Abn logo
Jun 10 2021 @ 23:58PM

కలవరమే ప్రమాదమై..


 గంజాయి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం
తీవ్రంగా గాయపడిన యువకుడు
శృంగవరపుకోట, జూన్‌ 10:
గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఉంటారేమోనన్న భయంతో వేగంగా దూసుకెళ్లారు. గేటు తగలుతుందన్న విషయాన్ని వాహనంపై వెనుక కూర్చొన్న యువకుడు గమనించకపోవడంతో అది తగిలి ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా అరుకు నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గంజాయి బ్యాగుతో ఎస్‌.కోట వైపు వస్తున్నారు. అనంతగిరి మండలం చిలకలగెడ్డ అటవీశాఖ చెక్‌పోస్టు సమీపానికి వచ్చేసరికి వారిలో కంగారు మొదలైంది. పోలీసులు అడ్డుకుంటారన్న భయంతో ద్విచక్రవాహనాన్ని వేగంగా పోనిచ్చారు. నడుపుతున్న వ్యక్తి చెక్‌పోస్టు గేటు తగలకుండా తలను కిందకు వంచాడు. వెనుకున్న వ్యక్తి గేటును గమనించకపోవడంతో దుంగకు అతని తల బలంగా తగిలింది. ఆ సమయంలో వాహనం అదుపు తప్పడంతో ఇద్దరూ కింద పడ్డారు. వాహనం నడిపిన యువకుడు వెంటనే తేరుకుని వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు గమనించి వెంటనే 108కి ఫోన్‌ చేశారు. అనంతరం ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. బలమైన గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్‌కు వైద్యులు రిఫర్‌ చేశారు. సంఘటన స్థలంలో పడిన బ్యాగును స్థానికులు పరిశీలించగా... అందులో గంజాయిని గుర్తించారు. అనంతగిరి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తి సమాచారం ఇంకా లభ్యం కాలేదు.