అటకెక్కిన జీడిపల్లి-భైరవానితిప్ప-కుందుర్పి ఎత్తిపోతల

ABN , First Publish Date - 2022-05-31T06:39:11+05:30 IST

కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలలో కొన్నేళ్లుగా సగటు వర్షపాతం కూడా కురవడం లేదు. ఇక్కడ ఎడారీకరణ మొదలైందని శాస్త్రవేత్తలు గుర్తించి, ఆందోళన వ్యక్తం చేశారు.

అటకెక్కిన జీడిపల్లి-భైరవానితిప్ప-కుందుర్పి ఎత్తిపోతల
కుందుర్పి మండలం కరిగానపల్లి మామిడి తోటలో కాలవ తవ్వకం

చెదిరిన నీటి కల

114 చెరువులకు హంద్రీనీవా నీటిని తరలించేలా పథకం

టీడీపీహయాంలో యుద్ధ ప్రాతిపదికన పనులు

పరిహారం  కోసం రైతుల ఎదురుచూపు

పైసా విదల్చని వైసీపీ ప్రభుత్వం


కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలలో కొన్నేళ్లుగా సగటు వర్షపాతం కూడా కురవడం లేదు. ఇక్కడ ఎడారీకరణ మొదలైందని శాస్త్రవేత్తలు గుర్తించి, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతలో 114 దాకా చెరువులు ఉన్నాయి. వర్షాభావంతో నిరుపయోగంగా మారాయి. ఇక్కడి భూములను తడిపేందుకు హంద్రీనీవా నీటిని తరలించేలా గత ప్రభుత్వం ఓ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. నాటి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. భూ సేకరణ, కాలువల తవ్వకం యుద్ధ ప్రాతిపదికన మొదలైంది. కానీ ప్రభుత్వం మారడంతో ఈ నేల ఆశలు అడియాసలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లగా పైసా ఇవ్వలేదు. కాలువల కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం అందలేదు. ఎత్తిపోతల పనులు పూర్తి అయితే.. అధికారికంగా చెరువుల కింద ఉన్న 15 వేల ఎకరాల ఆయకట్టుకు తోడు.. మరో 35 వేల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని అధికారులు అంటున్నారు.

- కళ్యాణదుర్గం



ఎత్తిపోతల కోసం..

కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం జీడిపల్లి-భైరవానితిప్ప-కుందుర్పి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.969 కోట్లు నిధులను కేటాయించింది. 2018 అక్టోబరు 10న గుమ్మఘట్ట మండలం భైరవానితిప్ప ప్రాజెక్టు, కళ్యాణదుర్గం మండలం గరుడాపురం వద్ద నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులతో కలిసి భూమిపూజ చేశారు. కాలువ తవ్వకాలకు శంకుస్థాపన చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ఆధ్వర్యంలో భూసేకరణ చేసి, రైతులకు పరిహారం అందించాలని, యుద్ధప్రాతిపదికన కాలువ తవ్వకాల పనులు చేపట్టాలని నాటి బహిరంగసభలో అధికారులకు ఆదేశించారు. బెళుగుప్ప, కళ్యాణదుర్గం, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల పరిధిలో అధికారులు సర్వే చేశారు. 1500 ఎకరాల భూమిని సేకరించేందుకు, భూములు కోల్పోతున్న రైతులను గుర్తించారు. 800 మంది రైతులకు రూ.120 కోట్లను పరిహారం ఇవ్వాలని నివేదిక తయారుచేశారు. ఇంతలోనే ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు ఆగిపోయాయి. 


ప్రభుత్వం మారడంతో..

భూసేకరణ కోసం రైతులకు ఎకరానికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారం మారడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రాజెక్టు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్‌, రైతులకు పరిహారం చెల్లించకముందే కళ్యాణదుర్గం, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల పరిధిలో కాలువల తవ్వకం మొదలు పెట్టారు. వందలాది మంది రైతుల వ్యవసాయ పొలాల్లో కాలువలు తవ్వారు. ఇప్పటికీ పరిహారం అందక బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కాంట్రాక్టర్‌కు తొలిదశలోనే బిల్లులు మంజూరుకాకపోవడంతో పనులను నిలిపివేశారు.  




50 వేల ఎకరాలకు నీరు..

కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో 114 చెరువులు ఉన్నాయి. వీటిలో 78 పెద్ద చెరువులు, 36 చిన్న చెరువులు. కళ్యాణదుర్గం మండలంలో 14 చెరువుల పరిధిలో 1,154 ఎకరాల ఆయకట్టు ఉంది. కంబదూరులోని 18 చెరువుల పరిధిలో 2,622 ఎకరాల ఆయకట్టు ఉంది. కుందుర్పి మండలంలో 13 చెరువుల పరిధిలో 744 ఎకరాల ఆయకట్టు, శెట్టూరు మండలంలో 11 చెరువుల కింద 1,674 ఎకరాలు, బ్రహ్మసముద్రం మండలంలో 11 చెరువుల కింద 2,234 ఎకరాల ఆయకట్టు ఉంది. 

- అధికారికంగా 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాలి. కానీ చెరువులను నింపితే ఈ ప్రాంతంలో సుమారు 50 వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని పంచాయతీరాజ్‌, ఇరిగేషన శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

- జీడిపల్లి - భైరవానితిప్ప - కుందుర్పి ఎత్తిపోతల పథకం ద్వారా 14 లిఫ్ట్‌లను ఏర్పాటుచేసి 114 చెరువులకు నీరు నింపేందుకు హెచఎనఎ్‌సఎ్‌స అధికారులు ప్రణాళిక రూపొందించారు. కళ్యాణదుర్గం సమీపంలో బీఎ్‌సఆర్‌ కంపెనీ వారు లిఫ్ట్‌ల ఏర్పాటుకు  పరికరాలను సిద్ధంగా ఉంచారు. 



తీవ్ర నిర్లక్ష్యం

ఎత్తిపోతల పనులను వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.969 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో కేవలం రూ.36 కోట్లు కేటాయించారు. కానీ పైసా కూడా విడుదల చేయలేదు. దుర్గం ప్రాంతంలో 18 ఏళ్లుగా సగటు వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. దీంతో సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలాంటి దుర్భిక్ష ప్రాంతానికి సాగునీరు అందించేందుకు చొరవ చూపాల్సిన ప్రభుత్వం, నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడం పట్ల రైతుల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. 



బంగారం లాంటి భూమి..

రైతులకు మేలు జరుగుతుందని బంగారం లాంటి భూమిని కోల్పోయాను. హంద్రీనీవా కాలువ తవ్వకాలకు నాలుగు ఎకరాల భూమిని తీసుకున్నా రు. నా పొలం అనంతపురం ప్రధాన రహదారి సమీపంలో ఉంది. ప్రసు ్తతం ఎకరం రూ.కోటి పలుకుతోంది. కాని ప్రభు త్వం నుంచి రూ.25 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామని అంటున్నారు. మూడేళ్లు గడిచినా చిల్లిగవ్వకూడా అందలేదు. కాలువ కోసం తవ్వడంతో భూమి సాగు చేసుకోడానికి వీలు లేకుండా పోయింది. 

 - తిమ్మరాజులు, ఒంటిమిద్ది


రెండు విధాలా నష్టం..

చెరువులను నీటితో నింపేందుకు మా పొలంలో కాలు వ తవ్వారు. ఇందుకోసం 1.50 ఎకరా భూమిని తీసుకున్నారు. పొలంలో అరకొర తవ్వకాలు చేపట్టారు. కాని పరిహారం మాత్రం ఇవ్వలేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని అధికారులు అంటున్నారు. భూమి సాగుచేసుకునేందుకు లేకుండా తవ్వేశారు. దీనికితోడు పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 

- రామన్న, ఒంటిమిద్ది


పరిహారం ఊసేలేదు..

కాలువ కోసం 1.06 ఎకరాల భూమిని ఇచ్చాను. ఎకరానికి రూ.7 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. మూడేళ్లు గడిచినా పరిహారం ఊసేలే దు. జేసీ వద్ద సంప్రదింపులు నిర్వహించారు. ఇదిగో అదిగో అని పరిహారం గురించి ఊరించి, ఉసూరుమనిపించారు. నాతో పాటు చాలామంది రైతులు భూమిని కోల్పోయారు. అందరం పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నాం.

 అమర వీరారెడ్డి, బసంపల్లి, శెట్టూరు



Updated Date - 2022-05-31T06:39:11+05:30 IST