జిల్లాలు.. వినతులు : ఎక్కువగా పేర్లు మార్చమనే Jagan Sarkar కు సూచనలు

ABN , First Publish Date - 2022-02-14T05:45:36+05:30 IST

జిల్లాలు.. వినతులు.. ఎక్కువగా జిల్లాల పేర్లు మార్చమనే Jagan Sarkar కు సూచనలు..

జిల్లాలు.. వినతులు : ఎక్కువగా పేర్లు మార్చమనే Jagan Sarkar కు సూచనలు

కొన్ని డివిజన్ల హద్దులు కూడా సవరించాలని లేఖలు

పరిశీలిస్తోన్న జేసీల నేతృత్వ సబ్‌ కమిటీలు


గుంటూరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ మండలాల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కలెక్టరేట్‌కి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిల్లాల పేర్లు మార్చాలని పలువురు కోరుతూ తమ సూచనలు అందజేశారు. ప్రధానంగా పల్నాడు/నరసరావుపేట జిల్లాకు మహాకవి గుర్రం జాషువా పేరు పెట్టాలని కోరుతున్నారు. అలానే గుంటూరుని ఆచార్య ఎన్‌జీ రంగా పేరుతో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. కొన్ని మండలాలకు డివిజన్‌ కేంద్రం చాలా దూరంగా ఉండటంతో వాటిని సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కొంతమంది నేరుగా, కొందరు పోస్టు ద్వారా కలెక్టరేట్‌కి జిల్లాల ఏర్పాటుపై తమ సూచనలు, సలహాలు తెలియజేస్తున్నారు. ఒకే విధంగా ఉన్న వాటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు రెవెన్యూవర్గాలు నివేదికలు రూపొందిస్తున్నాయి. 


జిల్లాల విభజన శాస్త్రీయంగా జరిగేలా చూసేందుకు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ నాలుగు సబ్‌ కమిటీలను నియమించారు. జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) నేతృత్వంలో రెండు, జేసీ(సచివాలయాలు), జేసీ(ఆసర) పర్యవేక్షణలో మరో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీ నిర్వర్తించాలని విధులను నిర్దేశించారు. ప్రధానంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల విభజన, ఆస్తులు, రికార్డులు, కార్యాలయాలు, గెస్టుహౌస్‌లు వంటివి సమానంగా విభజన జరిగేలా ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. 


ఎప్పటినుంచో జిల్లాకు గుంటూరు నగరం హెడ్‌క్వార్టర్స్‌గా ఉండటంతో అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు అయ్యాయి. అలానే మెడికల్‌ కళాశాలలు, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, నగరపాలకసంస్థలు గుంటూరు నగరానికి సమీపంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిపాదిత గుంటూరు జిల్లాలో ఉన్నాయి. మరోవైపు ప్రతిపాదిత  నరసరావుపేట/పల్నాడు, బాపట్ల జిల్లాల్లో డివిజనల్‌, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలే అందుబాటులో ఉన్నాయి. బాపట్లకు రాష్ట్రస్థాయి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలున్నాయి. అందుబాటులో ఉన్న సాగు/తాగునీటి వనరులను కాలువల వారీగా విభజించాల్సి ఉంది. జనాభా దామాషా ప్రకారం కొన్నింటిని విభజించాలి. వీటన్నింటిని జాయింట్‌ కలెక్టర్లు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారని రెవెన్యూవర్గాలు తెలిపాయి. రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదించినందున భూములకు సంబంధించిన రికార్డులను జాగ్రత్తగా వేరు చేయాల్సి ఉన్నది. కొద్ది రోజుల్లో ఆయా సబ్‌ కమిటీలతో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సమావేశమై ఇప్పటివరకు సాధించిన పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న తలంపుతో ప్రభుత్వం ఉన్న దృష్ట్యా అందుకు అనుగుణంగానే ప్రక్రియ పూర్తి చేస్తోన్నామని పేర్కొన్నారు.



Updated Date - 2022-02-14T05:45:36+05:30 IST