మళ్లీ కలవరం

ABN , First Publish Date - 2022-01-25T04:48:13+05:30 IST

అన్నదాతలో మళ్లీ కలవరం మొదలైంది. కొద్దిరోజులు విరామంతో జిల్లాలో మరోసారి చిరుజల్లులు పడుతున్నాయి. అనేక మండలాల్లో సోమవారం వాన పడింది. ఈ విధంగా ఈ ఏడాది ప్రకృతి పగబట్టినట్లయింది. పది రోజుల కిందట కురిసిన అకాల వర్షాలకు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు.

మళ్లీ కలవరం
తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు (ఫైల్‌)


జిల్లాలో చిరు జల్లులు
రైతులకు వరుసగా కష్టాలు
కలెక్టరేట్‌, జనవరి 24:
అన్నదాతలో మళ్లీ కలవరం మొదలైంది. కొద్దిరోజులు విరామంతో జిల్లాలో మరోసారి చిరుజల్లులు పడుతున్నాయి. అనేక మండలాల్లో సోమవారం వాన పడింది. ఈ విధంగా ఈ ఏడాది ప్రకృతి పగబట్టినట్లయింది. పది రోజుల కిందట కురిసిన అకాల వర్షాలకు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. సంక్రాంతిని సరదాగా జరుపుకోలేకపోయారు. దెబ్బతిన్న పంటను ఇంటికి ఇంకా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న రైతన్నలకు  ఇప్పుడు కురుస్తున్న అకాల వర్షంతో మళ్లీ భయం పట్టుకుంది. సోమవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా చిరుజల్లులు కురవడంతో వారంతా కలవర పడుతున్నారు. తమ పంట పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. ఈనెలలో పది రోజుల వ్యవధిలో రెండుసార్లు అకాల వర్షాలు కురిశాయి. గులాబ్‌, జవాద్‌ తుఫాన్లు.. ఇప్పుడు అకాల వర్షాలు అన్నదాతను పట్టి పీడిస్తున్నాయి. మొదటి నుంచి చివరి వరకూ న(క)ష్టాలు  వెంటాడుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు చివరిలో గులాబ్‌ తుఫాన్‌ కారణంగా జిల్లాలో 1,575 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వచ్చింది. ఆ తర్వాత నవంబరులో జవాద్‌ కారణంగా కురిసిన అధిక వర్షాలకు 695 హెక్టార్లలో వరి పంట దెబ్బతినడంతో 2,371 మంది రైతులు నష్టపోయారు. పది రోజుల కిందట ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల జిల్లాలో అకాల  వర్షాలు కురిశాయి. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకూ వర్షాలు పడ్డాయి. వాటి ప్రభావంతో పొలంలో చిన్న చిన్న కుప్పలతో  ఉన్న వరి చేను తడిసి ముద్దయ్యింది. పొలాల్లో అధికంగా నీరు ఉండటంతో ధాన్యం మొలకలు కూడా వచ్చాయి. దీంతో జిల్లాలో 5,200 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ధాన్యం రంగు మారుతున్నాయి. వాటిని రైతులు కళ్లాల వద్ద ఎండబెట్టుకున్నారు. ఇంకా జిల్లాలో చాలా పొలాల్లో ధాన్యం కళ్లాలకు తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. వాటిని తీసుకు రావాలంటే పొలాల్లోకి నాటుబళ్లు, ట్రాక్టర్లు వెళ్లాలి. తడి ఆరకపోవడంతో పొలాల్లోకి వెళ్లడానికి వీలుకావడం లేదు.


Updated Date - 2022-01-25T04:48:13+05:30 IST