జిల్లాల గజిబిజి!

ABN , First Publish Date - 2022-01-27T07:37:53+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు పలు చోట్ల గందరగోళంగా తయారయ్యాయి. భౌగోళికంగానూ ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. సంబంధంలేని ప్రాంతానికి మన్నెం జిల్లా పేరుపెట్టడం నుంచి విజయవాడలో కలిసిఉన్న ప్రాంతాలను మచిలీపట్నంలో కలపడం వరకు..

జిల్లాల గజిబిజి!

  • ఇటువి అటు.. అటువి ఇటు
  • మన్యం వేరు.. వీరుడు వేరా!?..
  • వేర్వేరు జిల్లాలకు ఆ పేర్లు
  • విశాఖపట్నం జిల్లా ఇక నగరానికే పరిమితం
  • అనకాపల్లి జిల్లాలో పెందుర్తిని కలపడంపై వ్యతిరేకత
  • కోనసీమ జిల్లాలో సంబంధంలేని నియోజకవర్గాలు, ఊళ్లా?
  • వాటిని కాకినాడ జిల్లాలో చేర్చాలని డిమాండ్లు
  • ద్వారకా తిరుమల.. ఏలూరుకు దగ్గర.. తీసుకెళ్లి రాజమండ్రిలోకి
  • కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల విభజన అస్తవ్యస్తం
  • నెల్లూరులోనూ గందరగోళం..
  • కడపలోనూ పంచాయితీలు
  • ‘కడప’ జిల్లా పేరు పూర్తిగా రద్దు..
  • కందుకూరు డివిజన్‌ మాయం
  • అభ్యంతరాలకు నెల గడువు..
  • కలెక్టర్లకు తెలపాలన్న ప్రభుత్వం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు పలు చోట్ల గందరగోళంగా తయారయ్యాయి. భౌగోళికంగానూ ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. సంబంధంలేని ప్రాంతానికి మన్నెం జిల్లా పేరుపెట్టడం నుంచి విజయవాడలో కలిసిఉన్న ప్రాంతాలను మచిలీపట్నంలో కలపడం వరకు.. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టినా.. జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రతిపాదించడం వంటి చిత్రాలు చోటుచేసుకున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను అటూ ఇటూ మార్చేశారన్న విమర్శలు వస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడిగా ప్రసిద్ధుడు. విశాఖ జిల్లాలో మంపను కేంద్రంగా చేసుకుని ఆయన ఆంగ్లేయులపై పోరాటం చేశారు. ఇక్కడే గొలుగొండ మండలంలోని కృష్ణాదేవిపేటలో ఆయన సమాధి ఉంది.


అందుకే విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటుచేసి, దానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వం ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకటనలో అరకు పార్లమెంటు నియోజకవర్గంలోని పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరాన్ని కలిపి పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించి దానికి అల్లూరి పేరు పెట్టనున్నట్టు తెలిపింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గాలను కలిపి ‘మన్యం’ జిల్లా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.


దీనికి పార్వతీపురం జిల్లా కేంద్రంగా నిర్ణయించింది. అయితే విశాఖ ఏజెన్సీనే ‘మన్యం’గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా మైదాన ప్రాంతాలైన పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాంలను కలిపి ‘మన్యం’గా పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వేరే పేరు ఏదైనా పెట్టాలని సూచిస్తున్నారు. మన్యం-వీరుడు అంటూ రెండు వేర్వేరుగా విడదీయడం ఏమాత్రం బాగా లేదని చెబుతున్నారు. ఇక విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం మన్యం జిల్లాలోకి వెళ్లనుంది. దీంతో ఆ మండలవాసులకు దూరాభారం కానుంది. సాలూరు నియోజకవర్గ పరిధిలోని మెంటాడ మండలం విజయనగరం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే పార్వతీపురం వెళ్లాలంటే 75 కిలోమీటర్లు ప్రయాణించాలి. విజయనగరానికి సమీపంలోని గజపతినగరం మండలాన్ని బొబ్బిలి డివిజన్‌లో కలిపారు. దీంతో వీరు కూడా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది.  శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు కానున్న పార్వతీపురం జిల్లాలో కలవనుంది. పాలకొండ నియోజకవర్గ పరిధిలోని భామిని మండల ప్రజలు పార్వతీపురం రావాలంటే దూరాభారం.


చారిత్రక ప్రాభవం కోల్పోనున్న విశాఖ

బ్రిటి్‌షవారి పాలనలో దేశంలో ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లా విశాఖపట్నం. తూర్పుతీరంలో విశాఖ కేంద్రంగా జిల్లా ఉత్తరాన బరంపురం వరకు ఉండేది. చారిత్రక వివరాల ప్రకారం...1803లో విశాఖ జిల్లా ఆవిర్భవించింది. అటువంటి జిల్లా ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటైతే కేవలం నగరానికే పరిమితం కానుంది.  బ్రిటిష్‌ పాలకులు విశాఖ పరిధిలోని మల్కనగిరి, నవరంగపూర్‌, కోరాపుట్‌, జయపూర్‌, రాయగడ, గంజాం తాలూకాలను 1936లో ఏర్పడిన ఒడిసా రాష్ట్ర పరిధిలో విలీనం చేశారు. అలాగే స్వాతంత్య్రం వచ్చాక 1950లో తీరానికి ఆనుకుని ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకూ, ఉత్తరాన పాతపట్నం నుంచి పార్వతీపురం, సాలూరు వరకు ప్రాంతాన్ని విశాఖ జిల్లా నుంచి విడదీసి శ్రీకాకుళం జిల్లా ఏర్పాటుచేశారు. ఆ తరువాత 1979లో విజయనగరం జిల్లా ఏర్పాటు సమయంలో విజయనగరం, భోగాపురం, ఎస్‌.కోట, గజపతినగరం, కొత్తవలస ప్రాంతాలు విశాఖ జిల్లా నుంచి వేరుచేశాయి. దీంతో నగరం, మైదానం, మన్యంతో కలిసిన ప్రాంతమే విశాఖ జిల్లాగా మిగిలింది. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటైతే విశాఖ జిల్లా ప్రాభవం మరింత తగ్గిపోనుంది. దట్టమైన అటవీ ప్రాంతం, అంతర్జాతీయంగా పేరొందిన బొర్రాగుహలు, అరకులోయ, సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం వంటివి పాడేరు కేంద్రంగా ఏర్పడనున్న అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి. అలాగే వ్యవసాయం, మూడు సెజ్‌లు, ఫార్మాసిటీ, బెల్లం మార్కెట్‌, అనేక పరిశ్రమలు కలిగిన మైదాన ప్రాంతం కొత్తగా ఏర్పడనున్న అనకాపల్లి జిల్లాలోకి వెళ్లనున్నది.


కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆదాయపరంగా విశాఖ నష్టపోనున్నది. విశాఖకు వచ్చే ఆదాయంలో పారిశ్రామిక ప్రాంతాలు, సెజ్‌లు, ఫార్మాసిటీ నుంచి లభించేదే సింహభాగం. ఆ ప్రాంతం అనకాపల్లి జిల్లాలో విలీనం కానుంది. చివరగా విశాఖ నగరంతోపాటు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే విశాఖ జిల్లాలో ఉంటాయి. అంటే ఒకప్పుడు సువిశాలమైన జిల్లా... ఇకపై కేవలం నగరానికి మాత్రమే పరిమితం కానుంది. విశాఖ రూరల్‌ మండలం చాలావరకూ భీమిలి నియోజకవర్గాన్ని ఆనుకుని ఉంది. మహారాణిపేట మాత్రం పూర్తిగా విశాఖ నగరంలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా పరిషత్‌ కార్యాలయం కూడా ఈ మండలంలోనే ఉన్నాయి. అటువంటి మండలాన్ని భీమిలి రెవెన్యూ డివిజన్‌లో కలపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే పెందుర్తి నియోజకవర్గంలో చాలా భాగం విశాఖ నగరంలో అంతర్భాగంగా ఉంది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలోని పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండలాలను విశాఖ నుంచి విడదీసి.. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో కలపనున్నట్టు పేర్కొంది. పరవాడ, సబ్బవరం మండలాల విలీనంపై అభ్యంతరాలు లేకపోయినా, పెందుర్తిని మాత్రం విశాఖ నగరంలోనే కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 


తూ.గో.లో సౌలభ్యం ఏదీ?

కొత్త జిల్లాల ప్రతిపాదనలపై తూర్పుగోదావరి జిల్లాలో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేయదలపెట్టిన కోనసీమ జిల్లాలో.. కోనసీమేతర నియోజకవర్గాలైన రామచంద్రపురం, మండపేటలను కూడా చేర్చారు. దీనిపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి కోనసీమ జిల్లా కంటే కాకినాడ జిల్లా దగ్గరగా ఉంటుంది. కాజులూరు మండలం కాకినాడకు 22 కిలోమీటర్లు. అదే కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి యాభై కిలోమీటర్లు. మండపేట నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్‌ స్థానంలో ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను కోనసీమ జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై టీడీపీ తరపున మండపేట ఎమ్మెల్యే వేగుళ్లతో సహా ఇతర పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తమ నియోజకవర్గంలో మండలాలన్నింటికి రాజమహేంద్రవరం చాలా దగ్గరని, ప్రజలకు కూడా ఇదే సౌలభ్యం అని వాదిస్తున్నారు. కాకినాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గంలోకి వస్తుంది.


ఇది అమలాపురం పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఉన్నందున కోనసీమ జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇది తమకు సమ్మతం కాదని, కాకినాడకు దగ్గరగా ఉన్న తమ ప్రాంతాన్ని అదే జిల్లాలో కలపాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అనపర్తి నియోజకవర్గం పరిధిలోని పెదపూడి మండలం కాకినాడకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అనపర్తి నియోజకవర్గం రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఉన్నందున రాజమహేంద్రవరం జిల్లాలో ప్రభుత్వం కలిపింది. దీనిని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్‌ వస్తోంది. జిల్లాలోని రంచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మొత్తం మండలాలను విశాఖ జిల్లా పరిఽధిలోని పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల 250 కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న పాడేరు వెళ్లడం అసాధ్యమని ఆదివాసీ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. బదులుగా రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ప్రకటించాలని కోరుతున్నాయి.


గుంటూరు.. చిందరవందర

గుంటూరు జిల్లాను గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలుగా విభజించాలని ప్రతిపాదించారు. ప్రధానంగా పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేటను ప్రతిపాదించడంపై అభ్యంతరాలు ఉన్నాయి. వాస్తవానికి పల్నాడు అంటే గురజాల, మాచర్ల అని... ఆ రెండు చోట్ల ఎక్కడైనా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టీడీపీ, వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. నరసరావుపేటను కేంద్రంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లా పరిధిలోకి తీసుకెళ్లడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ నియోజకర్గంలోని అమరావతి మండలానికి చెందిన ప్రజలు ఆర్డీవో కార్యాలయానికి లేదా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసలకు గురికావాల్సి ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు గురజాల ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాలంటే సుమారు 125 కిలోమీటర్లు మూడున్నర గంటలు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా కూడా అంతే. ప్రస్తుతం గుంటూరులోని ఆయా కార్యాలయాలు 35 కిలోమీటర్ల దూరంలో ఉండగా 50 నిమిషాల్లో వచ్చేస్తున్నారు. బాపట్ల జిల్లా విషయానికి వస్తే బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా అందులో 4 ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడుని తొలుత బాపట్లలో చేర్చాలని నిర్ణయించారు. తర్వాత ఒంగోలుకు మార్చారు.


పశ్చిమలో అంతా గందరగోళం

పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రకటించడంపై వివాదం ఆరంభమైంది. ఇదంతా రాజకీయ కుట్రేనని.. నరసాపురాన్నే జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల.. ఇప్పుడు ప్రతిపాదిత రాజమహేంద్రవరం జిల్లాలో చేరింది. వాస్తవానికి ద్వారకా తిరుమల ఏలూరుకు 40 కిలోమీటర్ల సమీపాన ఉండగా, రాజమహేంద్రవరానికి 75 కిలోమీటర్ల దూరాన ఉంది. ఏలూరు జిల్లాలో చేరనున్న కృష్ణా జిల్లా ఆగిరిపల్లి.. విజయవాడకు చేరువలో ఉంటుంది. కానీ నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేయడం వల్ల దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణ భారం పెరగుతుంది.


కృష్ణాలో గందరగోళం

కృష్ణా జిల్లా నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇకపై జిల్లావాసులతో అనుబంఽధం తెగిపోనుంది. ఈ రెండూ ఏలూరు జిల్లాకు వెళ్తాయని ముసాయిదాలో పేర్కొన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రస్తుతం మచిలీపట్నం, పెడన, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, పెనమలూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కొత్తగా మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే కృష్ణా జిల్లాలో భాగం కానున్నాయి. అయితే గన్నవరం, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు విజయవాడతోనే అనుబంధం ఎక్కువ. భౌగోళికంగా ఇవి దాదాపు విజయవాడలో కలిసే ఉన్నామి. పాలనా అవసరాలకు వీరంతా ఇప్పుడు మచిలీపట్నం వెళ్లాలన్న మాట. మరో విచిత్రం ఏమిటంటే.. విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేశారు. వాస్తవానికి ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉంది. ఇది మచిలీపట్నం జిల్లా కేంద్రంగా ఏర్పడే కృష్ణా జిల్లాలో ఉంది. ఎన్టీఆర్‌ పేరు మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెడితే సముచితంగా ఉంటుంది కానీ విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు పెట్టడంలో ఔచిత్యం లేదని అంటున్నారు.


‘అనంత’ జిల్లాలోకి రాప్తాడు..

అనంతపురం జిల్లాలో అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. ఒక్కో పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తాజాగా ప్రభుత్వం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందులో అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అనంతపురం జిల్లాగా యథాతథంగా కొనసాగించనున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని సత్యసాయి జిల్లాగా మార్చారు. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న రాప్తాడు స్థానాన్ని అనంతపురం జిల్లాలో చేర్చారు. దీంతో అనంత జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, సత్యసాయి జిల్లాలో 6 ఉంటాయి. రాప్తాడును అనంతపురం జిల్లాలో చేర్చడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు మేధావివర్గాలతో పాటు.. విశ్లేషకులు భావిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి మంచి పట్టు ఉంది. సత్యసాయి పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పరిటాల కుటుంబానికి వర్గాలున్నాయి. ఈ నేపథ్యంలో వారి బలం తగ్గించే ఉద్దేశంతోనే స్థానిక అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు రాప్తాడును అనంతపురం జిల్లాలో చేర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ప్రకాశం విభజనలో హేతుబద్ధత లేదు!!

జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వ తాజా ప్రతిపాదనలు ప్రకాశం జిల్లా విషయంలో హేతుబద్ధంగా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భౌగోళిక అంశాలను దృష్టిలోకి తీసుకోకుండా పార్లమెంట్‌ యూనిట్‌గా జిల్లా ఏర్పాటు వల్ల పశ్చిమ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండనుంది. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 100 నుంచి 150 కి.మీ దూరంలో మార్కాపురం డివిజన్‌లోని 12 మండలాలతోపాటు కనిగిరి నియోజకవర్గంలోని పలు మండలాలు ఉన్నాయి. అవన్నీ ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయఇ ఒంగోలు జిల్లాలోనే ఉంచారు. గతం నుంచే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కోసం ప్రజలు పోరాడుతుండగా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఒంగోలుకు 45 కి.మీ లోపు ఉండే కందుకూరును దాదాపు 115 కి.మీ దూరంలోని నెల్లూరు జిల్లాలో కలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద డివిజన్లలో రెండోదైన కందుకూరు డివిజన్‌ తాజా ప్రతిపాదనలతో పూర్తిగా రద్దవుతుంది. కందుకూరు నియోజకవర్గం కావలి డివిజన్‌లో  కలవనుంది. సంతనూతలపాడు నియోజకవర్గం బాపట్ల జిల్లాలోకి వెళ్లాలి. అయితే ఒంగోలులో అంతర్భాగంగా ఈ సెగ్మెంట్‌ ఉండడంతో ఒంగోలు జిల్లాలో కలిపారు.


నెల్లూరులో తికమక

ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల ఏర్పాటు నెల్లూరు జిల్లా ప్రజలను గందరగోళంలోకి నెట్టింది. తిరుపతి పార్లమెంటు పరిధిలో సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల విభజన ప్రకారం నెల్లూరు పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాలతోపాటు తిరుపతి పార్లమెంటులోని సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కలిపారు. గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటలను తిరుపతిలో కలపాలని ప్రతిపాదించారు. గూడూరు పట్టణం నెల్లూరుకు 30 కి.మీ.దూరంలో ఉంది. ఇప్పుడు తిరుపతి జిల్లాలో చేర్చడంతో దూరం 100 కిలోమీటర్లకు పెరిగింది. నెల్లూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న రాపూరు మండలం, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కలువాయి మండలాలు తిరుపతి జిల్లాలో కలవనున్నాయి. మనుబోలు మండలం సర్వేపల్లి నియోజకవర్గమైనప్పటికీ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూరుతో ఎక్కువ అనుబంధం ఉంది. 


చిత్తూరు.. డివిజన్లు తారుమారు

చిత్తూరు జిల్లాను కొత్త జిల్లాల పేరిట మూడు ముక్కలు చేసే క్రమంలో రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇబ్బందులు తలెత్తాయి. చిత్తూరు లోక్‌సభ పరిధిలో చిత్తూరు, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, చంద్రగిరి సెగ్మెంట్లు ఉండగా.. చంద్రగిరిని తిరుపతి జిల్లా పరిధిలో చేర్చారు. రాజంపేట లోక్‌సభ పరిధిలో రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు సెగ్మెంట్లు వుండగా పుంగనూరును చిత్తూరు జిల్లాలోనే ఉంచారు. మున్సిపల్‌ పట్టణంగా యాభై ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకాళహస్తిని ఎంతో చిన్నదైన నాయుడుపేట డివిజన్‌లో చేర్చడం గమనార్హం. పీలేరు సెగ్మెంట్‌లో రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే విధంగా కలికిరి, వాల్మీకిపురం మండలాలను మదనపల్లె డివిజన్‌లో, పీలేరు, కలకడ, కేవీపల్లె, గుర్రంకొండ మండలాలను రాయచోటి డివిజన్‌లో చేర్చడం విమర్శలకు దారి తీస్తోంది. నిజానికి రాజంపేట (అన్నమయ్య) జిల్లాకు మదనపల్లెను కేంద్రంగా ప్రకటించాలని ప్రజాసంఘాలు ఉద్యమం నడుపుతున్నాయి. ఇప్పుడు అన్నమయ్య జిల్లా పేరుపెట్టి కడప జిల్లా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం మదనపల్లె వాసులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అటు రాజంపేట నియోజకవర్గ ప్రజలు కూడా మండిపడుతున్నారు. అన్నమయ్య జన్మించిన గడ్డను కాదని.. ఎక్కడో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఏమిటని ఆక్షేపిస్తున్నారు.

Updated Date - 2022-01-27T07:37:53+05:30 IST