బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ

ABN , First Publish Date - 2020-09-27T08:27:55+05:30 IST

తెలంగాణలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా ఎదిగే దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా  డీకే అరుణ

ఫైర్‌బ్రాండ్‌ అరుణకు కీలక పదవి

జాతీయ స్థాయికి లక్ష్మణ్‌.. టీఆర్‌ఎ్‌సతో ఢీకి బీజేపీ రెడీ


హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా ఎదిగే దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రె్‌సను వెనక్కి నెట్టడం, మరోవైపు అధికార టీఆర్‌ఎ్‌సను సమర్థంగా ఢీకొని, అధికార పీఠం కైవసం చేసుకోవడం దిశగా మాస్టర్‌ స్కెచ్‌ వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి మరింత చేరువ కావడంతోపాటు బలమైన రెడ్డి సామాజికవర్గానికి పెద్దపీట వేసే దిశగా అడుగులు వేసింది. జనాకర్షక నాయకురాలిగా గుర్తింపు ఉన్న ఫైర్‌బ్రాండ్‌ డీకే అరుణకు జాతీయ కార్యవర్గంలో కీలక పదవి కట్టబెట్టింది. ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. తద్వారా రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎ్‌సను తాము గట్టిగానే ఢీ కొనబోతున్నామన్న సంకేతాలు ఇచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


కాగా,  ఆమెకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించడ ద్వారా కాంగ్రెస్‌ నుంచి మరికొందరు నేతలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. సీనియర్‌ నేత మురళీధర్‌రావుకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో అవకాశం దక్కకపోవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  తెలంగాణలో అధికార పార్టీ నేతలతో ఆయనకు సాన్నిహిత్యం ఉన్నట్లు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు అందడం వల్లే ఆయన పదవి రెన్యువల్‌ కాలేదన్నది ఒక వాదన కాగా,  కర్ణాటక ఉదంతం కారణమనే మరో వాదన ఉంది. కొద్ది నెలల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేజిక్‌ మార్క్‌కు ఆరు సీట్ల దూరంలో నిలిచినా.. యడియూరప్ప ఆగమేఘాలపై సీఎం బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత బలపరీక్షకు ముందే రాజీనామా చేయాల్సి రావడం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీ కర్ణాటక ఇన్‌చార్జిగా వ్యవహరించిన మురళీధర్‌రావు వ్యూహంలో వైఫల్యం కారణంగానే పార్టీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయిందని అప్పట్లో ప్రచారం జరిగిందని బీజేపీ నేతలు తెలిపారు.


అయితే మురళీధర్‌కు రాజ్యసభ సభ్యత్వం కల్పంచే అవకాశం ఉందనే ప్రచారం కూడా పార్టీలో ఉంది.ఇక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు ఊహించినట్లుగానే జాతీయ పదవి దక్కింది. జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో బీసీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు అయిందని అంటున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో  తెలంగాణకు సముచిత స్థానం కల్పించారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఇందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు కృతజ్ణతలు చెబుతున్నానన్నారు.

Updated Date - 2020-09-27T08:27:55+05:30 IST