తెలంగాణ విమోచనంలో జిల్లా యోధులు

ABN , First Publish Date - 2021-09-17T04:51:09+05:30 IST

నిజాం పాలన విముక్తి పోరాటంలో ఆసిఫాబాద్‌ ప్రాంత సమరయోధుల పోరాటం మరువలేనిది. ఆసిఫాబాద్‌ ప్రాంతానికి చెందిన పలువురు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ మిటలరీక్యాంపులో చేరి సాయుధ శిక్షణను పొందారు. పంజాబ్‌ రెజిమెంట్‌ మేజర్‌ పీఎస్‌ గహున్‌ శిక్షణను అందించారు.

తెలంగాణ విమోచనంలో జిల్లా యోధులు
మిటలరీ శిక్షణ క్యాంపులో చేరి సాయుధ శిక్షణను పొందుతున్న ఆసిఫాబాద్‌ యువకులు(ఫైల్‌)

నిజాంకు వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం

మిలటరీ శిక్షణ పొందిన జిల్లా వాసులు

తిరగబడిన కొమురం భీం

తనదైన ముద్ర వేసిన కొండాలక్ష్మణ్‌బాపూజీ

నేడు తెలంగాణ విమోచన దినోత్సవం

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 16: నిజాం పాలన విముక్తి పోరాటంలో ఆసిఫాబాద్‌ ప్రాంత సమరయోధుల పోరాటం మరువలేనిది. ఆసిఫాబాద్‌ ప్రాంతానికి చెందిన పలువురు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ మిటలరీక్యాంపులో చేరి సాయుధ శిక్షణను పొందారు. పంజాబ్‌ రెజిమెంట్‌ మేజర్‌ పీఎస్‌ గహున్‌ శిక్షణను అందించారు. అక్కడ క్యాంపు ఇన్‌చార్జి గోపాల్‌ శాస్త్రి బేకర్‌, బల్లార్షా క్యాంపు ఇన్‌చార్జిగా కేవీ కేశవులు వ్యవహరించగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఈ క్యాంపులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆసిఫాబాద్‌కు చెందిన చీల శంకర్‌, చీల విఠల్‌, కాండ్రె శంకర్‌, చందన్‌వార్‌ విఠల్‌, జగన్నాథ్‌, రేవయ్య, రాంసింగ్‌, నాగేంద్రయ్య, తిరుపతి, వెంకటేశం సాయుధ శిక్షణశిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొంది సాయుధ పోరాటాన్ని నిర్వహించారు. 

రజాకార్లను మట్టుపెట్టి నిజాం గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన చరిత్ర ఘట్టాలు ఆసిఫాబాద్‌ ప్రాంతంలో కోకొళ్లలుగా ఉన్నాయి. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలతో సహనం కోల్పోయిన సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా సిపాయిలై తుపాకీ పట్టి సాయుధ పోరటం చేయడంతో నిజాం ప్రభుత్వం గడగడలాడింది. ఇండియన్‌ యూనియన్‌లో కలవడానికి నిజాం మెడలు వంచి ఒప్పించేందుకు అవసరమైతే ప్రాణాలు తీసేందుకు జరిగిన పోరాటంలో ఆసిఫాబాద్‌ ప్రాంత యోధులు అత్యంత కీలకపాత్ర పోషించారు. 1940 వరకు ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంగా కొనసాగింది. ఆసిఫాబాద్‌ ప్రాంతం నుంచి చీలశంకర్‌, చీల విఠల్‌, రాంసింగ్‌, కాండ్రె శంకర్‌, రేవయ్య, నాగేంద్రయ్య, బోనగిరి వెంకటేశం, చందావార్‌ విఠల్‌, కాటెపల్లి తిరుపతి, జగన్నాథ్‌ అజ్ఞాతంలోకి వెళ్లి మహారాష్ట్రలోని చాందలో నిర్వహించిన సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొందారు. వివిధ సంఘటనల్లో పాల్గొన్నారు. నిజాం లొంగుబాటుకు దరూర్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం చేసిన సంఘటనలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో కలిపేందుకు అప్పటి హోం మంత్రి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ ఆదేశాలతో 13.09.1948న పోలీసు యాక్షన్‌ ప్రకటితమైంది. మహారాష్ట్ర సైనికదళాలు చాందా, బల్లార్షా క్యాంపుల్లో సుశిక్షితులైన ఆసిఫాబాద్‌ యోధులు రజాకార్లను మట్టుబెట్టేందుకు ముందుకు సాగారు. ఈ పోరాటం హోరాహోరీగా జరిగింది. సెప్టెంబర్‌ 14న బల్లార్షా సాస్రి ప్రాంతంలో జరిగిన పోరాటంలో పది మందినిజాం వ్యతిరేక ఉద్యమకారులు మరణించారు. సెప్టెంబర్‌ 15న సైనిక దళాలు మాణిక్‌ఘడ్‌ పోలీసు అవుట్‌ పోస్టుపై దాడిచేశాయి. సెప్టెంబర్‌ 16న సిర్పూర్‌, బెజ్జూరు అవుట్‌ పోస్టులు భారత సైనిక పరమయ్యాయి. సెప్టెంబర్‌ 17న నిజాం సర్కార్‌ సైన్యానికి తలోగ్గి హైదరాబాద్‌ సంస్థాన్‌ భారత్‌లో విలీనం అయింది. సెప్టెంబర్‌ 18న ఆసిఫాబాద్‌ జిల్లా జైలులోని 200మంది ఖైదీలు గేట్లు విరగొట్టుకుని బయటకు వచ్చారు.

పోరాటస్ఫూర్తి నింపిన కుమరం భీం..

అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నాడు నిజాం నిలువు దోపిడీ వ్యవస్థ కొనసాగింది. రజాకార్ల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. అరకపట్టి, మంచెపట్టి, బంచరాయి లాంటి పన్నులతో గిరిజన రైతులను దోచుకున్నారు. అడవి బిడ్డలకు అడవిపై హక్కులు లేవన్నారు. ఈ నేపథ్యంలో సాయుధ పోరుకు దిగిన కుమరం భీం నిజాంపై విరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. జిల్లా గిరిజనుల్లో పోరాట స్ఫూర్తి నింపారు. గిరిజన హక్కుల కోసం తిరుగుబాటు నేర్పారు. భీం పోరాట స్ఫూర్తితోనే ఈ ప్రాంతంలో వందలాది యువకులు నిజాంపై తుపాకీ ఎక్కుపెట్టారు. జిల్లాలో గిరిజన హక్కుల పోరాటం, భారత స్వాతంత్య్ర పోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం చరిత్రలో ప్రముఖంగా నిలిచి పోయాయి. గొప్ప పోరాట నేపథ్యం ఉన్న జిల్లాలో కొండా లక్ష్మణ్‌ బాపూజీతోపాటు వందలాది మంది సమరయోధులు భావితరానికి స్ఫూర్తిగా నిలిచారు. 

ప్రముఖపాత్ర వహించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ..

నిజాం నిరంకుశత్వం నుంచి హైదరాబాద్‌ విలీన పోరులో కొండాలక్ష్మణ్‌ బాపూజీ ప్రముఖపాత్ర పోషించారు. క్విట్‌ ఇండియా ఉద్యమం, స్వాతంత్య్ర పోరు, నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావడానికి జరిగిన పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1969 నుంచి కొనసాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 2008 నవంబర్‌లో ఆయన ప్రత్యేక తెలంగాణను తమకు తాము ప్రకటించుకొంటామని సంచలన ప్రకటన చేశారు. 2009నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ సాయుధ సమితిని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాజకీయ ఐకాస, టీఆర్‌ఎస్‌లతో ఇతర రాజకీయ పార్టీల విధానాలతో ఆయన విభేధించారు. నవ తెలంగాణ ప్రజాపార్టీని ప్రకటించారు. 96 ఏళ్ల వయస్సులోనూ ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. సెప్టెంబర్‌ 22, 2012న  మరణించే వరకు తెలంగాణ సాధన కోసం కృషి చేశారు.

Updated Date - 2021-09-17T04:51:09+05:30 IST