కలవరం!

ABN , First Publish Date - 2022-01-19T04:15:50+05:30 IST

ఓమైక్రాన్‌ వల్ల భయం లేదంటూనే జిల్లా అధికార యంత్రాంగం క్రమంగా ఆంక్షలను తిరిగి విధిస్తుండడంతో ప్రజలు కలవర పడుతు న్నారు. రా

కలవరం!
లోగో

ఆసిఫాబాద్‌ ఏజెన్సీపై మళ్లీ కరోనా పంజా
-పెరుగుతున్న ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య
- అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ
- అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టుల పునరుద్ధరణ
- రోజుకు 70 నుంచి 100లోపు పాజిటివ్‌ కేసులు
- అవసరాన్ని బట్టి మరిన్ని ఆంక్షలు పెట్టే యోచనలో అధికారులు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌):
ఓమైక్రాన్‌ వల్ల భయం లేదంటూనే జిల్లా అధికార యంత్రాంగం క్రమంగా ఆంక్షలను తిరిగి విధిస్తుండడంతో ప్రజలు కలవర పడుతు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న దరమిలా అటు రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. ఫిబ్రవరి, మార్చి నాటికి ఒమైక్రాన్‌ కేసులు తారా స్థాయికి చేరే అవకాశం ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యగా మరోసారి కరోనా ఆంక్షలను కఠిన తరం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ నేతృత్వంలో కరోనా కేసుల పెరుగుదలపై ఒమైక్రాన్‌ ప్రభావం వంటి అం శాలపై సమీక్ష నిర్వహించారు. ఈనేపథ్యంలోనే జిల్లాలో కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాలు విధి విధానాలను ఖరారు చేశారు.

కరోనా కట్టడి చర్యల్లో..
కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే గతంలో ఏర్పాటు చేసిన అంతర్‌రాష్ట్ర చెక్‌ పోస్టులను మరో సారి పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇప్పటికే వాంకిడి,  సిర్పూరు(టి) మండల వెంకట్రావుపేట, చింతలమానేపల్లి మండలం గూడెం ప్రాంతాల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల పౌరుల రాక పోకలపై నిఘా పెట్టారు. అంతేకాదు ఈ మూడు చెక్‌ పోస్టులతో పాటు బస్‌ స్టేషన్‌లు ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక స్ర్కీనింగ్‌ చేసి అనుమానం వచ్చిన వారి శాంపిల్‌ సేకరిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు జిల్లాలో కరోనా ప్రభావం అంతంత మాత్రంగానే ఉండగా ప్రస్తుతం కేసుల్లో పెరుగుదల నమోదు అవుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గడిచిన పది రోజులుగా సగటున రోజుకు పది నుంచి పదిహేను కేసులు నమోదు అవుతున్నట్టు వైద్యులు గుర్తించారు. జిల్లాలోని 24 ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రిల్లో ఆర్‌ఎటీ, ఆర్టీపీసీఆర్‌ టెస్టులను నిర్వహిస్తున్నారు. సగటున జిల్లాలో ప్రతిరోజు 600 నుంచి 650 పరీక్షలు నిర్వహిస్తుండగా పాజిటివిటీ రేటు నాలుగు నుంచి ఐదు శాతంగా నమోదు అవుతున్నట్టు చెబుతున్నారు. ఈ నెల చివరి నాటికి కేసుల్లో మరింత పెరుగుదల నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్న దరిమిలా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మనోహర్‌  వైద్య సిబ్బంది ద్వారా ఒమైక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో సర్వే చేయిస్తున్నారు.

కాగజ్‌నగర్‌ పరిధిలో..
కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ సంబంధించిన కేసులు రోజు రోజుకు అధికంగా నమోదు అవుతున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు కారణం లేక పోలేదు. కాగితపు పరిశ్రమ పునరుద్ధరణ తర్వాత వాణిజ్య కలపాలు పెరుగడం, ఉత్తారాదికి చెందిన వ్యాపారులు, ఉద్యోగులు తరుచూ రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఓమై క్రాన్‌ ఈ ప్రాంతానికి చేరిందని అనుమానిస్తున్నారు. ఇటీవల పరిశ్రమలో పని చేస్తున్న చాలా మంది కార్మికులు ఓకే రకమైన లక్షణాలతో బాధ పడుతూ చికిత్స పొందడంతో వారికి జరిపిన పరీక్షల్లో ఇందులో చాలా మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అయితే అవి డెల్టా ప్లస్‌ వేరియంటా? లేక ఒమైక్రాన్‌ వేరియంటా? తేలాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాల కారణంగానే ఇప్పటి వరకు జిల్లాలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు అవుతున్నట్టు సమాచారం బయటికి పొక్కనీయడం లేదని తెలుస్తోంది. కాగా ప్రభుత్వం పౌరుల కదలికలపైన మరోసారి ఆంక్షలు విధించేందుకు సమాయాత్తం అవుతన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా కొవిడ్‌ నిబంధనలపై గతంలో లాగానే అవగాహన కల్పిస్తామంటూ ప్రకటనలు  చేయ డం ఈ సందర్భంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా కొవిడ్‌ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు చేపట్టేందుకు ఇటు రెవెన్యూ, అటు పోలీసు యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇటీవల చింతలమానేపల్లి మండలంలో జరిగిన కేసు చక్కటి ఉదాహరణ. ఓ ఆర్‌ఎంపీ వైద్యుడికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయినత తర్వాత కూడా సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో  అతడిపై ప్రకృతి వైపరీత్యాల చట్టం కింద కేసు చేశారు.

జిల్లాలో 3.55 లక్షల మందికి వ్యాక్సిన్‌..
కుమరం భీం జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3.55లక్షల మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మొదటి డోసు పూర్తి చేశారు. అలాగే మొత్తం 2.16లక్షల మందికి రెండో డోసు కూడా పూర్తి చేశారు. అలాగే 15-18 సంవత్సరాల వయస్సు గలిన 50వేల మందికి గాను ఇప్పటి వరకు 15,455 మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. కాగా 15-18 సంవత్సరాల యువకులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ షెడ్యూలు ప్రకారం ఈ నెల చివరికి పూర్తి కావాల్సి ఉంది. కాగా ప్రభుత్వం పాఠశాలల, జూనియర్‌, డిగ్రీ కళాశాలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవు ప్రకటించిన దరిమిలా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-01-19T04:15:50+05:30 IST