పీఆర్‌లో కొత్తగా ‘డీఎల్‌డీవో’

ABN , First Publish Date - 2020-10-01T09:27:18+05:30 IST

పంచాయతీరాజ్‌(పీఆర్‌), గ్రామీణాభివృద్ధిశాఖకు సంబంధించి డివిజన్‌ స్థాయిలో ప్రభుత్వం కొత్తగా డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌(డీఎల్‌డీవో) పోస్టును సృష్టించింది...

పీఆర్‌లో కొత్తగా ‘డీఎల్‌డీవో’

  • నూతన పోస్టు సృష్టించిన ప్రభుత్వం
  • 51 డివిజినల్‌ అభివృద్ధి అధికారి పోస్టులు
  • ఎంపీడీవోలకు పదోన్నతులతో భర్తీ
  • జాబ్‌చార్ట్‌తో కూడిన ఉత్తర్వులు జారీ


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌(పీఆర్‌), గ్రామీణాభివృద్ధిశాఖకు సంబంధించి డివిజన్‌ స్థాయిలో ప్రభుత్వం కొత్తగా డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌(డీఎల్‌డీవో) పోస్టును సృష్టించింది. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక డీఎల్‌డీవోను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీడీవోగా కనీసం ఐదేళ్లపాటు సర్వీసు పూర్తిచేసిన వారికి డీఎల్‌డీవోగా పదోన్నతి కల్పించనున్నారు. ఈ పోస్టుకు డిప్యూటీ డైరెక్టర్‌ హోదా కల్పిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి ప్రస్తుతం మండలస్థాయిలో ఎంపీడీవో, జిల్లాస్థాయిలో జేసీ పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇంత పెద్ద వ్యవస్థలో వేల మంది సిబ్బందిని పర్యవేక్షించడం ఇబ్బందిగా మారినందున, మధ్యస్థాయిలో ఒక అధికారి ఉండాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో డీఎల్‌డీవో పోస్టును తీసుకువచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఎంపీడీవోలు ఈ పోస్టులను నిర్వహించేందుకు సమర్థులని నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 51 మంది ఎంపీడీవోలకు పదోన్నతి కల్పిస్తూ వారిని డీఎల్‌డీవోలు నియమించేందుకు సిద్ధమైంది.


డివిజన్‌ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమన్వయం చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్షించే బాధ్యత డీఎల్‌డీవోలకు అప్పగిస్తారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత కూడా వీరిదే. నెలలో 20 రోజులు తమ పరిధిలో పర్యటించి(టూర్‌) జాయింట్‌ కలెక్టర్‌కు నివేదిక సమర్పించాలి. కాగా, ఎంపీడీవోల టూర్‌ డైరీని సమీక్ష చేసే అధికారం డీఎల్‌డీవోలకు ఉంటుంది. ఈ పోస్టుకు సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక, జడ్పీ డిప్యూటీ సీఈవో, డీఎల్‌డీవో ఒకే కేడర్‌ పోస్టులు కావడంతో పరస్పరం బదిలీ చేసే అవకాశం ఉంది.



పలు పోస్టులు సరెండర్‌

జిల్లా పరిషత్‌లోని ఎల్‌డీ స్టెనో, డ్రైవర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితర 169 ఖాళీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టులను సరెండర్‌ చేశారు. జడ్పీల్లో పనిచేసే(51 ఖాళీలు) అకౌంట్స్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌తో పాటు ఎక్స్‌టెన్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో పనిచేసే వెటర్నరీ ఆఫీసర్‌, ఎంపీడీవో, అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌ తదితర ఎంపీడీవో కేడర్‌ పోస్టులను కూడా ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. 


వలంటీర్ల సేవలు ఏడాది పొడిగింపు

గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లకు నియామక పత్రాలు ఇచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం వారి సేవలను రెన్యువల్‌ చేయాలని నిర్ణయించింది. వారి సేవలు సంతృప్తికరంగా ఉంటే మరో ఏడాది పొడిగించాలని ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయ జాయింట్‌ కలెక్టర్లు వలంటీర్ల పనితీరును సమీక్షించి రెన్యువల్‌ చేయాలని సూచించింది. 

Updated Date - 2020-10-01T09:27:18+05:30 IST