విడిపోతాం..

ABN , First Publish Date - 2022-08-07T06:09:34+05:30 IST

మూడు ముళ్లు.. ఏడడుగులు.. వందేళ్ల జీవితం.. ఇదే భారతీయ సంస్కృతి. దీనికి వివాహ వ్యవస్థ వన్నెముక. ఈ వ్యవస్థకు బీటలు వారుతున్నాయా..?

విడిపోతాం..

మూణ్ణాళ్ల ముచ్చటగా వివాహబంధం

భారీగా పెరుగుతున్న విడాకుల కేసులు

గుంటూరు నగరంలోనే నెలకు 90 జంటలకు డైవోర్స్‌ మంజూరు

వేల సంఖ్యలో పెండింగ్‌ కేసులు

కేసుల్లో 80 శాతం కొత్తగా పెళ్లయిన జంటలవే

 చిన్నపాటి వివాదాలకే కోర్టు మెట్లెక్కుతున్న నవదంపతులు

 అక్కరకు రాని కౌన్సెలింగ్‌ కేంద్రాలు


మూడు ముళ్లు.. ఏడడుగులు.. వందేళ్ల జీవితం.. ఇదే భారతీయ సంస్కృతి. దీనికి వివాహ వ్యవస్థ వన్నెముక. ఈ వ్యవస్థకు బీటలు వారుతున్నాయా..? వైవాహిక బాధ్యతను మోసేందుకు యువత విముఖత చూపుతుతోందా..? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. కొత్తగా పెళ్లయిన చాలామంది దాంపత్యం అంటే ఆకర్షణ, ప్రేమ కాదని అది స్పృహతో కూడిన అవగాహన, ప్రేమతో కలగలిసిన స్నేహం అని తెలుసుకో లేకపోతున్నారు. ఒకరి భావాలను ఒకరు అర్ధం చేసుకోకుండా తమ ఆలోచనల్ని గౌరవించడం లేదంటూ వేదనకు గురవుతున్నారు. చివరికి చిన్నపాటి కారణాలకే దూరం అవుదామని నిర్ణయించుకుని కోర్టు వరకు వెళ్తున్నారు. దీంతో నూరేళ్లు ఉండాల్సిన దాంపత్య జీవితాలు మధ్యలోనే ముగుస్తున్నాయి. అత్యంత పటిష్టమైన పెళ్లి అనే బంధం చిన్న, చిన్న కారణాలతోనే తెగిపోతోంది.  

గుంటూరు(తూర్పు), ఆగస్టు 6: వందేళ్లు కలసి బతకాల్సిన వారు చిన్నపాటి కారణాలతో విడిపోతున్నారు. పెళ్లయిన ఆరు రోజుల నుంచి ఆర్నెల్లు గడవకముందే భాగస్వామి అర్ధం కావడం లేదనో, అర్ధం చేసుకోవడం లేదనో విడిపోవాలనుకుంటున్నారు. జీవితాంతం కలిసే ఉండే బలమైన బంధమే దాంపత్య జీవితం అని గుర్తించలేకపోతున్నారు. 

- గుంటూరు నగరానికి చెందిన ఓ జంటకు పెళ్లయిన నాలుగు నెలలు తిరగక ముందే టీవీ రిమోట్‌ దగ్గర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ పెద్దదిగా మారి విడాకులు కోసం కోర్టులో కేసు వేశారు. 

- మరో కేసులో పెళ్లి తరువాత పెట్టి పోతలు సరిగా చేయలేకపోయారంటూ వరుడు కుటుంబానికి చెందిన వారు మాట్లాడిన మాటలు గొడవగా మారడంతో విద్యానగర్‌కు చెందిన ఇరు కుటుంబాలు విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. 

- కూతురిని తొలిసారిగా పుట్టింటికి ఆటోలో పంపారని ఆమె తల్లి అన్న మాటలు విడాకుల వరకు దారితీశాయి. 

- మా అమ్మ, నాన్న మా ఇంటికి వచ్చినపుడు చికెన్‌ తీసుకురాలేదని భార్య చేసిన  గొడవ కోర్టు మెట్లు ఎక్కేవరకు తీసుకువచ్చింది. 

- మచ్చుకు మాత్రమే ఇవి.. చెప్పిన సమయానికి రాలేదు.. ఇష్టమైన సినిమాకి తీసుకుపోలేదనే వంటి కారణాలకే కోర్టు వచ్చే ఘటనలు మరెన్నో..!  


నెలకు 90 జంటలకు విడాకులు..

గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలో జిల్లా కోర్టులో ఉన్న ఫ్యామిలీ కోర్టులో ప్రతినెల 90 జంటలకు విడాకులు మంజూరు అవుతున్నాయి. అంటే సరాసరి రోజుకు మూడు జంటలు వివాహ బంధానికి స్వప్తి చెబుతున్నాయి. ప్రతి నెల సగటున 87 జంటలు విడాకుల కోసం కోర్టులో కేసులు వేస్తున్నారు. అంతేగాక కార్పొరేషన్‌ పరిధిలో జూలై చివరినాటికి 1,860 కేసులు వరుకు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 9 వేల కేసులు పెండింగ్‌లో ఉండగా నెలకు జిల్లాలోని అన్ని కోర్టుల్లో నెలకు 160 వరకు జంటలు విడాకులు పొందుతున్నాయి. ఫ్యామిలీ కోర్టుతో పాటు, జిల్లా కోర్టులో నాలుగు సబ్‌కోర్టులు, నరసరావుపేట, బాపట్ల, పిడుగురాళ్లు, వినుకొండతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 10 సబ్‌కోర్టుల్లో నిత్యం వీటి విచారణ కొనసాగుతోంది. సివిల్‌, క్రిమినల్‌ కేసుల కంటే అత్యధికంగా విడాకుల కేసులే విచారణ జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నవారిలో 80 శాతం 25-28 మధ్య వయస్సున్న జంటలే ఉండడం గమనార్హం.


అక్కరకు రాని కౌన్సెలింగ్‌ కేంద్రాలు..

విడాకులకు ధరఖాస్తు చేసుకున్న దంపతులను కలిపేందుకు తొలిప్రయత్నంగా కౌన్సెలింగ్‌ కేంద్రాలకు పంపుతారు. దంపతుల మధ్య గొడవకు కారణం తెలుసుకుని సఖ్యతను కుదర్చడమే ఈ కౌన్సెలింగ్‌ కేంద్రాల ముఖ్య విధి. దిశ పోలీస్‌స్టేషన్లలో, సఖి కేంద్రాల్లో జిల్లావ్యాప్తంగా కౌన్సెలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ సరైన మానసిక నిపుణులు, అనుభవజ్ఞులు లేక చాలా కేసులు తిరిగి విడాకులకే దారి తీస్తున్నాయి. కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో ఉండే కొంతమంది సిబ్బంది అయితే భార్యభర్తల మధ్య జరిగిన గొడవలను అవకాశంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కౌన్సెలింగ్‌ కేంద్రానికి వెళ్లిన పాతగుంటూరుకు చెందిన దంపతుల మధ్య గొడవను పెద్దదిగా చేయడమేగాక భార్యను అక్రమ సంబంధం వైపు ప్రేరేపించే విధంగా సఖి అధికారి ప్రయత్నించారని సాక్షాత్తూ భర్తే ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశారు.  

 

కారణాలను విశ్లేషిస్తే.. 

విడాకుల కోసం వీరు చెప్పే కారణాలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఒకరిపై ఒకరికి విపరీతమైన అంచనాలు, ఊహించుకున్న విధంగా వైవాహిక జీవితం లేకపోవడం, ప్రతి మాటకు విపరీత అర్ధాలు తీయడం, ఆర్థిక భద్రత ఉండటంతో ఎలాగైనా జీవించగలం అనే ధీమా, సర్ది చెప్పేవారు లేకపోవడం వంటి కారణాలు విడాకుల వరకు దారితీస్తున్నాయి. దంపతుల మధ్య జరిగే గొడవల్లో మూడోవ్యక్తి జోక్యం వల్లే పరిస్థితి చేయిదాటుపోతుందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లికిముందు మనకు ఏ సమస్య వచ్చినా స్నేహితులతో పంచుకుంటాం. కానీ పెళ్లి తరువాత ఏది స్నేహితులతో చెప్పుకోవాలి.. ఏది కుటుంబ సభ్యులతో చెప్పుకోవాలి అనే అవగాహన చాలామందికి ఉండదు. దీంతో మూడోవ్యక్తి సలహాలను పాటించి సమస్యను జటిలం చేసుకుంటున్నారు. అంతేగాక ఏదైనా గొవడ జరిగితే సమస్యను పూర్తిగా వివరించకుండా తమ వైపు తప్పు లేదన్నట్లు తల్లిదండ్రులకు చెబుతుంటారు. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలది తప్పు కాదనే భావనకు వచ్చి సర్ది చెప్పడం మానివేసి విడాకులను ప్రోత్సహిస్తున్నారు. 


విడాకుల తరువాత తీవ్ర మనోవేదన..

విడాకులు తీసుకున్న తర్వాత సంతోషంగా ఉంటున్నారా.. అంటే అదీ లేదు. విడాకుల తర్వాత ఇద్దరూ మనోవేదన అనుభవిస్తారు. సమాజం వారి పట్ల వ్యవహిరించే తీరు, ఒంటరై పోయామనే భావన, ఇతరులు కుటుంబాలతో సంతోషంగా ఉండటం, పెళ్లయిన కొత్తలో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తుకు రావడం వంటి కారణాలతో తీవ్రమానసిక వేదన అనుభవిస్తుంటారు. ఇదే పలు మానసిక, ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. ఈ విషయాన్ని మానసిక వైద్య నిపుణులు నిర్ధారిస్తున్నారు.


చిన్నపాటి సమస్యలకే విడాకులు సరికాదు..

గతంలో విడాకుల కేసులు చాలా అరుదుగా వచ్చేవి. ప్రస్తుతం అవి వందల సంఖ్యలో వస్తున్నాయి. జిల్లా కోర్టులోనే  నాలుగు సబ్‌కోర్టుల్లో విచారణ కొనసాగుతున్నాయి. ఒకోసారి భార్యాభర్తల్లో ఒకరు కలిసి ఉండాలని మరొకరు విడిపోవాలని కోరుకుంటారు. ఇటువంటి కేసులు కూడా వస్తుంటాయి. విడాకులు వద్దని ఎంత చెప్పినా వినరు. తీసుకున్న తరువాత వచ్చే ఇబ్బందులు గురించి చెప్పినా పట్టించుకోరు. చిన్నపాటి సమస్యలు వచ్చినపుడు విడాకులు వరకు రావడం మంచిది కాదు. పెద్దవారి సమక్షంలో ఇరు కుటుంబాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిష్కరించుకోవాలి. - సీహెచ్‌వీ సత్యనారాయణ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ఫ్యామిలీ కోర్టు గుంటూరు 


పెళ్లైన కొత్తలోనే సమస్య..

అప్పటి వరకు ఉన్న వాతావరణం, ఆప్తుల పలకరింపులు పెళ్లి తరువాత కనిపించవు. వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలోనే చిన్నపాటి స్పర్ధలు మొదలవుతాయి వీటిని పరిష్కరించుకోగలిగితే ఆ తరువాత ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జీవితం రొటీన్‌ అవుతుందన్న భావన కూడా రానివ్వకూడదు. అంతేగాక ఒకరినొకరు గౌరవించుకోవాలి. గొడవలు జరిగితే సర్దుకుపోవాలి. చిన్నపాటి సూత్రాలు పాటిస్తే  వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది. - ఐవీఎల్‌ నరసింహారావు, సైకియాట్రిస్ట్‌, గుంటూరు 


Updated Date - 2022-08-07T06:09:34+05:30 IST