మతమార్పిడి నిరోధక బిల్లు ప్రతులను చించేసిన డీకే

ABN , First Publish Date - 2021-12-22T00:00:26+05:30 IST

మత మార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక ప్రభుత్వం మంగళవారంనాడు అసెంబ్లీలో..

మతమార్పిడి నిరోధక బిల్లు ప్రతులను చించేసిన డీకే

బెంగళూరు: మత మార్పిడి నిరోధక బిల్లును కర్ణాటక ప్రభుత్వం మంగళవారంనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేసిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సభలోనే బిల్లు ప్రతులను చించివేశారు. తొలుత ఈ బిల్లును రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు మంత్రికి అనుమతి ఇచ్చానని, దీనిపై బుధవారంనాడు చర్చ జరుగుతుందని స్పీకర్ ప్రకటించారు. బిల్లు సభలో ప్రవేశపెట్టిన వెంటనే డీకే శివకుమార్ ఆ బిల్లు ప్రతులను చించివేశారు. బిల్లుపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.


తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి బసవరజ్ బొమ్మై మాట్లాడుతూ, అసెంబ్లీలో పూర్తి స్థాయి చర్చకు అవకాశం ఉందని, అయితే బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వారు (విపక్షాలు) సభకు హాజరు కాలేదని, ఇది ప్రభుత్వం తప్పు కాదని అన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం సామూహిక మతమార్పిడులకు పాల్పడే వారికి మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. షెడ్యూల్డ్ కులాల వ్యక్తి మైనారిటీ రెలిజియన్ గ్రూపులోకి మారితే అతను రిజర్వేషన్లతో సహా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను కోల్పోతాడు. కాగా, ఈ బిల్లును రాష్ట్రంలోని క్రిష్టియన్ సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది ఏకపక్షంగా ఉన్న బిల్లని పేర్కొంది. బిల్లు ప్రవేశపెడితే దేవుడు మీకు (ప్రభుత్వానికి) అనుకూలంగా ఉండడనే విషయం గుర్తుపెట్టుకోండని బెల్గాం బిషప్ డెరెక్ ఫెర్నాండెజ్ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఎవరికీ మేలు చేయదని, వెంటనే ఉపసంహరించుకోవాలని బెంగళూరు ఆర్చిబిషప్ పీటర్ మచాడో ప్రభుత్వానికి సూచించారు.


డీకే ఏమన్నారంటే...

మత మార్పిడి నిరోధక బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుందని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ద్వంద్వంగా ఈ బిల్లును అసెంబ్లీలో వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఈ బిల్లు మతసామరస్యానికి భంగం కలిగించి, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని, ఫలితంగా కర్ణాటకలో పెట్టుబడులు తగ్గేందుకు కూడా దారితీస్తుందని అన్నారు.

Updated Date - 2021-12-22T00:00:26+05:30 IST