అంతా కొత్తే!

ABN , First Publish Date - 2022-05-04T07:11:38+05:30 IST

జిల్లాల విభజన జరిగి నెల పూర్తయింది.

అంతా కొత్తే!

కలెక్టరేట్‌లో కొలువు తీరని శాఖలెన్నో

ఎన్టీఆర్‌ జిల్లాకు నెల

పూర్తిస్థాయిలో పాలన ఎప్పటికో!

పంచాయతీరాజ్‌లో అంతా గందరగోళమే  

రిజిస్ర్టేషన్ల శాఖలోనూ అయోమయం

రవాణాశాఖలో ట్రాక్‌ వివాదం


జిల్లాల విభజన జరిగి నెల పూర్తయింది. కొత్త సరిహద్దులు.. కొత్త పాలన.. సరికొత్త కార్యాలయాలు.. అయితే ఇంతవరకు పాలన మాత్రం ప్రజల చెంతకు చేరలేదు. అసలు పూర్తిస్థాయిలో పాలన మొదలవడానికి ఎంత కాలం పడుతుందో కూడా తెలియని స్థితి. మారుమూల ప్రాంతాల ప్రజలకు చాలా మందికి జిల్లాలు విడిపోయిన సంగతి తెలియదు. అనేక గ్రామ, వార్డు సచివాయాల్లో ఇప్పటికీ కృష్ణాజిల్లా పేర్లే కనిపిస్తున్నాయి. వరుస ‘స్పందన’ కార్యక్రమాల ద్వారా కొంతవరకు ఇక్కడి నుంచి పాలన సాగుతున్నట్టు కనిపిస్తున్నా.. కలెక్టరేట్‌ పూర్తిస్థాయిలో పని చేయకపోవటం ఇబ్బందికరంగా మారుతోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్‌ జిల్లా ఆవిర్భవించి నెల పూర్తయినా పాలన ఇంకా గాడిలో పడనే లేదు. కలెక్టరేట్లో కీలకమైన శాఖలు కొలువు తీరలేదు. అనేక శాఖల్లో ఇంతవరకు ఉద్యోగుల విభజనే జరగలేదు. జిల్లా కేంద్రమైన విజయవాడలో సైతం కొత్త జిల్లా వాతావరణం కనిపించటం లేదు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌, జేసీ, డీఆర్వోలు మినహా ఎవరూ కనిపించటం లేదు. జిల్లా విభజన సంగతి తెలియని వారెందరో ఇప్పటికీ స్పందన కార్యక్రమానికి మచిలీపట్నమే వెళుతున్నారు. అక్కడికి వెళ్లిన వారిని తిప్పి పంపించటం ఇష్టం లేక కృష్ణాజిల్లా అధికారులు వారి నుంచి అర్జీలు తీసుకుని, ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌కు రిఫర్‌ చేస్తున్నారు. 


నేటికీ పూర్తికాని ఉద్యోగుల విభజన

పంచాయతీరాజ్‌ శాఖ ఇంకా విభజన గందరగోళంలోనే ఉంది. కొత్త జిల్లాకు ఇప్పటివరకు డీపీవోను కేటాయించలేదు. డీపీవో కార్యాలయం గొల్లపూడిలో ఏర్పాటైనా.. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలకు ఒకే డీపీవో పనిచేస్తున్నారు. ఈ అధికారి రెండు జిల్లాల్లో జరిగే  కలెక్టర్ల సమీక్షలు, సమావేశాల్లో పాల్గొనాల్సి వస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో పాత విజయవాడ డివిజన్‌ కాకుండా కొత్తగా నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లాలో పాత మచిలీపట్నం, గుడివాడ డివిజన్లతో పాటు కొత్తగా ఉయ్యూరు డివిజన్‌ను ఏర్పాటు చేశారు. కొత్త డివిజన్లలో ఆర్డీవోలు నియమితులయ్యారు. కానీ పంచాయతీరాజ్‌కు సంబంధించిన కొత్త డివిజన్ల పరిధిలో డివిజినల్‌ పంచాయతీ అధికారులను ఇప్పటికీ నియమించలేదు. కార్యాలయాలు కూడా ఏర్పాటు కాలేదు. దీంతో ఈ శాఖలో పాలన గందరగోళంగా ఉంటోంది. కొత్త డివిజన్ల బాధ్యతలను కూడా పాత డివిజన్ల పంచాయతీ అధికారులే చూస్తున్నారు. రెవెన్యూ డివిజన్లు ఏర్పడినా.. డీఎల్‌పీవో కార్యాలయాలు ఏర్పాటు కాకపోవటం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. 


పూర్తికాని కార్యాలయాలు

కలెక్టరేట్‌లో అధికారులు పూర్తిస్థాయిలో కొలువు తీరలేదు. ఇక్కడ ఏర్పాటు కావాల్సిన జిల్లా ప్రణాళిక శాఖ, సర్వే అండ్‌ ల్యాండ్స్‌ కార్యాలయాలు ఇంకా సిద్ధం కాలేదు. నూతన కలెక్టరేట్‌తోపాటే వీటి పనులు ప్రారంభించినా.. ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో ఈ రెండు శాఖలూ క్యాంపు కార్యాలయాల నుంచే పాలన సాగిస్తున్నాయి. పనులు పూర్తయి, పాలన ప్రారంభం కావటానికి మరో పక్షం రోజులైనా పట్టేలా ఉంది. విద్యాశాఖ పరిస్థితీ అంతే. మాంటిస్సోరి స్కూల్లోని కొన్ని గదులను ఈ శాఖ కార్యాలయం కోసం కేటాయించినా యాజమాన్యం ఆ గదుల్లోని ఫర్నీచర్‌ను తొలగించకపోవటంతో క్యాంపు కార్యాలయంలోనే విద్యాశాఖ నడుస్తోంది. 


రిజిస్ర్టేషన్ల శాఖలోనూ అదే తీరు 

జిల్లాల పునర్విభజన క్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా రిజిస్ర్టేషన్‌ శాఖ పరిధిలోకి కానూరు, తాడిగడప, యనమలకుదురు, పోరంకి గ్రామాలను తీసుకువచ్చారు. వాస్తవానికి ఈ గ్రామాలు కృష్ణాజిల్లాలో ఉన్నాయి. దీంతో రిజిస్ర్టేషన్ల జిల్లా అధికారిగా కృష్ణాజిల్లా రిజిస్ర్టేషన్‌ అధికారి, సబ్‌ రిజిస్ర్టార్‌గా ఎన్టీఆర్‌ జిల్లాలోని పటమట సబ్‌ రిజిస్ర్టార్‌ వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ శాఖలోనూ గందరగోళం నెలకొంది. రెండు జిల్లాల బాధ్యతలు ఉండటంతో తమ డ్యాకుమెంట్లపై ఎక్కడ వివాదాలు అలుముకుంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. 


రవాణా రగడ  

ఎన్టీఆర్‌ జిల్లా రవాణా శాఖలో సరిహద్దుల వివాదం నెలకొంది. పునర్విభజనలో గన్నవరం కృష్ణాజిల్లాలో కలిసింది. అక్కడ ఉన్న డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ విజయవాడ రవాణా శాఖది. విజయవాడ ఆర్‌టీఏ పరిధిలోకి వచ్చే వారందరికీ అక్కడే డ్రైవింగ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. గన్నవరం ప్రాంతానికి చెందినవారికి మాత్రం ఉయ్యూరులో టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. చెంతనే ఉన్న డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో కాదని తమను ఉయ్యూరుకు పంపించటమేమిటని ఆ ప్రాంత వాహనదారులు లబోదిబోమంటున్నారు. గన్నవరంలో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఎంవీఐ ఉంటారు. కృష్ణాజిల్లాకు చెందిన ఎంవీఐని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని గన్నవరం ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 

Read more