వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ

ABN , First Publish Date - 2022-05-17T05:26:06+05:30 IST

కంచరపాలెం బాపూజీనగర్‌ సమీపంలోని రామకృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఈనెల ఏడున గుర్తించిన మృతదేహం కేసు మిస్టరీ వీడింది.

వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ

మద్యం మత్తులో కడతేర్చిన ఇద్దరు యువకులు

ఈనెల 7న బాత్‌రూంలో శవమై కనిపించిన ఒడిశా యువతి

విశాఖపట్నం, మే 16: కంచరపాలెం బాపూజీనగర్‌ సమీపంలోని రామకృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో ఈనెల ఏడున గుర్తించిన మృతదేహం కేసు మిస్టరీ వీడింది. సదరు మహిళను డబ్బుల కోసం ఒత్తిడి చేసిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఆమెను హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. నిందితుల్లో ఓ యువకుడిని అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. 


కంచరపాలెం సీఐ కృష్ణారావు కథనం మేరకు..ఒడిశాకు చెందిన నందిని అనే యువతి ఉపాధి వెతుక్కుంటూ విశాఖ వచ్చింది. ఈమెకు తమ ప్రాంతానికే చెందిన రాజేష్‌, అతని స్నేహితుడితో గతంలోనే పరిచయం ఉంది. రాజేష్‌, అతని స్నేహితుడు ఉపాధి వెతుక్కుంటూ నగరానికి ఆమె కంటే ముందే వచ్చారు. రామకృష్ణానగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. తాజాగా నందిని నగరానికి రావడంతో పాత పరిచయం ఆధారంగా  తమ పక్కనే ఖాళీగా ఉన్న గదిలో ఆమెను అద్దెకు దింపారు.


నందినితో వీరికి వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల ఏడో తేదీ రాత్రి రాజేష్‌, అతని స్నేహితుడు పూటుగా మద్యం సేవించి నందిని గదికి వచ్చారు. డబ్బుల కోసం ఆమెను డిమాండ్‌ చేశారు. తనవద్ద డబ్బులు లేవని ఆమె ఖరాఖండీగా చెప్పడంతో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో రాజేష్‌ , అతని స్నేహితుడు కోపం ఆపుకోలేక నందిని తలను బలంగా గోడకేసి పలుమార్లు కొట్టారు. దీంతో ఆమె చనిపోయింది.


ఆ తర్వాత నందిని శవాన్ని బాత్‌రూంలో పడేసి, ఏమీ తెలియనట్టు గదికి తాళం వేసి వెళ్లిపోయారు. మూడు రోజుల తర్వాత ఇంటి నుంచి దర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు శవాన్ని గుర్తించారు. నందిని చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు భోరున విలపిస్తూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో గతంలోనే పరిచయం వున్న రాజేష్‌, అతని స్నేహితునిపై అనుమానం వ్యక్తం చేశారు. ఒడిశాలో ఉండగా నందినితో వారు తీసుకున్న ఫొటోలు అందించారు.


ఘటన జరిగిన రోజు నుంచి ఈ ఇద్దరు యువకులు కూడా కనిపించక పోవడంతో పోలీసులు కూడా నందిని తల్లిదండ్రుల అనుమానం నిజమేనని నమ్మి వారి కోసం  వేట మొదలు పెట్టారు. రాజేష్‌ పోలీసులకు చిక్కడంతో తమదైన శైలిలో ప్రశ్నించే సరికి హత్య చేసింది తామేనని అంగీకరించాడు. రాజేష్‌ నేరం ఒప్పుకున్నాడని సీఐ కృష్ణారావు తెలిపారు. ఎస్‌ఐ అప్పలనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారని, మిగిలిన నిందితుడి కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు. 

Updated Date - 2022-05-17T05:26:06+05:30 IST