Abn logo
Sep 14 2021 @ 03:20AM

చెదిరిన స్వప్నం

  • పైనల్లో జొకోవిచ్‌ ఓటమి 
  • చేజారిన క్యాలెండర్‌ ఇయర్‌ స్లామ్‌
  • యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌
  • రష్యన్‌ స్టార్‌ ఖాతాలో తొలి గ్రాండ్‌స్లామ్‌


గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన మూడో రష్యా ప్లేయర్‌ మెద్వెదెవ్‌. 2000లో మారత్‌ సఫిన్‌ తర్వాత యూఎస్‌ ఓపెన్‌ సాధించిన 

ఆ దేశ ఆటగాడూ మెద్వెదెవే. 


 2009లో డెల్‌ పొట్రో తర్వాత కెరీర్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌గా యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన తొమ్మిదో ఆటగాడు మెద్వెదెవ్‌. 


ఒక్క అడుగు వేస్తే.. టెన్నిస్‌ చరిత్రలో 

చిరస్థాయిగా నిలిచిపోయేవాడు. ఒక్క మ్యాచ్‌ గెలిస్తే.. అర్ధ శతాబ్దం తర్వాత క్యాలెండర్‌ ఇయర్‌ స్లామ్‌ సాధించిన ఆటగాడిగా కీర్తి గడించేవాడు. కానీ, నొవాక్‌ జొకోవిచ్‌ కల చెదిరింది. యూఎస్‌ ఓపెన్‌లో అతనికి నిరాశ ఎదురైంది. ఈ ఏడాది ఓటమనేదే లేకుండా సాగిన జొకో.. ఇక్కడ ఆఖరి మెట్టుపై బోల్తాపడ్డాడు.

 

కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ కోసం ఎదురుచూస్తున్న 25 ఏళ్ల డానిల్‌ మెద్వెదెవ్‌ అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో జొకో చేతిలో ఎదురైన పరాజయానికి గ్రాండ్‌ విక్టరీతో బదులు తీర్చుకున్నాడు. టోర్నీ ఆసాంతం ఆకట్టుకొనే ప్రదర్శన చేసిన ఈ రష్యన్‌ స్టార్‌.. ఫైనల్లో అంతకు మించిన జోరుతో విజృంభించాడు.  యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌తో తన పెళ్లిరోజున భార్యకు ‘గ్రాండ్‌’ గిఫ్ట్‌ ఇచ్చాడు. 


న్యూయార్క్‌: చరిత్రను తిరగరాయాలనుకొన్న వరల్డ్‌ నెంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కల చెదిరింది. పురుషుల టెన్ని్‌సలో యాభై ఏళ్ల తర్వాత సెర్బియా యోధుడు జొకోకు మాత్రమే లభించిన అరుదైన క్యాలెండర్‌ ఇయర్‌ స్లామ్‌ ఘనత సాధించే అవకాశం.. కళ్లముందే కరిగిపోయింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ నెగ్గిన జొకో.. యూఎస్‌ ఓపెన్‌ కూడా గెలిస్తే క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ స్వప్నం నెరవేరేది. 1969లో రాడ్‌ లేవర్‌ తర్వాత ఈ అరుదైన ఘనతను అందుకొన్న ప్లేయర్‌గా నొవాక్‌ ఆధునిక టెన్ని్‌సలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకొనేవాడు. అంతేకాదు.. 21వ గ్రాండ్‌స్లామ్‌తో అత్యధిక మేజర్‌ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగానూ అద్భుత రికార్డును చేరుకునేవాడు. కానీ, యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ ఫైట్‌లో జొకోవిచ్‌ ఓటమిపాలయ్యాడు. ఈ ఏడాది పరాజయమే లేకుండా 27 వరుస విజయాల జొకో జైత్రయాత్రకు.. రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ బ్రేక్‌ వేశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4తో జొకోవిచ్‌పై వరుససెట్లలో గెలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ముద్దాడాడు.. 


అంతా ఏకపక్షమే..:  కెరీర్‌లో మొదటి మేజర్‌ టైటిల్‌ వేటలో ఉన్న మెద్వెదెవ్‌.. ఫైనల్లో ఆకలిగొన్న పులిలా విరుచుకుపడ్డాడు. 2 గంటలా 15 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో.. నొవాక్‌ను అతడి తరహా ఆటతోనే చిత్తు చేశాడు. మ్యాచ్‌లో జొకో 6 ఏస్‌లు సంధిస్తే.. మెద్వెదెవ్‌ 16 ఏస్‌లతో బెంబేలెత్తించాడు. మ్యాచ్‌లో 38 అనసవర తప్పిదాలు చేసిన నొవాక్‌.. ఆటలో పూర్తిగా సంయమనం కోల్పోయాడు. తొలిసెట్‌ మొదటి గేమ్‌లోనే జొకో సర్వీస్‌ను బ్రేక్‌ చేసి మెద్వెదెవ్‌ మ్యాచ్‌ను గ్రాండ్‌గా ఆరంభించాడు. నొవాక్‌కు మరో అవకాశం ఇవ్వకుండా సర్వీ్‌సలు నిలబెట్టుకుంటూ 6-4తో ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ, రెండో సెట్‌లో జొకో దీటైన స్ట్రోక్‌లతో పుంజుకొనే విధంగా కనిపించాడు.  కానీ, ఐదో గేమ్‌లో నొవాక్‌ సర్వీ్‌సను బ్రేక్‌ చేసి డానిల్‌ 3-2తో ముందంజ వేశాడు. అదే జోరులో 6-4తో రెండో సెట్‌ను కూడా నెగ్గాడు. మూడో సెట్‌లో పదునైన సర్వీ్‌సలతో రెచ్చిపోయిన మెద్వెదెవ్‌.. రెండు బ్రేక్‌ పాయింట్లతో 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ, పట్టువీడని జొకో వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 4-5తో పోటీలోకి వచ్చే ప్రయత్నం చేశా డు. అయితే, పదో గేమ్‌లో కీలక సమయంలో జొకో చేసిన తప్పిదాలతో మెద్వెదెవ్‌ 6-4తో ఆ సెట్‌ నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో నొవాక్‌ చేతిలో ఎదురైన ఓటమికి గట్టిగానే బదులు తీర్చుకున్నాడు. 

భావోద్వేగం..అసహనం

చరిత్ర సృష్టించే అవకాశం త్రుటిలో చేజారిందన్న బాధో లేక అసహ నమో కానీ జొకోవిచ్‌ ఈసారి తన భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోయాడు. మెద్వెదెవ్‌ చేతిలో ఓటమితో తీవ్ర అసహనానికి గురైన అతడు.. రాకెట్‌ను నేలకేసి కొట్టడంతో అది విరిగిపోయింది. ఆ వెంటనే తేరుకొని తీవ్ర వేదనకు గురై కంటతడి పెట్టుకున్నాడు. ‘ఈ టైటిల్‌ కోసం కొన్ని వారాలుగా మానసికంగా, శారీరకంగా చాలా ఒత్తిడి అనుభవించా. ఇప్పుడు ఈ పోరు ముగియడంతో ఉపశమనంగా ఉంది. అదే సమయంలో అనుకున్నది సాధించలేకపోయినందుకు బాధగానూ ఉంది. మ్యాచ్‌కు హాజరైన అభిమానులకు ధన్యవాదాలు’ అని రన్నరప్‌ ట్రోఫీ అందుకున్న తర్వాత జొకో అన్నాడు.  

శ్రీమతి.. అందుకో బహుమతి

మెద్వెదెవ్‌ పెళ్లిరోజున యూఎస్‌ ఓపెన్‌ నెగ్గి విజయాన్ని చిరస్మరణీయం చేసుకున్నాడు. ఈరోజు తన మూడో వివాహ వార్షికోత్సవమని ట్రోఫీ అందుకొన్న తర్వాత మెద్వెదెవ్‌ వెల్లడిం చాడు. ఈ ప్రత్యేకమైన రోజున శ్రీమతి డారియాకు బహుమతి కొనలేకపోవడంతో.. మ్యాచ్‌ నెగ్గి కానుకగా ఇవ్వాలనుకున్నానని తెలిపాడు. తన విజయంలో భార్య ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పాడు. అక్కడే గ్యాలరీలో కూర్చొన్న డారియా.. భర్త మాటలతో భావోద్వేగానికి గురైంది. ‘డారియాకు నాపై ఎంతో నమ్మకం. ఆమెను పెళ్లి చేసుకొన్నప్పటి నుంచి కెరీర్‌లో వేగంగా ఎదిగా. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. టోర్నీ జరుగుతున్నప్పుడు డారియాకు ఏ బహుమతి ఇవ్వాలి? అనేది అసలు ఆలోచించలేదు. కానీ, ఫైనల్‌ చేరాక విజయాన్నే కానుకగా ఇవ్వాలని అనుకున్నా. ఐ లవ్‌ యూ డారియా’ అని మెద్వెదెవ్‌ అనడంతో స్టేడియం చప్పట్లతో మారుమోగింది. 

ఓపెన్‌ ఎరాలో క్యాలెండర్‌ ఇయర్‌ స్లామ్‌ చేజార్చుకున్న మూడో ప్లేయర్‌ జొకోవిచ్‌. మార్టినా నవ్రతిలోవా (1984), సెరెనా విలియమ్స్‌ (2015) తొలి రెండుస్థానాల్లో ఉన్నారు.