‘దీపాలు’ ఇళ్లలో మాత్రమే... ఆసుపత్రులు, కార్యాలయాల్లో కాదు...

ABN , First Publish Date - 2020-04-04T23:25:45+05:30 IST

ఆదివారం రాత్రి దీపాలు వెలిగించే కార్యక్రమం ఇళ్ళకు మాత్రమే పరిమితమని, ఆసుపత్రులు, కార్యాలయాలు వంటివాటికి

‘దీపాలు’ ఇళ్లలో మాత్రమే... ఆసుపత్రులు, కార్యాలయాల్లో కాదు...

న్యూఢిల్లీ : ఆదివారం రాత్రి దీపాలు వెలిగించే కార్యక్రమం ఇళ్ళకు మాత్రమే పరిమితమని, ఆసుపత్రులు, కార్యాలయాలు వంటివాటికి వర్తించదని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు విద్యుత్తు దీపాలు ఆర్పేసి, నూనె దీపాలు, టార్చిలైట్లు, కొవ్వొత్తులు వంటివాటిని వెలిగించాలని పిలుపునిచ్చారు. మహమ్మారిపై పోరాటంలో సమైక్యతను చాటడం కోసం ఈ విధంగా చేయాలని కోరారు. దీనిపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. 


ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు విద్యుత్తు దీపాలు ఆర్పేయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారని, అయితే ఈ కార్యక్రమం కేవలం ఇళ్ళకు మాత్రమే పరిమితమని తెలిపింది. ఆసుపత్రులు, వీథి లైట్లు, ఇళ్లలో ఉండే కంప్యూటర్లు, ఫ్యాన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వివిధ శాఖల కార్యాలయాలు వంటివాటికి ఈ పిలుపు వర్తించదని వివరించింది. 


ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, మునిసిపల్ సర్వీసెస్, కార్యాలయాలు, మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు, పబ్లిక్ యుటిలిటీస్ వంటివాటిలో విద్యుత్తు దీపాలు ఆర్పేయవలసిన అవసరం లేదని తెలిపింది. 


నూనె దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు వంటివాటితో కేవలం ఇళ్ళలో మాత్రమే దీపాలు వెలిగించాలని తెలిపింది. 


ప్రజల భద్రత కోసం వీథి లైట్లను వెలిగించి ఉంచాలని అన్ని స్థానిక సంస్థలకు తెలిపామని పేర్కొంది. 


ఇళ్లలో విద్యుత్తు  దీపాలు ఆర్పేయడం వల్ల పవర్ గ్రిడ్ కుప్పకూలుతుందనే భయాలు అక్కర్లేదని తెలిపింది. భారత దేశపు విద్యుత్తు గ్రిడ్ పటిష్టంగా ఉందని, తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొంది. విద్యుత్తు కోసం గిరాకీలో వ్యత్యాసాలను తట్టుకునేందుకు వీలుగా అన్ని పద్ధతులను సక్రమంగా పాటిస్తున్నట్లు తెలిపింది. 


Updated Date - 2020-04-04T23:25:45+05:30 IST