కార్యాలయాల్లో కలవరం

ABN , First Publish Date - 2022-01-21T05:49:16+05:30 IST

కార్యాలయాల్లో కలవరం

కార్యాలయాల్లో కలవరం
కూసుమంచి ఎంపీడీవో కార్యాలయాన్ని శానిటైజ్‌ చేస్తున్న సిబ్బంది

వైరస్‌ బారిన పడుతున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు 

ఖమ్మం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కరోనా కలవరం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా జనసమ్మర్థ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా వివిధ పనుల కోసం జనం రాకపోకలు సాగించే ప్రభుత్వ కార్యాలయాల్లో పాజిటివిటీ పెరుగుతోంది. రెండు, మూడురోజులుగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు కరోనా బారనపడుతుండటంతో కార్యాలయాల మెట్లు ఎక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు. పదిరోజులుగా రోజురోజుకు పాజిటివ్‌ కేసులు రెట్టింపవుతున్న క్రమంలో నిత్యం ప్రజలతో సంబంధాలుండే ఉద్యోగులు, అధికారులకూ కరోనా బాధలు తప్పడంలేదు. ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, వైద్యఆరోగ్య, సంక్షేమశాఖ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లు, బ్యాంకుల్లో పదుల సంఖ్యలో బాధితులుగా మారుతున్నారు. వైరస్‌ బారిన పడిన అధికారులు, ఉద్యోగులు హోంఐసోలేషన్‌లో ఉంటుండటంతో ప్రజాసేవల నిర్వహణలో ఆటంకం ఏర్పడుతోంది. ఖమ్మం కలెక్టరేట్‌లో నలుగురు పర్యవేక్షక అధికారులు కరోనా బారిన పడ్డారు. జిల్లా పంచాయతీరాజ్‌ కార్యాలయంలో నలుగురు ఇంజనీరింగ్‌ అధికారులు కొవిడ్‌ బాధితులయ్యారు. ఇక కరోనా టెస్టుల కోసం వచ్చే వారితో నిత్యం రద్దీగా కనిపిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బందిని వైరస్‌ అంటుకుంటోంది. ఒక్క ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోనే ఐదుగురు వైద్యులు, సుమారు ఎనిమిది మంది నర్సింగ్‌ ఉద్యోగులు, ఐదుగురు పారామెడికల్‌ సిబ్బంది మొత్తం 18మంది వైరస్‌ బారిన పడ్డారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా సహకార, విద్యుత్‌, విద్యాశాఖలకు సంబంధించిన కొందరు అధికారులకు కరోనా సోకింది. అయితే ఇంకా చాలామంది కరోనా బారిన పడుతున్నా గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. కూసుమంచి ఎంపీడీవో సహా పలువురు అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారని, ఇదే మండలంలో నలుగురు వ్యవసాయశాఖ ఏఈవోలు బాధితులయ్యారు. రిజిస్ర్టేషన్‌, వ్యవసాయశాఖ, ఆర్టీసీ, కూరగాయల మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌, ఇతర వ్యాపారసముదాయాల్లో పాజిటివ్‌ కేసులు నమోదతున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో మొత్తం 26మంది గ్రామకార్యదర్శులు, ఖమ్మం కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూవిభాగాల్లో ఆరుగురు, అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కొందరికి పాజిటివ్‌ వచ్చింది. ఇక సంక్రాంతి సమయంలో నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉన్న ఆర్టీసీలో సిబ్బందిపైనా కరోన ప్రతాపం చూపుతోంది. ఆర్టీసీలోనూ సుమారు 65మంది కొవిడ్‌ బారిన పడినట్టు సమాచారం. కరోనా నియంత్రణకు పోలీసు శాఖలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా పోలీసుస్టేషన్లకు వచ్చి వెళ్లేవారి కారణంగా, బందోబస్తులో ఉంటున్న కారణంగా పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఈనెల 1వతేదీ నుంచి ఇప్పటివరకు మొత్తం 60మంది పోలీసుశాఖలో కరోనాకు గురయ్యారు. కారేపల్లి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో సిబ్బంది కరోనా బారిన పడటంతో కార్యాలయాన్ని మూసేశారు. ఇక భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనూ కలెక్టరేట్‌, డీఆర్‌డీఏ, మునిసిపాలిటీ, పోలీసు, విద్యాశాఖ, సంక్షేమశాఖల్లోనూ కరోన కేసులు నమోదవుతున్నాయి. జిల్లా అదనపు కలెక్టర్‌తోపాటు పలువురు ఉద్యోగులు, సిబ్బంది సుమారు 100మంది వరకు హోంఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఆఫీసుల్లో వేగంగా వైరస్‌ వ్యాప్తి 

కూసుమంచి/ కల్లూరు/ కారేపల్లి , జనవరి 20: ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలవరం రేపుతోంది. వివిధ పనుల నిమిత్తం అధికసంఖ్యలో జనం రాకపోకలు సాగించే ఆఫీసుల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. పలువురు అధికారులు, సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రస్తుతం కూసుమంచి మండలంలో 46 కేసులు నమోదవగా.. ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన వాట్సాప్‌గ్రూప్‌లో సమాచారం అందించారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయంలో ముగ్గురు సిబ్బందికి, మరో 14మంది పంచాయతీ కార్యదర్శులకు కరోనా సోకినట్టు సమాచారం. అలాగే పోలీస్‌స్టేషన్లో నలుగురికి, రెవెన్యూ కార్యాలయంలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని, ఇంటింటి జ్వరాల సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మరో వైపు కల్లూరు కల్లూరు, చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న పలువురికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా మొత్తం 42 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే మండల పరిషత్‌ కార్యాలయం పరిధిలో పలు గ్రామాల్లో పనిచేస్తున్న ఎనిమిదిమంది కార్యదర్శులకు, మరో ముగ్గురు పంచాయతీ గుమస్తాలు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో గురువారం జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి కార్యదర్శులు అందరు హాజరు కాని పరిస్థితి. ఉపాధిహామీ పథకం సోషల్‌ అడిట్‌ సమావేశంలో కరోనా బారిన పడిన ఒకరిద్దరు పాల్గొనడం, మిగిలిన వారు జాగ్రత్తలు పాటించకపోవడంతో ఇలా జరిగిందని చెబుతున్నారు. ఇక కారేపల్లి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ శాఖ కార్యాలయంలో నలుగురు సిబ్బందికి గురువారం కరోనా నిర్ధారణైంది. దీంతో బ్యాంకును మూసివేయగా.. లావాదేవీలు నిలిచి వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.

కరోనా నుంచి కోలుకున్న సీఎల్పీనేత భట్టి

నెగెటివ్‌ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌

మధిర, జనవరి 20: ఇటీవల కరోనా బారిన పడిన సీఎల్పీనేత, ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కోలుకున్నారు. పాజిటివ్‌ రావడంతో ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఐదురోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు గురువారం మరోసారి పరీక్ష చేయగా నెగిటివ్‌ రావడంతో ఆసుపత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే కొంత నీరసంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : భట్టి

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నియంత్రణకు అవసరమైన చర్యలను తీసుకోవాలని సీఎల్పీనేత భట్టి కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. 

నిలకడా ఎమ్మేల్యే వనమా ఆరోగ్యం 

కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి20: ఇటీవల కరోనా బారిన పడిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈనెల 17వ తేదీన వనమా దంపతులకు పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషఽయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స అందిస్తున్నామని అక్కడి వైద్యులు తెలిపారు. 

ఇరుజిల్లాల్లో 964మందికి కొవిడ్‌

ఖమ్మం జిల్లాలో 751, భద్రాద్రిలో 213కేసులు 

ఖమ్మం కలెక్టరేట్‌/ కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 20 : ఉమ్మడిజిల్లాలో గురువారం 964మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 6,986 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 751మందికి, భద్రాద్రి 5859మందికి పరీక్షలు చేయగా 213మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. ఇక 320పడకలున్న ఖమ్మం జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డులో గురువారం  ఆరుగురు చేరగా.. ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 24మంది చికిత్స పొందుతుండగా 296 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో గురువారం 2932 మంది టీనేజర్లకు, సాధారణ విభాగంలో రెండో డోస్‌ కింద 10,273 మందికి టీకాలు వేశారు. 



Updated Date - 2022-01-21T05:49:16+05:30 IST