దివీస్‌ సీఎఫ్‌ఓపై రూ.96 లక్షల జరిమానా

ABN , First Publish Date - 2020-07-03T06:41:23+05:30 IST

దివీస్‌ లేబొరేటరీస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) ఎల్‌ కిషోర్‌ బాబు, అతని కుమారుడు, మరి కొంతమంది కంపెనీ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. సెబీ రూ.96 లక్షలకు పైగా జరిమానా

దివీస్‌ సీఎఫ్‌ఓపై రూ.96 లక్షల జరిమానా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దివీస్‌ లేబొరేటరీస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) ఎల్‌ కిషోర్‌ బాబు, అతని కుమారుడు, మరి కొంతమంది కంపెనీ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. సెబీ రూ.96 లక్షలకు పైగా జరిమానా విధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిం ది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై బుధవారం (జులై 1న) వీరికి నోటీసులు ఇచ్చింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కిషోర్‌ బాబు కుమారుడు ప్రవీణ్‌, లింగమనేని నగేశ్‌, లింగమనేని శ్రీలక్ష్మి, డీ శ్రీనివాసరావు, రాధిక,  ఎల్‌ గోపీచంద్‌, పుష్ప లతాదేవీ ఉన్నారు. వీరు కంపెనీ షేర్లలో నేరుగా లేదా పరోక్షంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. కంపెనీకి చెందిన విశాఖ పట్నంలోని యూనిట్‌-2పై యూఎస్‌ ఎఫ్‌డీఏ దిగుమతి అలర్ట్‌ను ఎత్తివేసినట్లు 2017, జులై 10న  ట్రేడింగ్‌ సమయంలో దివీస్‌ ల్యాబ్స్‌ ప్రకటించింది. ఇది షేర్‌ ధరను ప్రభావితం చేసే సమాచారం. జులై 10 కంపెనీ సమచారాన్ని ప్రకటించడంతో షేరు ధర దాదాపు 7 శాతం పెరిగింది. కంపెనీలో కీలక స్థానంలో ఉన్న కిషోర్‌ బాబునకు ముందుగానే ఈ సమాచారం తెలియడం వల్ల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని సెబీ పేర్కొంది. నోటీసులు అందుకున్న వారు 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. విశాఖపట్నం యూనిట్‌పై దిగుమతి హెచ్చరికను ఎత్తివేసినట్లు జులై 7నే తెలిసింది. కంపెనీ డైరెక్టర్‌ కిరణ్‌ దివీకి కంపెనీకి చెందిన న్యాయ విభాగం ఈ సమాచారాన్ని ఈ మెయిల్‌ ద్వారా పంపింది. ఈ సమాచారాన్ని కిషోర్‌ బాబు తెలుసుకుని ఉండవచ్చని సెబీ పేర్కొంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వల్ల దాదాపు రూ.74 లక్షల ప్రయోజనం పొందారు. దీనిపై వడ్డీతో కలిసి సెబీ జరిమానా విధించింది. కాగా సెబీ నోటీసులపై కిషోర్‌ బాబు న్యాయ సలహా తీసుకుని భవిష్యత్తులో తగిన నిర్ణయం తీసుకుంటారని దివీస్‌ లేబొరేటరీస్‌ తెలిపింది. 

Updated Date - 2020-07-03T06:41:23+05:30 IST