- కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్
బెంగళూరు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రకటించారు. 2023 శాసనసభ ఎన్నికలు మతోన్మాద అ జెండాకు, అభివృద్ధి భరిత సామరస్య అజెండాకు మధ్య జరుగుతాయన్నారు. నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నట్టు వస్తున్న కథనాలపై స్పందిస్తూ తక్షణమే ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. కాంగ్రెస్ లో ఎలాంటి గ్రూపులు లేవన్నారు, నేతల మధ్య అభిప్రాయబేధాలు ఉన్నట్లు వెలువడుతున్న కథనాలు నిరాధారమన్నారు. గ్రామీణాభివృద్ధిశా ఖ మంత్రి ఈశ్వరప్పపై ఓ కాంట్రాక్టర్ 40శాతం కమీషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానికే నేరుగా లేఖ రాశారని, ఇది రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో తేటతెల్లం చేస్తోందన్నారు. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టాక రాష్ట్రంలో ఓవైపు శాంతిసామరస్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, సంఘ్ పరివార్ ఆగడాలు అధికమయ్యాయని ఆరోపించారు. శాంతి సామరస్యాలతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న ఆయన ఇది కాంగ్రెస్ అజెండాలో ప్రధాన భాగంగా ఉంటుందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వంలో విలయతాండవం చేస్తున్న అవినీతిపై ప్రధాని మోదీ దృష్టి సారిస్తే బాగుంటుందన్నారు. పెట్రోల్, డీజిల్ వాతలు, మండుతున్న సిలిండర్ల ధరలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేయనుందన్నారు.
ఇవి కూడా చదవండి