీకేటీ భూములు పరాధీనమైన అంశాలు కలికిరిలో వివాదాలకు దారితీస్తున్నాయి.

వివాదంలో డీకేటీ భూములు
కలికిరిలో పరాధీనమైన డీకేటీ భూమి

అడ్డదారులతో ఇక్కట్లు

నష్టపోనున్న రియల్టర్లు, ప్లాట్ల కొనుగోలుదారులు


కలికిరి, మే 12: మండలంలోని కలికిరి పట్టణ శివారులో పేదలకిచ్చిన డీకేటీ భూములు పరాధీనమైన అంశాలు కలికిరిలో వివాదాలకు దారితీస్తున్నాయి. డీకేటీ భూముల పరాధీనంపై సమగ్ర పీవోటీ చట్టం (బదిలీ నిషేధిత చట్టం) అమల్లో ఉండగా మూడో వ్యక్తులకు బదిలీ కావడం ఈ వివాదాలకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు. కలికిరి పట్టణ శివారులో పేద దళితులకు దశాబ్దాల క్రితం ప్రభుత్వం పంపిణీ చేసిన డీకేటీ భూముల ధరలు రూ.కోట్లకు చేరుకోవడంతో నిబంధనలకు విరుద్ధంగా మూడో వ్యక్తులకు మ్యుటేషన్‌ జరిగిపోయిన నేపథ్యంలో అందులో చాలా భూములు చేతులు మారాయి. ఇందులో కొన్నింటిలో దళారులు లేఔట్లు వేసి ప్లాట్లుగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మరికొంతమంది లేఔట్లు సిద్ధం చేసి ప్లాట్లకు అడ్వాన్సులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేయించడానికి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ భూములు మ్యుటేషన్ల చట్ట పరిధిలో ఉన్నాయా లేదా అన్న ఆందోళన ప్లాట్లు కొన్న వారిలో నెలకొంది. ఈ నేపథ్యంలో 1954కు ముందు మంజూరు చేసిన డీకేటీ పట్టాలను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు 2018 నవంబరు 16న అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో నెంబరు 575 జారీ చేసిందని ఇదే జీవో ద్వారా డీకేటీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే అధికారం తమకుందని మండల స్థాయి రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. అయితే మూడో వ్యక్తులకు మ్యుటేషన్‌ జరిగిన డీకేటీ భూములన్నీ 1954కు ముందు జారీ అయినవా కాదా అని తేలాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా బదలాయింపు జరిగి ఉంటే ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చని పీవోటీ చట్టంలోని నిబంధన గురించే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.  


1954కు ముందు డీకేటీలకే ఎందుకు వర్తిస్తుంది?

1954కు ముందు మంజూరైన డీకేటీలకు మాత్రమే జీవో 575 ఎందుకు వర్తిస్తుంది, దీనికి ప్రామాణికమేమిటనే విషయాలు ముందుగా తెలియాల్సి ఉంది. స్వాతంత్య్రం రాక పూర్వం బ్రిటీషు ప్రభుత్వ హయాంలోనే వివిధ వర్గాలకు చెందిన భూములు లేని దళితులకు ప్రభుత్వ భూములను ఎలాంటి కండీషన్లు లేకుండా పట్టాలుగా మంజూరు చేశారు. అంటే పరోక్షంగా అమ్ముకోవచ్చనే అర్థం. ఆ తరువాత 1949 జూన్‌ 11 తేదీ జీవో నెం.1523 జారీ అయింది. దీని ప్రకారం 1949 తరువాత పట్టాలు ఇచ్చిన భూములను పదేళ్ళలోగా అమ్ముకోవడం కానీ లేదా బదలాయించడం కానీ చేయకూడదని, అలా చేసిన పక్షంలో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని దీని సారాంశం. అంటే ఇక్కడ పదేళ్ళ తరువాత అమ్ముకోవచ్చనే వెసులుబాటు కల్పించారు. ఆ తరువాత 1954 జూన్‌ 18న మరో జీవో 1142ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో తేదీ నుంచి మంజూరయ్యే డీకేటీ పట్టా భూములను వంశపారంపర్యంగా అనుభవించుకోవచ్చు కానీ బదిలీ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. దీంతోనే 1954 జూన్‌ 18వ తేదీ తరువాత మంజూరయ్యే వాటిని కండీషన్‌ పట్టాలని చెప్పుకోవడం కూడా రివాజయ్యింది. ఈ మొత్తం పూర్వాపరాల్లో 1954 జూన్‌ 18వ తేదీకి ముందు డీకేటీలకు ఎలాంటి షరతులు లేకుండా జారీ చేయడంతో వాటన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వం జీవో 575 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం 1954 జూన్‌ 18కు ముందు మంజూరైన డీకేటీలను 22-ఏ నిషేధిత జాబితా నుంచి రాజమార్గంలో తొలగించుకునే అవకాశముండగా కలికిరిలో ఇలా ఎందుకు అడ్డదారిలో వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. 


టోకుగా తొలగించేందుకు సన్నాహాలు

జీవో 575ను ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుగా, ఒక్కో మండలంలో ఒక్కో రీతిగా అన్వయించుకుని రెవెన్యూ అధికారులు మొత్తం డీకేటీ భూములను (1954 తరువాతవి కూడా) ప్రమాదకరమైన అస్థిత్వంలోకి నెట్టేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు ప్రభుత్వమే సుమోటోగా పరిష్కారానికి పూనుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్‌ సరిగ్గా నెల క్రితం అంటే ఏప్రిల్‌ 11న జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం మొత్తం రాష్ట్రంలో 1954 జూన్‌ 18కి ముందు జారీ అయిన డీకేటీ కేసులు 24,313 ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే ఒక్కో జిల్లాలో సరాసరిన వేయి కేసులున్నాయని అంచనా. దీని ప్రకారం అన్నమయ్య జిల్లాలో ఒక్కో మండలంలో సరాసరిన కొంచెం అటూ ఇటుగా 30 కేసులు మాత్రమే ఉన్నట్టు లెక్క. అయితే ప్రభుత్వం ఊహించిన దానికన్నా మూడు నాలుగు రెట్ల సంఖ్యలో ఇప్పటికే బదలాయింపులు ఎలా పూర్తయ్యాయో అర్థం కాక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. కాగా ఒక్కో కేసు వారీగా జీవో 575 కింద నిషేధం తొలగింపునకు ప్రతిపాదనలొస్తున్నాయని, మరోవైపు హైకోర్టుతో సహా ఇతర న్యాయస్థానాల్లో కేసులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం ఈ ఆదేశాల్లో ఆందోళన వెలిబుచ్చింది. టోకు మొత్తంగా జీవో 575 వర్తించే అన్ని కేసులనూ ప్రభుత్వమే తనంతకు తానే పరిష్కరించేందుకు పూనుకుంది. ఈ మేరకు డివిజన్ల వారీగా ప్రతిపాదనలు పంపాల్సిందిగా కలెక్టర్లను కోరారు. ఈ ఆదేశాలపై జిల్లా కలెక్టర్లు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి గత నెలలోనే ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా నుంచి తప్పించుకోవడానికి రాజమార్గం అందుబాటులో ఉండగా తొందరపడి కలికిరిలో పేదల భూములను వివాదాల రొంపిలోకి నెట్టేశారనే విమర్శలు వినపడుతున్నాయి. 


జీవో ప్రకారమే 22-ఏ నుంచి తొలగించాం

- కె.రమణి, తహసీల్దారు, కలికిరి

1954కు ముందు మంజూరు చేసిన డీకేటీ పట్టాలను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం 2018లో 575 జీవో జారీ చేసింది. ఆ తరువాత ఇచ్చిన పట్టాలకు ఇది వర్తించని మాట వాస్తవమే. జీవో ప్రకారం తొలగించేందుకు తహసీల్దారుకు  అధికారముంది. ఈ జీవోను తహసీల్దారు అమలు చేస్తే జాబితా నుంచి నిషేధిత భూములు తొలగిపోతాయి. 

Read more