ఒకే ఒక్కడు

ABN , First Publish Date - 2021-06-14T09:45:36+05:30 IST

ఆస్ట్రేలియన్‌.. ఫ్రెంచ్‌... వింబుల్డన్‌... యూఎస్‌ ఓపెన్‌ ఇలా ఈ గ్రాండ్‌స్లామ్స్‌ అన్నింటినీ ఒక్కసారి గెలవడమే అరుదుగా జరుగుతుంది.

ఒకే ఒక్కడు

ఫ్రెంచ్‌ ఓపెన్‌తో జొకోవిచ్‌ కొత్త చరిత్ర

రెండోసారి కెరీర్‌  స్లామ్‌తో అరుదైన ఘనత

ఫైనల్లో గ్రీకు  వీరుడికి నిరాశ


ఆస్ట్రేలియన్‌.. ఫ్రెంచ్‌... వింబుల్డన్‌... యూఎస్‌ ఓపెన్‌ ఇలా ఈ గ్రాండ్‌స్లామ్స్‌ అన్నింటినీ ఒక్కసారి గెలవడమే అరుదుగా జరుగుతుంది. కానీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌  జొకోవిచ్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓపెన్‌ శకంలో వీటిని రెండేసి సార్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో కాస్త పోటీ ఎదురైనా సిట్సిపా్‌సను ఓడించిన జోకర్‌కు ఇది 19వ గ్రాండ్‌స్లామ్‌. ఇక నడాల్‌, ఫెడరర్‌ (20)ల రికార్డుకు కేవలం ఒక్క అడుగు దూరంలోనే నిలిచాడు.


పారిస్‌: ‘కింగ్‌ ఆఫ్‌ క్లే’ నడాల్‌ను సెమీ్‌సలోనే ఇంటిముఖం పట్టించిన జొకోవిచ్‌ అనుకున్నది సాధించాడు. కెరీర్‌లో రెండోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా అసమాన పోరాటంతో వరుసగా మూడు సెట్లను గెలిచి స త్తా చాటుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 6-7 (6/8), 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించాడు. అయితే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన ఈ గ్రీకు చిన్నోడు చూపిన తెగువ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఓపెన్‌ శకాన్ని మినహాయిస్తే రాడ్‌ లేవర్‌, రాయ్‌ ఎమర్సన్‌ కూడా నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌ను రెండేసి సార్లు గెలిచారు. ఇక ఈ మ్యాచ్‌లో జొకో 5 ఏస్‌లు, 5 బ్రేక్‌ పాయిం ట్లు.. సిట్సిపాస్‌ 14 ఏస్‌లు, 3 బ్రేక్‌ పాయింట్లు సాధించారు. విజేత జొకోకు రూ.12 కోట్ల 37 లక్షలు, సిట్సిపా్‌సకు రూ.6 కోట్ల 65 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది.


హోరాహోరీగా..:

సిట్సిపాస్‌ అద్భుత సర్వీస్‌.. ఫోర్‌హ్యాండ్‌ విన్నర్లకు దీటుగా జొకో ఎదురుదాడికి దిగడంతో తొలి సెట్‌ హోరాహోరీగా సాగింది. అయితే ఏకంగా 12 అనవసర తప్పిదాలతో జొకో మూల్యం చెల్లించుకున్నాడు. ఆరంభంలో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 2-2, 3-3, 4-4తో సాగింది. అయితే పదో గేమ్‌లో సిట్సిపా్‌సకు సెట్‌ను ముగించే అవకాశం దక్కింది. కానీ 23 షాట్లపాటు సాగిన ర్యాలీలో జొకో నిలిచాడు. దీంతో స్కోరు 5-5కి చేరగా 11వ గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌తో జొకో 6-5తో ముందంజ వేశాడు. కానీ తర్వాతి గేమ్‌లో రెండు అనవసర తప్పిదాల కారణంగా సర్వీస్‌ కోల్పోయాడు. దీంతో టై బ్రేక్‌ అనివార్యమైంది. దీంట్లో 0-4తో వెనుకబడిన జొకో నెట్‌ దగ్గర అద్భుతంగా ఆడుతూ 6-5తో సెట్‌ పాయింట్‌కు చేరాడు. కానీ సిట్సిపాస్‌ వరుసగా మూడు పాయింట్లతో జోకర్‌కు షాక్‌ ఇచ్చాడు. ఇక రెండో సెట్‌ తొలి గేమ్‌లోనే బ్రేక్‌ పాయింట్‌ సాధించిన సిట్సిపాస్‌ ఆ తర్వాత కూడా జోరు ఆపలేదు. మరో బ్రేక్‌ పాయింట్‌తో 5-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు.


ఎనిమిదో గేమ్‌లోనైతే సూపర్‌ సర్వీ్‌సలతో నొవాక్‌ను వణికిస్తూ ఓ ఏస్‌తో సెట్‌ను ముగించాడు. దీంతో సంచలన ఫలితం ఖాయమేనా అనిపించింది. ఈ దశలో జొకోవిచ్‌ నెంబర్‌వన్‌ ఆటను ప్రదర్శిస్తూ మూడు, నాలుగు సెట్లలో డ్రాప్‌ షాట్‌, విన్నర్స్‌తో పాటు కీలక సమయంలో బ్రేక్‌ పాయింట్లు సాధిస్తూ 6-3, 6-2తో నెగ్గి పోటీలో నిలిచాడు. ఇక ఆఖరి సెట్‌ చివర్లో సిట్సిపాస్‌ కాస్త పుంజుకున్నా జొకో పవర్‌ గేమ్‌ ముందు ఫలితం లేకపోయింది. పదో గేమ్‌లో చాంపియన్‌షి్‌ప సర్వీ్‌సతో అదరగొట్టి చక్కటి ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 

Updated Date - 2021-06-14T09:45:36+05:30 IST