పురుషుల కంటే మహిళలే అధికం
తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
కలెక్టరేట్, జనవరి 15: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఓటరు జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 18,95,099 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. ఫిబ్రవరిలో 18,56,000 మంది ఓటర్లు ఉండగా.. గత నవంబరు 16 విడుదల చేసిన డ్రాప్ట్ రోల్ ప్రకారం 18,65,266 మంది ఓటర్లు ఉన్నట్టు చూపారు. ఇప్పుడు ఆ సంఖ్య 18,95099కు చేరుకుంది. కొత్తగా 30 వేల మంది ఓటు హక్కు పొందారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 34,277 మంది ఓటు హక్కు పొందారు. వివిధ కారణాలతో 4,444 ఓట్లను తొలగించారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో 9,33,495 మంది పురుషులు ఉండగా, 9,61,464 మంది మహిళలు ఉన్నారు. పురుషులు కంటే మహిళలు 27,969 మంది ఎక్కువగా ఉన్నారు. విజయనగరం నియోజవర్గంలో అత్యధికంగా 2,42,309 మంది ఓటర్లు ఉండగా.. పార్వతీపురం నియోజవర్గంలో అత్యల్పంగా 1,88,714 మంది ఓటర్లు ఉన్నారు.