ఎప్పుడైనా.. పాదయాత్రకు బ్రేక్‌..?

ABN , First Publish Date - 2022-01-13T17:38:08+05:30 IST

మేకెదాటు ప్రాజెక్టును నిర్మించాలని కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక పాదయాత్రకు ఎప్పుడైనా బ్రేక్‌ పడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు వేలసంఖ్యకు పెరగడం, మరోవైపు హైకోర్టు ధర్మాసనం తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని

ఎప్పుడైనా.. పాదయాత్రకు బ్రేక్‌..?

- డీకే సహా 64 మందిపై మరో FIR 

- హైకోర్టు నోటీసు

- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే యాత్రను తక్షణం ఆపండి 

- కాంగ్రెస్‌కు బీజేపీ ఎమ్మెల్యేల సూచన 


బెంగళూరు: మేకెదాటు ప్రాజెక్టును నిర్మించాలని కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక పాదయాత్రకు ఎప్పుడైనా బ్రేక్‌ పడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు వేలసంఖ్యకు పెరగడం, మరోవైపు హైకోర్టు ధర్మాసనం తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని మందలించడంతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి నోటీసులు జారీ చేయడం, కాంగ్రెస్‌ అధిష్ఠానం యాత్రకు స్వస్తి పలకాలనే సందేశం ఇచ్చిందనే సమాచారం నేపథ్యంలో రాష్ట్రనేతలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఎప్పుడైనా పాదయాత్రకు బ్రేక్‌ పడనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పాదయాత్ర ప్రారంభమై నాలుగురోజులు ముగిసింది. కొవిడ్‌ కేసులు వేలసంఖ్యలో నమోదవుతుండగా కాంగ్రెస్‌ పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన పిల్‌పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్థి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సామాన్యులకు వర్తించే నిబంధనలు పాదయాత్రకు ఉండవా..? ప్రభుత్వం నిలుపుదల చేసే సా మర్థ్యం లేదా అంటూ ధర్మాసనం మందలించింది. ఇటు ప్రభుత్వానికి, అటు కాంగ్రెస్‌ పార్టీకి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వాన్ని హైకోర్టు మందలించిన వెంటనే హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం పాదయాత్రను రద్దు చేయాలని సంకేతా లు ఇచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా విమర్శిస్తుం టే పాదయాత్రపట్ల సర్వ త్రా చర్చకు రానుందని, ఇది దేశమంతటా ప్రచారం కానుందని, వెంటనే యాత్రను ముగించాలని సూచించినట్టు తెలుస్తోంది. కనకపుర తా లూకాలో యాత్ర ముగిసి రామనగరకు చేరింది. బెంగళూరు గ్రామీణ జిల్లాకు చేరేసరికే యాత్ర ముగిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు పాదయాత్ర ముగించాలని కాంగ్రెస్‌ నేతలను డిమాండ్‌ చేశారు. మల్లేశ్వరం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అరవింద లింబావళితోపాటు ఉదయ్‌ గరుడాచార్‌, సతీశ్‌రెడ్డి, రవిసుబ్రమణ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రమైందన్నారు. మంగళవారం కనకపురలో జరిగిన యాత్రలో 15వేల మందికిపైగా పాల్గొన్నారని అనివార్యమైతే ఇద్దరమే పాదయాత్ర చేస్తామని ప్రకటించిన డీకే శివకుమార్‌ తీరు సమంజసమేనా.. అని ప్రశ్నించారు. రామనగర జిల్లాలో పాజిటివిటీ రేటు 7 శాతం దాటిందని, బెంగళూరులో 10 శాతం దాటిందని, ఇటువంటి క్లిష్ట సమయంలో యాత్రల పేరిట వేలాదిమందికి వైరస్‌ ప్రబలేలా చేయడమేమిటని ప్రశ్నించారు. మరోసారి లాక్‌డౌన్‌ రాకుండా ఉండాలంటే వెంటనే యాత్రను ముగించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రమంతటా లక్షలాదిమంది చిరు వ్యాపారులు, చిన్న ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజల జనజీవనంపై కాంగ్రెస్‌ పార్టీ దాడి చేసినట్టేనన్నారు. కాగా కొవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్నా యాత్ర కొనసాగించడంపై ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సహా 64 మందిపై కనకపుర టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన మేరకు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తొలిరోజు యాత్ర ఉల్లంఘనపై వీరిద్దరితోపాటు రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, నటులు దునియా విజయ్‌, సాధుకోకిలతోపాటు 31 మందిపై కేసులు నమోదు చేశారు. దొడ్డఆలహళ్లి నుంచి కనకపుర దాకా సాగిన యాత్ర ఉల్లంఘనపై డీకే శివకుమార్‌, ఎంపీ డీకే సురేశ్‌తోపాటు 41 మందిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా కనకపుర టౌన్‌ పోలీసులు 64 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో పాదయాత్రపై మూడో ఎఫ్‌ఐర్‌ నమోదు చేసినట్టయింది. 

Updated Date - 2022-01-13T17:38:08+05:30 IST