ఊరట!

ABN , First Publish Date - 2021-04-17T05:43:40+05:30 IST

జిల్లాలో వరి తరువాత ప్రధాన పంట మొక్కజొన్న. వాణిజ్య పంటగా సాగుకు రైతులు ప్రాధాన్యమిస్తున్నారు. రబీతో పాటు ఖరీఫ్‌లో సైతం పండిస్తున్నారు. పెద్దఎత్తున ఉత్పత్తి వస్తున్నా క్షేత్రస్థాయి పంటను విక్రయించేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. వీరి మొరను ఆలకిం

ఊరట!
గజపతినగరంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం





జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం

రైతుల కష్టాలకు చెక్‌

నేరుగా ఆర్‌బీకేల ద్వారానే విక్రయానికి అవకాశం

అన్నదాతల్లో ఆనందం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వరి తరువాత ప్రధాన పంట మొక్కజొన్న. వాణిజ్య పంటగా సాగుకు రైతులు ప్రాధాన్యమిస్తున్నారు. రబీతో పాటు ఖరీఫ్‌లో సైతం పండిస్తున్నారు. పెద్దఎత్తున ఉత్పత్తి వస్తున్నా క్షేత్రస్థాయి పంటను విక్రయించేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. వీరి మొరను ఆలకించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రైతుభరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. రైతులు సమీప రైతుభరోసా కేంద్రాలకు తీసుకెళ్తే మార్క్‌ఫెడ్‌ అధికారులు, సిబ్బంది కొనుగోలు చేస్తారు. 


జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో రైతులు మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ముఖ్యంగా సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రపురం, బొబ్బిలి, కొమరాడ, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ, గంట్యాడ, ఎస్‌.కోట, దత్తిరాజేరు, మెంటాడ తదితర మండలాల్లో అధికంగా మొక్కజొన్న పండిస్తున్నారు.అన్నిమండలాల పరిధిలోని 361 రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు.  ఇందులో 71 కేంద్రాలు ప్రధాన కొనుగోలు కేంద్రాలు. ఇక్కడ కొనుగోలు చేసిన పంటను నిల్వలు ఉంచనున్నారు. గురువారం జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధర రూ.1850గా నిర్ణయించించింది. గతంలో కొనుగోలు కేంద్రాల మద్దతు ధర కంటే ప్రైవేట్‌ వర్తకులు ఎక్కువ రేటుకు కొనుగోలు చేశారు. గత ఏడాది నుంచి ప్రభుత్వ మద్దతు ధర ఆశాజనకంగా ఉంది.  ఇది ఉపశమనం కలిగించే విషయం. కానీ గత అనుభవాల దృష్ట్యా ముందు వచ్చిన వారికే మేలు జరగనుంది, ఎందుకంటే పంట మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలుచేసే అవకాశం లేదు. మొత్తం దిగుబడిలో 30 శాతం వరకే కొనుగోలు చేయనున్నారు. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. వరితో పోల్చుకుంటే మొక్కజొన్న పంట దిగుబడి బాగుందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 40 క్వింటాళ్లు పైబడి దిగుబడి వస్తోంది.  వాస్తవంగా చెప్పాలంటే ఖరీఫ్‌లో వరి పంట కంటే రబీలో పండుతున్న మొక్కజొన్న పంట రైతుకు మంచి అదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఖరీఫ్‌లో వరినే తీసుకుంటే ఎకరానికి 25 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి సాధించగలుగుతున్నారు. కానీ మొక్కజొన్న 40క్వింటాళ్లు పైబడి పండిస్తున్నారు.  ధాన్యం కంటే ఎక్కువగా మొక్కజొన్నకే మద్దతు ధర ఉంది. ఈ లెక్కన రైతులు మొక్కజొన్న సాగుకే మొగ్గుచూపుతున్నారు. 


లక్ష్యం పెరిగే అవకాశం

 ఈ ఏడాది రబీలో మొక్కజొన్న కొనుగోలు లక్ష్యం 38,400 మెట్రిక్‌ టన్నులుగా తీసుకున్నారు. కానీ 50వేల మెట్రిక్‌ టన్నులు దాటి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.  ముందుగా కొంత మొత్తాన్ని కొనుగోలు చేసిన తరువాత లక్ష్యం పెంచే అవకాశముందని  వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది రబీలో కూడా మొదట 20వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు లక్ష్యంగా తీసుకున్నారు. తరువాత రైతుల వద్ద ఉన్న నిల్వలు ఆధారంగా లక్ష్యాలను పెంచారు. సుమారు 60 వేల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేశారు. దీంతో దాదాపు రైతుల వద్ద ఉన్న పంట మొత్తాన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా లక్ష్యం పెంచి రైతుల వద్ద ఉన్న పంట మొత్తాన్ని కొనుగోలు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. 


సద్వినియోగం చేసుకోవాలి

జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలి. దీని ఆధారంగా కొనుగోలు చేస్తాం. దీనివల్ల ప్రైవేటు దళారులు ప్రవేశించే అవకాశముండదు. నేరుగా సంబంధిత రైతుల ఖాతాల్లో నిధులు జమచేస్తాం. రైతుల వద్ద నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేస్తాం. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

  షేక్‌ యాసిఫ్‌, జిల్లా మేనేజర్‌, మార్క్‌ఫెడ్‌, విజయనగరం.



Updated Date - 2021-04-17T05:43:40+05:30 IST