బొమ్మూరు క్వారంటైన్‌లో కలకలం

ABN , First Publish Date - 2020-05-19T06:55:10+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ టెస్టులు 27వేలకు చేరుకున్నాయి. మార్చిలో ప్రారంభించిన వైద్య పరీక్షలు గత నెల నుంచి పుంజుకున్నాయి.

బొమ్మూరు క్వారంటైన్‌లో కలకలం

 అక్కడకు వచ్చిన ప.గో.జిల్లా వ్యక్తికి పాజిటివ్‌ రిపోర్టు 

 జిల్లాలో మొత్తం 57కు చేరిన కేసులు: 43 మంది డిశ్చార్జి

 ఇప్పటిదాకా 27వేల కొవిడ్‌-19 టెస్టులు 8 సోమవారం 893 శాంపిళ్ల సేకరణ

 మనీలా, మస్కట్‌ల నుంచి 120 మంది జిల్లావాసులు నేడు రాక

 ఆర్టీసీ సర్వీసుల ప్రారంభంపై ప్రభుత్వం కసరత్తు

 వలస కార్మికుల తరలింపు పూర్తయ్యాకే దశలవారీగా జిల్లాల్లో రాకపోకలు

 బస్సుల్లో సగం సీట్లలోనే ప్రయాణికులకు అనుమతి: గరిష్ఠంగా 20 మంది

 లాక్‌డౌన్‌ పొడిగింపుతో నెలాఖరు వరకు దేవాలయాల్లో దర్శనాలు రద్దు


(కాకినాడ, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

జిల్లాలో కొవిడ్‌ టెస్టులు 27వేలకు చేరుకున్నాయి.  మార్చిలో ప్రారంభించిన వైద్య పరీక్షలు గత నెల నుంచి పుంజుకున్నాయి. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవు తుండడంతో ఆర్‌టీపీసీఆర్‌తో పాటు ట్రూనాట్‌ యంత్రాలతో రోజుకు 700 నుంచి 800 వరకు టెస్టుల సంఖ్యను పెంచారు. అటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలు, జిల్లా వాసులకు ప్రభుత్వ క్వారంటైన్‌ల్లో  పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా 893 మందికి కొవిడ్‌ టెస్టులు చేశారు. బొమ్మూరు క్వారంటైన్‌లో ఉంటున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 23ఏళ్ల యువకుడికి సోమవారం పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా పాల కొల్లుకు చెందిన ఒక వలస కూలీ హైదరాబాద్‌ నుంచి ఆదివారం లారీలో రాజమహేంద్రవరం వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించ డంతో ఎందుకైనా మంచిదని బొమ్మూరులోని క్వారంటైన్‌కు వెళ్లాడు. సాయంత్రం కొవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్‌ రిపోర్టు రావడంతో రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. దీంతో ఇప్పుడు అక్కడ క్వారంటైన్‌లో ఉంటున్న వారందరికీ పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య 57కు చేరింది. ఇప్పటివరకు వీరిలో 43 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 


ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకుపోయిన జిల్లావాసులు తొలిసారిగా మంగళవారం స్వస్థలాలకు చేరుకోనున్నారు. మనీలా, మస్కట్‌లలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది నాలుగు విమానాల్లో మంగళవారం విశాఖపట్నం, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో దిగనున్నారు. ఇందులో జిల్లాకు చెందిన వారు 120 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మందిని కోనసీమకు చెందిన వారిగా గుర్తించారు. ఆయా  ప్రాంతాల నుంచి బస్సుల్లో వీరంతా జిల్లా సరిహద్దుకు చేరుకోగానే సంబంధిత రెవెన్యూ డివిజన్ల అధికారులు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి కొవిడ్‌ టెస్టులు చేయిస్తారు.


ఆ తర్వాతే దశలవారీగా ఆర్టీసీ సర్వీసులు

సోమవారం నాలుగో విడత లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అయితే ఈ దఫా మినహాయింపులు అధికంగా ఉండను న్నాయి. అందులో భాగంగా ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సగం సీట్లతోనే సర్వీసులు నడపాలని, ఒక్కో బస్సులో 20 మంది ప్రయాణికులనే అనుమతించాలని సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తొలి విడతగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లో చిక్కుకున్న జిల్లాల ప్రజలను తీసుకురానుంది. ఎక్కిన చోట నుంచి గమ్యస్థానం వరకు నాన్‌ స్టాప్‌ సర్వీసులో తీసుకొస్తారు. వలస కూలీలు, కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాతే రాష్ట్ర పరిధిలో జిల్లాల్లో బస్సు సర్వీసులను దశలవారీగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎక్కడెక్కడ? ఎలా? బస్సులు ప్రారంభించాలనే దానిపై అధికారులు నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ప్రైవేటు బస్సుల రవాణాకు ఏయే రూట్లలో అనుమతిస్తారనే దానిపై అప్పుడు స్పష్టత రానుంది. 


మరోపక్క లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో జిల్లాలో అన్నవరం సహా ఇతర అన్ని దేవాలయాల్లోనూ భక్తులకు దర్శనాలు రద్దు చేశారు. నిత్య సేవలు యథావిధిగా జరుగుతాయి. నాలుగో విడత లాక్‌డౌన్‌ మొదలైన వెంటనే రహదారులపై జనసంచారం అధికమైంది. సాయంత్రం ఆరు దాటినా వాణిజ్య, వ్యాపార దుకాణాలు తెరిచే ఉన్నాయి. ఆటోలు సైతం పెద్ద ఎత్తున తిరిగాయి.

Updated Date - 2020-05-19T06:55:10+05:30 IST