భగవత్తత్వం

ABN , First Publish Date - 2020-11-27T05:50:13+05:30 IST

ఒక ఊళ్ళో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. జీవనోపాధి కోసం అతను మేకల్ని చంపి, వాటి మాంసాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని మనసు కరడుగట్టింది. ముఖంలో క్రూరత్వం, మాటల్లో కాఠిన్యం ఉండేవి. అవి జనాన్ని అతనికి దూరంగా ఉంచేవి. చివరకు అతను అద్దంలో తన ముఖం చూసి తానే భయపడే స్థితికి చేరుకొనేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా అతణ్ణి చూసి

భగవత్తత్వం

భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. 


ఒక ఊళ్ళో పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. జీవనోపాధి కోసం అతను మేకల్ని చంపి, వాటి మాంసాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని మనసు కరడుగట్టింది. ముఖంలో క్రూరత్వం, మాటల్లో కాఠిన్యం ఉండేవి. అవి జనాన్ని అతనికి దూరంగా ఉంచేవి. చివరకు అతను అద్దంలో తన ముఖం చూసి తానే భయపడే స్థితికి చేరుకొనేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా అతణ్ణి చూసి భయపడేవారు. ఈ స్థితి నుంచి బయటపడడం ఎలాగో అతనికి అర్థం కాలేదు. 


ఆ ఊరికి ఒక జ్ఞాని వచ్చాడు. పాపయ్య ఆయనను కలిసి, తన బాధంతా చెప్పుకొన్నాడు. తనకు ఓ దారి చూపించమని ఆయనను వేడుకున్నాడు.


‘‘నాయనా! నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు. నీకు తప్పకుండా మేలు జరుగుతుంది’’ అన్నాడు జ్ఞాని.


‘‘అయ్యా! భగవంతుడు ఎవరు? అలా ఉంటాడు? నాకు తెలియజెయ్యండి’’ అని అడిగాడు పాపయ్య.


‘‘భగవంతుడు అంటే దయాసాగరుడు. ప్రేమ, కరుణ, శాంతి కలగలిసిన సముద్రం లాంటి రూపం ఆయనది. ఈ క్షణం నుంచీ ఆయన స్మరణలో ఉండడానికి ప్రయత్నించు. భగవంతుణ్ణి ధ్యానిస్తే  పాపకర్మలు నశిస్తాయి. అప్పుడే నువ్వు ఆ పరమాత్ముణ్ణి చూడగలవు’’ అని చెప్పాడు జ్ఞాని.


ఆయన ఆదేశం ప్రకారం పాపయ్య తన వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించాడు. భగవంతుణ్ణి అన్వేషిస్తూ బయలుదేరాడు. ఊర్లూ, వాడలూ తిరిగాడు. అడవులన్నీ వెతికాడు. గుడులూ, గోపురాలూ సందర్శించాడు. ప్రతి మనిషినీ నిశితంగా పరిశీలించాడు. జ్ఞాని చెప్పిన భగవంతుడి రూపం జాడలు ఎక్కడా కనిపించలేదు. విసిగి వేసారిన అతను ఒక ప్రశాంతమైన స్థలంలో చెట్టు కింద కూర్చొని, భగవంతుణ్ణి తలచుకుంటూ మధనపడసాగాడు. మనసులో ఏదో ఆరాటం... ఏదో తెలియని బాధ... అతనికి తెలియకుండానే కనురెప్పలు బరువెక్కి మూతపడ్డాయి. శరీరం తేలికయింది. క్షణాలు నిమిషాలయ్యాయి. అలా ఎన్ని గంటలు గడిచాయో తెలీదు. శరీరం ఉన్నదో లేదో తెలియని స్థితికి లోనయ్యాడు. ఏదో తెలియని ఆనందం... ఒకదాని వెనుక ఒకటిగా అనుభూతుల పరంపర... అతని చుట్టూ అపరిమితమైన వెలుగు. 


ఎప్పటికో మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడు. అంతా కొత్తగా ఉంది. తిరిగి జ్ఞాని దగ్గరకు వచ్చి, ఆ అనుభవం గురించి చెప్పాడు.


అప్పుడు జ్ఞాని ‘‘నీలోని తపనే నీకు మార్గదర్శకం అయింది. ఇంతకాలం నువ్వు ప్రాపంచిక విషయాలతో కలిసి బతికావు. ఇప్పుడు నీకు బాహ్య విషయాల మీద వైరాగ్యం కలిగింది. అదే నిన్ను అంతర్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు నీ మనసు దానంతట అదే లోలోపల నెమ్మదిస్తుంది. ఆ నిర్మలమైన మనసు నిన్ను ప్రేమమయుణ్ణి చేస్తుంది. నీ మాట, చూపు, ప్రవర్తన అన్నీ శాంతిమయం అవుతాయి. పరమాత్మ గుణాలనూ, శక్తులనూ నీలోలోపల ధారణ చేయడమే మహోన్నతమైన తపస్సు. దాన్ని సాధన ద్వారా మాత్రమే పొందగలవు’’ అని చెప్పాడు.


భగవంతుడు ఆకాశంలోనో, గుడిలోనో... ఏదో లోకంలో సింహాసనం మీద కూర్చొనో మనల్ని పరిపాలిస్తున్నాడనుకుంటాం. అయితే భగవంతుడు ఎక్కడో లేడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన చర్యలనూ, మనసునూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే... చంచలత్వం తొలగిపోతుంది. భగవంతుడివైపు దారి కనిపిస్తుంది. మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. ఈ కథలోని పాపయ్యలాగే ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత క్రూరత్వం, కాఠిన్యం ఉంటాయి. ఆయుధాలతో బాధించేవాడే కాదు, ఎదుటి మనిషిని మాటలతో బాధపెట్టేవాడు కూడా క్రూరుడే! అందుకే ప్రతి మనిషీ తన అంతరంగంలోకి తొంగి చూసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలి. అప్పుడే అతడిలో చైతన్య శక్తి ప్రజ్వరిల్లుతుంది. 

బ్రహ్మకుమారీస్‌

Updated Date - 2020-11-27T05:50:13+05:30 IST