కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు
ప్రజాసంఘాలు, అఖిలపక్ష డిమాండ్లు వినకుండా నోటిఫికేషన్ జారీపై నిరసనలు
పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాల ఏర్పాటుపై పలు నియోజకవర్గాల్లో రేగుతున్న మంటలు
పెదపూడిని రాజమహేంద్రవరం నుంచి తప్పించి కాకినాడలో కలపాలని డిమాండ్
(కాకినాడ-ఆంధ్రజ్యోతి) పార్లమెంట్ స్థానం ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయడంపై జిల్లాలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. తమ అభ్యంతరాలు, ఇబ్బందులు పట్టించుకోకుండా ఏకపక్షంగా జిల్లాల ప్రకటన చేయడంపై ప్రజా సంఘాలు గొంతెత్తుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను తప్పుబడుతూ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. దగ్గరగా ఉన్న జిల్లాలో కలపకుండా ఎక్కడో దూరంగా ఉన్న పార్లమెంట్ స్థానంలో కలిపే ప్రయత్నాలపై పలు నియోజకవర్గాల నుంచి తీవ్ర స్థాయి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మండపేట,రామచంద్రపురం నియోజకవర్గాలను కోనసీమ జిల్లాలో వద్దని రాజమహేంద్రవరం లేదంటే కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజా సంఘాలు, పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కాకినాడకు అతి సమీపంలో ఉన్న పెదపూడిని రాజమహేంద్రవరం, తాళ్లరేవును కోనసీమ జిల్లాల్లో కలిపితే ఊరుకునేది లేదని పార్టీలు, ప్రజాపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఎటపాక, రంపచోడవరం డివిజన్లను 250 కిలోమీటర్ల దూరంలోని పాడేరు జిల్లాలో కలిపి తమను కష్టాలు పాలు చేయవద్దని, రంప కేంద్రంగా కొత్త జిల్లా ఇవ్వాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఆగమేఘాలపై అడ్డదిడ్డంగా ప్రకటించిన కొత్త జిల్లాల నోటిఫికేషన్‌పై ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. ముఖ్యంగా అమ లాపురం పార్లమెంట్ స్థానం విషయంలో కోనసీమేతర నియోజకవర్గాలు, మండలాల నుంచి ఎక్కువగా ఆందోళనలు పెరుగుతున్నాయి. తమ కష్టాలు, ఇబ్బందులను కనీసం పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై అఖిలపక్ష పార్టీలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. మంగళవారం అర్థరాత్రి రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌లో అమ లాపురం పార్లమెంట్ కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో కోనసీమేతర నియోజకవర్గాలైన రామచంద్రపురం, మండపేటలను కూడా చేర్చారు. ఈ నిర్ణయంపై రెండు నియోజకవర్గాల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కాజులూరు, రామచంద్రపురం, గంగవరం ఈ మూడు మండలాలు తాము కోనసీమ జిల్లాలో కలవబోమని, తమను కాకినాడ జిల్లాలో కలపాలంటూ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఇదే విషయమై అధికారులకు వినతిపత్రాలు అందించగా, ఇప్పుడు మరోసారి సిద్ధమవుతున్నాయి. తాము కోనసీమ జిల్లాకు వెళ్లాలంటే గోదావరి దాటాలని, ఇందుకు వంతెన కూడా లేదని చెబుతున్నాయి. పంటు ఒక్కటే ఆధారమని.. ఇది ప్రమాదకరమని వాదిస్తున్నాయి. తమకు కోనసీమ కంటే కాకినాడ జిల్లా దగ్గరగా ఉంటుందని, కేవలం 33 కిలోమీటర్లు మాత్రమేనని ప్రజాసంఘాలు వాదిస్తున్నాయి. కాజులూరు మండలం నుంచి కూడా ఇవే అభ్యంతరాలు వస్తున్నాయి. కాకినాడ తమకు 22 కిలోమీటర్లు వస్తుందని, అదే అమలాపురం యాభై కిలోమీటర్లు దూరం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో తమను కలపవద్దని అన్ని రాజకీయపార్టీలు ఉమ్మడిగా పోరాడేందుకు వీలుగా జేఏసీగా ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అటు మండపేట నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్‌స్థానంలో ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను కోనసీమ జిల్లాలో కలుపు తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై టీడీపీ తరఫున మండపేట ఎమ్మెల్యే వేగుళ్లతోసహా ఇతర పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో మండలాలన్నింటికి రాజమహేంద్రవరం చాలా దగ్గరని,ప్రజలకు కూడా ఇదే సౌలభ్యం అని వాదిస్తున్నారు. కోనసీమ జిల్లాకు వెళ్లాలంటే దూరమని మండిపడుతున్నారు. గోదావరి దాటి కోనసీమ కేంద్రం అమలాపురం వెళ్లడం అసాధ్యమని మండిపడుతున్నారు. అటు తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గంలోకి వస్తుంది. ఇది అమలాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్నందున కోనసీమ జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయం తమకు సమ్మతం కాదని, కాకినాడకు దగ్గరగా ఉన్న తమ ప్రాంతాన్ని అదే జిల్లాలో కలపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడైతే అన్ని రాజకీయపార్టీలు జేఏసీగా ఏర్పడి ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. అటు అనపర్తి నియోజకవర్గం పరిధిలోని పెదపూడి మండలం కాకినాడకు దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అనపర్తి నియోజకవర్గం రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్నందున రాజమహేంద్రవరం జిల్లాలో ప్రభుత్వం కలిపింది. పెదపూడి నుంచి రాజమహేంద్రవరం 47 కిలోమీటర్లకుపైగా దూరం వస్తోంది. ఇప్పుడీ నిర్ణయంపై అక్కడ పార్టీల నేతలు, ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పెదపూడిని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజా సంఘాలతో కలిసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితర నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అటు జిల్లాలోని రంపచోడవరం, ఏటపాక రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మొత్తం మండలాలను విశాఖ జిల్లా పరిఽధిలోని పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. దీనివల్ల 250కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న పాడేరు వెళ్లడం అసాధ్యమని ఆదివాసీ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నా యి. బదులుగా రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ప్రకటించాలని కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం వెల్లువెత్తుతున్న ప్రజాసంఘాలు, అఖిలపక్ష పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటుందా..మొండి గా ముందుకు వెళ్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. అయితే 30 రోజుల వ్యవధిలో తుది నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పోరాటం చేయడానికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి.