TRS పార్టీలో సీనియర్లకు తీరని అన్యాయం.. కంటతడిపెట్టిన కీలక నేత!

ABN , First Publish Date - 2021-10-03T12:04:45+05:30 IST

క్యాంపు కార్యాలయానికి వస్తే అందరితో మాట్లాడి నిర్ణయం...

TRS పార్టీలో సీనియర్లకు తీరని అన్యాయం.. కంటతడిపెట్టిన కీలక నేత!

  • డివిజన్‌ అధ్యక్ష పదవి కేటాయింపులో అన్యాయం చేశారు
  • ఎమ్మెల్యేను నిలదీసిన ముషీరాబాద్‌ నేతలు

హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ముషీరాబాద్‌ డివిజన్‌ అధ్యక్ష పదవి నియామకంలో పార్టీ సీనియర్‌ నాయకులకు తీరని అన్యాయం చేశారని నాయకులు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను నిలదీశారు. కొత్త కమిటీ అధ్యక్షుడి నియామకాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. శనివారం బాపూజీనగర్‌లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరు కాగా డివిజన్‌ మాజీ అధ్యక్షుడు భిక్షపతియాదవ్‌, అధ్యక్ష పదవి ఆశించిన లక్ష్మణ్‌గౌడ్‌, శ్రీధర్‌రెడ్డి, సాంబశివరావు తదితరులు దూరంగా నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వారి వద్దకు వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.


కానీ వారు ఎమ్మెల్యే మాటలు వినకుండా తాము తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేస్తున్నామని, డివిజన్‌ నాయకులతో చర్చించకుండా ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. రాత్రి సమయంలో నర్సింగ్‌ప్రసాద్‌ను నూతన అధ్యక్షుడిగా ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. డివిజన్‌ నాయకులు, కార్యకర్తలతో చర్చించాక కమిటీ పై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు నూతన అధ్యక్షుడి నియామకాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. స్పందించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మాట్లాడుతూ అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని, ఆందోళన చెందవద్దని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. క్యాంపు కార్యాలయానికి వస్తే అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.


కంటతడిపెట్టిన దీన్‌దయాల్‌రెడ్డి..

డివిజన్‌ అధ్యక్ష పదవి ఇస్తానంటేనే టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ డివిజన్‌ మాజీ అధ్యక్షుడు దీన్‌దయాల్‌రెడ్డికి అధ్యక్ష పదవి కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై కంటతడిపెట్టారు. పదవి కేటాయింపులో తనకు అన్యాయం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. ఆయనతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌లో చేరిన డి.శివముదిరాజ్‌, కె.మాధవ్‌, ఓంకార్‌, సదా తదితరులు దీన్‌దయాల్‌రెడ్డిని ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ దీన్‌దయాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు.

Updated Date - 2021-10-03T12:04:45+05:30 IST