ఇంటర్‌.. పూర్‌!

ABN , First Publish Date - 2022-06-23T05:21:07+05:30 IST

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా వెనుకబడింది. సీనియర్‌, జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తొమ్మిది, పది స్థానాలకు దిగజారింది. ఒకేషనల్‌ ఫలితాల్లో మాత్రం కాస్త మెరుగైన స్థితిలో నిలిచింది. బుధవారం ఇంటర్‌ ఫలితాలు వెలువడ్డాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి పరీక్షలకు 26,052 మంది హాజరుకాగా.. కేవలం 14,729 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 57 శాతం ఉత్తీర్ణతే నమోదైంది. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 25,911 మంది పరీక్షకు హా

ఇంటర్‌.. పూర్‌!
పరీక్ష రాస్తున్న విద్యార్థులు (ఫైల్‌)

ఫలితాల్లో వెనుకబడిన జిల్లా
సీనియర్‌లో తొమ్మిది, జూనియర్‌లో పదో స్థానం
‘ఒకేషనల్‌’లో కాస్త పురోగతి
ఓవరాల్‌గా బాలికలే టాప్‌
(శ్రీకాకుళ,ఆంధ్రజ్యోతి)

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా వెనుకబడింది. సీనియర్‌, జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తొమ్మిది, పది స్థానాలకు దిగజారింది. ఒకేషనల్‌ ఫలితాల్లో మాత్రం కాస్త మెరుగైన స్థితిలో నిలిచింది. బుధవారం ఇంటర్‌ ఫలితాలు వెలువడ్డాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి పరీక్షలకు 26,052 మంది హాజరుకాగా.. కేవలం 14,729 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 57 శాతం ఉత్తీర్ణతే నమోదైంది. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 25,911 మంది పరీక్షకు హాజరుకాగా.. 11,994 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 46శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగున నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి తొమ్మిదో స్థానం, ప్రథమ సంవత్సరం పదో స్థానంలో నిలవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.

బాలికలే టాప్‌..
ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే టాప్‌గా నిలిచారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు బాలురు 12,219 మంది హాజరుకాగా.. 4,807 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కేవలం 39 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 13,692 మంది హాజరుకాగా 7,187 మంది ఉత్తీర్ణత పొందారు. 52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురతో పోల్చితే బాలికల ఉత్తీర్ణత శాతం 13 శాతం ఎక్కువ. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 12,607 మంది బాలురు హాజరయ్యారు. ఇందులో 6,116 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 13,445 మంది హాజరుకాగా 8,613 మంది ఉత్తీర్ణత సాధించారు. 64 శాతం ఉత్తీర్ణతతో బాలురు కంటే 15 శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించింది. కాగా గత నాలుగేళ్ల ఫలితాలను విశ్లేషిస్తే ఈ ఏడాదే తక్కువ శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది.

గత నాలుగేళ్లుగా..

2018-19లో 25,630 మంది పరీక్షలకు హాజరుకాగా.. 15,930 మంది ఉత్తీర్ణత సాధించారు. 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2019-20లో 28,818 మంది పరీక్షకు హాజరుకాగా..14,380 మంది ఉత్తీర్ణులయ్యారు. 50 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2020-21లో కరోనా కారణంగా ఇంటర్‌ ఫలితాలు వెలువరించలేదు. మొత్తం 29,729 మంది విద్యార్థులకుగాను ఆల్‌పాస్‌గా చూపించారు. 2021-22లో 26,052 మంది హాజరుకాగా.. 14,729 మంది ఉత్తీర్ణత సాధించారు. 57 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

 వృత్తి విద్యా కోర్సుల్లో..
వృత్తివిద్యా కోర్సుల ఫలితాల్లో కాస్త మెరుగైన ఫలితాలే సాధించింది. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది.  జిల్లా నుంచి 1,899 మంది పరీక్ష రాయగా.. 1,158 మంది ఉత్తీర్ణత సాధించారు. 61 శాతం ఉత్తీర్ణత లభించింది. ఇక మొదటి సంవత్సరం ఫలితాలను విశ్లేషిస్తే... 1924 మంది పరీక్షలకు హాజరుకాగా.. 836 మంది ఉత్తీర్ణులయ్యారు. 43 శాతం ఉత్తీర్ణత లభించింది. రాష్ట్రంలో జిల్లాకు తొమ్మిదో స్థానం లభించింది.


Updated Date - 2022-06-23T05:21:07+05:30 IST