రిజర్వేషన్‌.. పేరుకే!

ABN , First Publish Date - 2021-11-11T14:43:44+05:30 IST

ప్రభుత్వోద్యోగాల్లో..

రిజర్వేషన్‌.. పేరుకే!

దివ్యాంగుల రిజర్వేషన్‌ అమలేదీ?

ఉత్తర్వులతోనే సరి.. ఆపై పట్టించుకోని సర్కారు

ప్రభుత్వోద్యోగాల్లో 4% అమలవని వైనం

ప్రభుత్వ పథకాల్లో 5 శాతం కేటాయింపులూ నీటిమూటలే

బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ కూడా లేదు 

‘డబుల్‌ ఇళ్ల’ ఉత్తర్వులూ బుట్టదాఖలు

దివ్యాంగ పెన్షన్‌ అందక ఇబ్బందులు

రిజర్వేషన్‌, వయోసడలింపు 2031 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు రిజర్వేషన్‌అమలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వయోపరిమితి సడలింపు, టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఫీజులో మినహాయింపును 2031 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న రిజర్వేషన్‌ ఈ ఏడాది మే 31తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాటిని మరో పదేళ్లపాటు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, తమ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఇలా ఉత్తర్వులతోనే సరిపెడుతోందని.. అమలు ఊసే లేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, వారి సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందుందని ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. వాస్తవ పరిస్థితికి అసలు పొంతనే లేదు. ప్రభుత్వం చిన్నచూపు కారణంగా దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు కాగితాలకే పరిమితం అవుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. దివ్యాంగుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు అరకొరగా ఉండడంతో ఆ నిధులు వారి అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఆర్థిక సహాయం కోసం దివ్యాంగుల కార్పొరేషన్‌కు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా.. నిధులలేమి కారణంగా ప్రతి సంవత్సరం సగానికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి.


రిజర్వేషన్‌.. పేరుకే!

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్‌ కేటాయించాలని ఉన్నప్పటికీ తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడక, ఉద్యోగ నియామకాల్లో 4% రిజర్వేషన్‌ అమలుచేయకపోవడంతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక అనేక మంది దివ్యాంగులు మానసిక ఆందోళనలో కుంగిపోతున్నారు. ప్రభుత్వ విభాగాల్లో దివ్యాంగుల కోటాలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేవలం ఒకే ఒక్కసారి బ్యాక్‌లాగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసి నామ మాత్రపు పోస్టుల్ని భర్తీ చేశారు. దీంతో మరోసారి బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు. నిరుద్యోగ దివ్యాంగులకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


సంక్షేమ పథకాల్లోనూ..

సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5% కేటాయించాలనే ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా అవి పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదు. 2017లో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లల్లో దివ్యాంగులకు 5% ఇళ్లు.. అది కూడా గ్రౌండ్‌ఫ్లోర్‌లో కేటాయించాలి. కానీ ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో మెజారిటీ దివ్యాంగులు అద్దె ఇళ్లల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.


కార్పొరేషన్‌కు రూ.4 కోట్లే...

దివ్యాంగుల కార్పొరేషన్‌ను నిధుల లేమి వెంటాడుతోంది. కార్పొరేషన్‌ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకూ రూ.4 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. నిధుల కొరత కారణంగా.. అవసరమైన వారికి రుణాలు అందడం లేదు. కార్పొరేషన్‌కు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 70% పెండింగ్‌లో ఉన్నాయంటే నిధుల కొరత ఎంత తీవ్రంగా ఉందీ అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక చేయూత కోసం ప్రతి జిల్లా నుంచి సుమారు 2 వేల దాకా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నిరక్షరాస్యులకు కూడా వారి అవసరాలకు మోటారు వాహనాలు ఇస్తుంటే తెలంగాణలో కేవలం గ్రాడ్యుయేషన్‌ ఆపైన చదువుకున్న వారికి మాత్రమే మోటారు సైకిలు ఇస్తున్నారు.



6 లక్షల పెన్షన్‌ దరఖాస్తులు పెండింగ్‌...

ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017లోతెలంగాణ జనాభాలో దివ్యాంగులు 10,46,822 మంది ఉన్నారు. అంటే  రాష్ట్ర జనాభాలో 3% శాతం. 1995 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం దివ్యాంగులు 7 రకాలుగా ఉండేవారు. కానీ 2016 చట్టం ప్రకారం దివ్యాంగుల్ని 21 రకాలుగా చేశారు. కొత్త చట్టం ప్రకారం తెలంగాణలో దివ్యాంగుల జనాభా సుమారుగా 6% ఉంటుంది. దివ్యాంగ పెన్షన్లు అందక వారిలో చాలా మంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ మొదటి సంవత్సరం పెన్షన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదు. ఫలితంగా దివ్యాంగ పెన్షన్‌ కోసం సుమారు 6 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు సంవత్సరాల నుంచి వైకల్య ధ్రువీకరణ పత్రాలు పొందిన వారికి పెన్షన్లు మంజూరు చేయకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్‌ 24లో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని దివ్యాంగులు ప్రశ్నిస్తున్నారు.


దివ్యాంగుల సంక్షేమ శాఖ తొలగింపు

1983లో ఎన్టీరామారావు దివ్యాంగ శాఖతోపాటు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. అయితే, తెలంగాణ ఏర్పాటయ్యాక పలు శాఖల్ని అనుబంధ శాఖల్లో ప్రభుత్వం విలీనం చేసింది. అందులో భాగంగానే దివ్యాంగుల సంక్షేమ శాఖను శిశు సంక్షేమ శాఖలో విలీనం చేశారు. యూఎన్‌సీఆర్‌పీడీ, దివ్యాంగ చట్టాలన్నీ కూడా దివ్యాంగుల్ని ప్రత్యేకంగా గుర్తించాలని చెబుతున్నాయి. వారి అవసరాలు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ప్రత్యేక గుర్తింపు అవసరం ఉంటుంది. శాఖ విలీనంతో వికలాంగులు ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటి నేపథ్యంలో.. ఇకనైనా ప్రభుత్వ ఉత్తర్వులు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని దివ్యాంగులు కోరుతున్నారు.


కాగా.. దివ్యాంగులకు వయోపరిమితి పదేళ్లపాటు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక హర్షం వ్యక్తం చేసింది. అయితే రాష్ట్ర స్థాయిలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల్ని భర్తీ చేయాలని, నోటిఫికేషన్‌ విడుదల చేసి వయోపరిమితి సడలింపు అమలు చేయాలని వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-11-11T14:43:44+05:30 IST