మొర వినుము.. మంత్రివర్యా..!

ABN , First Publish Date - 2022-05-10T06:34:02+05:30 IST

మొర వినుము.. మంత్రివర్యా..!

మొర వినుము.. మంత్రివర్యా..!

నేడు జిల్లా సమీక్షా మండలి సమావేశం

ఇన్‌చార్జి మంత్రి హోదాలో రోజా మొదటిసారి రాక

నాయకుల మధ్య సయోధ్య అవసరం

మంత్రివర్గ విభజన తర్వాత పెరిగిన వైరుధ్యాలు

బందరు పోర్టుకు అందని నిధులు

కార్యాలయాల ఏర్పాటు అత్యవసరం

ఇంకా పెండింగ్‌లోనే అభివృద్ధి ప్రతిపాదనలు 

పరిష్కరిస్తేనే కొత్త జిల్లా పురోభివృద్ధి సాధ్యం


జిల్లాను విభజించారు సరే, పాలనను మాత్రం విస్మరించారు. కార్యాలయాల ఏర్పాటుపై కన్నెత్తి చూడలేదు. జిల్లాకు ఓ మంత్రి పదవి ఇచ్చారు ఓకే, నాయకుల మధ్య సయోధ్యను మాత్రం మరిచారు. బందరు పోర్టును కదిలించినా, నిధులు మాత్రం విదిలించలేదు. జగనన్న లే అవుట్లలో పూర్తికాని ఇళ్ల నిర్మాణాలు, కాల్వలు, డ్రెయినేజీల మరమ్మతులకు ఆమోదం పొందని ప్రతిపాదనలు, వ్యవసాయం, ఆక్వాను దెబ్బతీస్తున్న విద్యుత్‌ కోతలు, అధ్వానపు రహదారులు.. ఒక్కటేమిటి జిల్లాలో అడుగడుగునా అపరిష్కృతం కాని సమస్యలే. జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి హోదాలో మంగళవారం మొదటిసారి సమీక్షా సమావేశం నిర్వహించనున్న ఆర్‌కే రోజా వీటన్నింటిపై దృష్టిపెట్టి పరిష్కార మార్గాలు చూపుతారా లేక పరిచయాలతో మమ.. అనిపిస్తారా చూడాలి.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాల విభజన, మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలిసారి జిల్లా ఇన్‌చార్జి మంత్రి హోదాలో ఆర్‌కే రోజా మంగళవారం మచిలీపట్నం వస్తున్నారు. జడ్పీ కన్వెన్షన్‌ హాల్లో జరిగే సమావేశంలో ఆమె పాల్గొంటారు. తొలుత జిల్ల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో పరిచయ కార్యక్రమంతో పాటు సమీక్ష జరుగుతుంది. ఈ సమావేశానికి అధికారులంతా పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు సూచించారు. అసలు ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారా లేక పరిచయ కార్యక్రమాలతో సరిపెడతారా అనేది చూడాలి.

విభేదాలు సరిచేస్తారా..

మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యాక జిల్లాలోని ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు అధికమయ్యాయి. బహిరంగంగా చెప్పకున్నా అధికార పార్టీ శాసనసభ్యులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. గతంలో జిల్లాకు చెందిన పేర్ని నాని, కొడాలి నాని మంత్రులుగా పనిచేయగా, ప్రస్తుతం జోగి రమేశ్‌కు ఆ అవకాశం దక్కింది. తమకు మంత్రి పదవి రాకుండా ఉండటానికి జిల్లాకు చెందిన శాసనసభ్యులే కారణమని మాజీ మంత్రులు, తనకు మంత్రి పదవి రాకపోవడానికి కొందరు ఇచ్చిన తప్పుడు సమాచారమే కారణమని పెనమలూరు శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ శాసనసభ్యుల మధ్య ఆధిపత్య పోరు పైకి కనిపించకున్నా లోపల మాత్రం యుద్ధమే నడుస్తోంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీమంత్రి పేర్ని నాని మధ్య విభేదాలున్నాయి. ఇటీవల జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో రూ.1.81 కోట్లతో స్కానింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌ అంశంపై మాజీమంత్రి పేర్ని నాని అధికారులపై కేకలు వేయడం చర్చనీయాంశమైంది. ఈ స్కానింగ్‌ మిషన్‌ ఎంపీ సిఫార్సు లేఖ ద్వారానే వచ్చిందని ఆయన వర్గీయులు సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు. అలాగే, ప్రస్తుత మంత్రి జోగి రమేశ్‌కు, జిల్లాకు చెందిన శాసనసభ్యులకు మధ్య సయోధ్య లేదనే చెప్పాలి. అధికార పార్టీ శాసనసభ్యుల మధ్య నెలకొన్న విభేదాలపై ఇన్‌చార్జి మంత్రి అయినా దృష్టిసారించి సరిచేస్తారా, సయోధ్య కుదురుస్తారా చూడాలి. మంత్రి జోగి రమేశ్‌ తరచూ తన రాజకీయ గురువు సామినేని ఉదయభాను అని చెబుతుండటంపై కూడా చర్చ నడుస్తోంది. 

వ్యవసాయంపై చర్చ జరుగుతుందా..

జిల్లాలో 1.79 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతున్నాయి. రానున్న ఖరీఫ్‌కు సంబంధించి వ్యవసాయ ప్రణాళిక ఇంకా కొలిక్కి రాలేదు. వేసవిలో తాగునీటి కోసం ప్రస్తుతం కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగునీటి కాల్వలకు, డ్రెయినేజీలకు మర మ్మతుల కోసం రూ.55 కోట్లతో అంచనాలు తయారుచేసి పంపగా, ఆమోదం పొందలేదు. గత ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోలుకు ఈ-క్రాప్‌ సక్రమంగా జరగలేదు. జిల్లాలో 8 వేల మందికి పైగా రైతుల నమోదు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. గత ఏడాది డిసెంబరులో కోతలు పూర్తయితే ఈ ఏడాది మేలో రైతుల వద్ద ఉన్న 1.44 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుపై సందిగ్ధం నెలకొంది. రైస్‌ మిల్లులపై విద్యుత్‌ కోత ల ప్రభావం పడింది. జిల్ల్లాలో 173 రైస్‌ మిల్లులుండగా, వారంలో రెండు రోజులు కూడా మిల్లులు ఆడకూడదని, మిగిలిన ఐదు రోజులు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే మిల్లులు పనిచేయాలని ఆంక్షలు పెట్టారు. దీంతో మిల్లర్లు ఽధాన్యం కొనుగోలు చేయకుండా మిన్నకుండిపోతున్నారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీటి విడుదల అంశంపై ఇంకా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించలేదు. వచ్చే ఖరీఫ్‌కు సాగునీటి విడుదల విషయంతో పాటు జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉన్న బందరు పోర్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు, అధ్వానంగా మారిన రహదారుల అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చిస్తారా, లేదా చూడాలి.

అభివృద్ధి పనులపై చర్చ జరిగేనా

జిల్లాల విభజన జరిగి నెల దాటింది. పరిపాలన ఇంకా గాడిలో పడలేదు. అధిక శాతం శాఖల్లో ఉద్యోగుల విభజన జరగలేదు. కలెక్టర్‌, జేసీ మరికొంతమంది అధికారులే అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన జిల్లాస్థాయి అధికారులు ఎన్టీఆర్‌ జిల్లాకే పరిమితమవుతున్నారు. కార్యాలయాలకు భవనాలు అందుబాటులో లేవు. ప్రస్తుతం జిల్లాలో గృహ నిర్మాణాల అంశం కీలకం. జిల్లాలో 79,242 ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం. ఇప్పటివరకు శ్లాబు వేసిన ఇళ్లు కేవలం 370 మాత్రమే. జగనన్న లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణం కోసం నీరు, కరెంట్‌ వంటివి అందుబాటులో లేవు. దీంతో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. 













Read more